
పీజే కురియన్
భువనేశ్వర్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించుతుందని పార్టీ సీనియర్ నేత ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నందున వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ ఎన్నిక జరుగనుంది. ‘బీజేపీ తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచుతాం. ముందుగా ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తాం.
అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. ఆ పదవిని ఆశించే వారిలో ముఖ్యంగా బీజేడీ నేత ప్రసన్న ఆచార్య, తృణమూల్ నేత సుఖేందు శేఖర్ ఉన్నట్లు మీడియా వర్గాల సమాచారం. బీజేపీని దూరంగా ఉంచేందుకు బీజేడీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వెలువడ్డాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు 122 ఓట్లు అవసరం ఉంటుంది. రాజ్యసభలో బీజేపీకి 67 మంది సభ్యులు, కాంగ్రెస్‌కు 51 మంది, బీజేడీకి 9 మంది సభ్యుల బలముంది.