
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భువనేశ్వర్: నేటి నుంచి రెండ్రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఒడిశా రాజధాని భువనేశ్వర్ సిద్ధమైంది.ప్రధాని మోదీ సహా పార్టీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు, 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొంటారని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఆరోగ్య కారణాల రీత్యా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరుకావడం లేదని తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషీలు సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ భువనేశ్వర్ చేరుకుని, సాయంత్రం 5 గంటల సమయంలో ప్రాంగణానికి వస్తారని వెల్లడించారు. ఈ కార్యవర్గ భేటీలో రెండు విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, 2019 సాధారణ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు.