
2019లో అధికారం బీజేపీదే: ధర్మేంద్ర ప్రధాన్
షామీర్‌పేట : దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తోందని, ప్రపంచం మోదీ వైపు చూస్తోందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మోదీ సర్కారు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతలు రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని సెయింట్ క్లారిటీ పాఠశాల మైదానంలో వికాస్ పర్వ్ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు.
బీజేపీ తీసుకొచ్చిన తెలంగాణలో ఓ కుటుంబం రాష్ట్ర పాలనను భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పల్లెపల్లెకూ బీజేపీ.. ఇంటింటికీ మోదీ పేరుతో బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, రామ్‌కృపాల్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.