సభకు వచ్చిన జనాన్ని తన ఫోన్‌లో ఫొటో తీస్తున్న కేంద్ర మంర్రి ధర్మేంద్ర
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతానికి రావడం పట్ల గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. విజయవంతమైన చంద్రయాన్–3 ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం సంతోషకరం అన్నారు.
ఇలాంటి రాష్ట్రంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం అని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమష్టి కృషితో రూ.800 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారమవుతోందన్నారు. 561 ఎకరాల భూమి, విద్యుత్తు, రోడ్డు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ చొరవ తీసుకొని ముందుకు వచ్చారని తెలిపారు. 21వ శతాబ్దానికి ఆధునిక దేవాలయమైన ఈ విశ్వ విద్యాలయం సాలూరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటవ్వడం వల్ల పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్టాల్లోని గిరిజనులతో సామాజిక అనుబంధం ఏర్పడుతుందన్నారు.
గిరిజనుల ప్రగతికి దోహదం
ఇక్కడ ప్రసిద్ధి గాంచిన అరకు కాఫీ, నల్ల మిరియాలు, తేనె, పనస, పైనాపిల్ తదితర అటవీ పంటలపై పరిశోధనకు ఈ వర్సిటీ ద్వారా అవకాశం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఒడిశాలో ఉన్న యూనివర్సిటీతో ఈ వర్సిటీ భాగస్వామ్యమైతే దేశంలో గిరిజనుల ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్లవచ్చని ఆకాంక్షించారు.
ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖ, గంగవరం పోర్టులను కలిపే గ్రీన్‌ఫీల్డ్ హైవే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ట్రైబల్ వర్సిటీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, స్థానికంగా ప్రజల మాతృభాషనూ ప్రోత్సహిస్తూ బోధనలో బైలింగ్‌వల్ టెక్ట్స్ బుక్స్‌ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
కళ్లెదుటే అభివృద్ధి
► భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గిరిజన ప్రాంతంలోకి వెళ్తుంటే మనం గిరిజనుల కోసం ఏం చేశామో కళ్లెదుటే కనిపిస్తోంది. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజినీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒకటి కాదు.. రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఏర్పాటు చేశాం. ఇవాళ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం.
► రూ.వెయ్యి కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లా పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణమవుతోంది. గిరిజన ప్రాంతానికి గేట్‌వేగా ఉన్న నర్సీపట్నంలో ఇంకో కాలేజీ కడుతున్నాం.
► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం మన కళ్ల ముందే కనిపిస్తోంది. గిరిజన తండాలో జనాభా 500 ఉంటే గ్రామ పంచాయతీగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని మాట ఇచ్చాం. ఆ ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో రూ.250 కోట్లు ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి.
► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన అసైన్‌మెంట్ భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment