గిరిపుత్రుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చాం : సీఎం జగన్‌ | CM YS Jagan Key Comments Over Central Tribal University | Sakshi
Sakshi News home page

గిరిపుత్రుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చాం : సీఎం జగన్‌

Published Fri, Aug 25 2023 12:49 PM | Last Updated on Fri, Aug 25 2023 4:21 PM

CM YS Jagan Key Comments Over Central Tribal University - Sakshi

సాక్షి, విజయనగరం: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.

నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. 

సీఎం జగన్‌ కామెంట్స్‌

చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య ఈరోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతోంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తున్నా. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతిస్నేహితుడికీ, నిండు మనసుతో రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 

► ఈరోజు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలకు పునాదులు వేస్తున్నాం. దాదాపు 830 కోట్ల ప్రాజెక్టు. మరో మూడు సంవత్సరాలకు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టు. మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గిరి పుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది.

రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు ఇక్కడి నుంచి బీజం పడబోతోంది. మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ ఉండేది. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వారు. కల్మషం లేని మనసులు కలిగిన వారు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు. ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో వెనకాలే ఉన్నారు.  ఈనాలుగు సంవత్సరాల పరిపాలనలో విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా కానీ గిరిజనులను గుండెల్లో పెట్టుకొని అడుగులు వేశామని గర్వంగా చెప్పలగుతా. ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. 

► తరతరలాలుగా నిర్లక్షానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ఈరోజు గిరిపుత్రులకు అభివృద్ధిపట్ల మనందరి ప్రభుత్వం బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోందో నాలుగు మాటల్లో పంచుకుంటా. విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, మన పిల్లలు గెలవాలని, వారు చదువుకొనే మీడియంలో మార్పులు తీసుకొచ్చాం.  గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి ఉందని మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెబుతున్నా. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ అమలవుతోంది. నాడు-నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు మార్చబడుతూ కనిపిస్తున్నాయి.

► విద్యాకానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగువల్ టెక్స్ట్ బుక్కులతో మార్చగలుగుతున్నాం.  ప్రతి గవర్నమెంట్ బడిలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ తెస్తూ, ఐఎఫ్‌పీలను ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే ఆ పిల్లలందరికీ వారి చేతిలో ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది.  చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా అనే కార్యక్రమాలను తీసుకొచ్చాం.  దేశంలో ఎక్కడా జరగని విధంగా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తెచ్చాం.  మెరుగైన చదువులు, కరిక్యులమ్ లో మార్పులు తెచ్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే.

► ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది.  పాడేరులో మరో మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో మూడో  మెడికల్ కాలేజీ కట్టబడుతోంది.  ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త దూరం కురుపాంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టబడుతోంది. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతోందో చెప్పడానికి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కనిపిస్తుంది.  అక్కడ నుంచి కాస్త దూరంలో పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నది మన కళ్ల ఎదుట కనిపిస్తోంది. 

► మరికాస్త దూరంలో సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. మరో నాలుగు అడుగులు ముందుకు వెళ్లి చూస్తే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ మనకు కనిపిస్తోంది. ఒక్క గిరిజన ప్రాంతలోనే రెండు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, నాడు-నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు గిరిజనులకు కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.  మనందరి ప్రభుత్వం 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో మీ అందరితో నాలుగు మాటలు పంచుకుంటా. నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా గిరిజనులకు నా పక్కనే పెట్టుకున్నా. ఏ నామినేటెడ్ పదవి, కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేట్లుగా ఏకంగా చట్టం చేసి కార్యరూపం చేస్తున్నాం.

ఇంకా ఏమన్నారంటే.. 

► మొట్ట మొదట గిరిజన చెల్లెమ్మకు, నా గిరిజన అన్నకు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ బద్ధంగా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమించిన చరిత్ర మీ బిడ్డ ప్రభుత్వంలోనే. నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీ కూడా మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాం.  ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాం.  2019 జూలై నుంచి 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం 410 కోట్లు ఖర్చు చేశామని సవినయంగా తెలియజేస్తున్నా.  గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం.  దాన్ని నిలబెట్టుకుంటూ ఒక జిల్లా కాదు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది.  సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. 

► రూ.1000 కోట్లతో అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లాలో పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది.  కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం అని చెబితే మన కళ్ల ఎదుటే నిర్మాణం కనిపిస్తోంది. గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం.  ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాస్తామని మాట ఇచ్చాం. మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి జిల్లా రంపచోడవం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకారం జిల్లా దోర్నాలలో 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లు కనిపించే కార్యక్రమం జరుగుతోంది.

► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశామని తెలియజేస్తున్నా.  ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. వారి బాగోగుల కోసం 153820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ, 322538 ఎకరాలను ఆర్వోఎఫ్ ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమే.

► గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారు ఏకంగా 84 శాతం ఉద్యోగాలు వాళ్లే చేస్తూ అక్కడే కనిపిస్తున్నారు.  మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ములు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నా. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. 

► అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి.  గిరిజనుల వరకు మాత్రమే చూస్తే 50 నెలల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు 11548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు రూ.5,257 కోట్లు మేలు కలిగింది.  మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే అక్షరాలా 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్లు నేరుగా వాళ్లకు వెళ్లాయి. 

ఈ ప్రాంతంలో మీకు జరిగిన మార్పును మీకు తెలియజేసేందుకు ఇవన్నీ చెబుతున్నా.  ఈ యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోంది. రాబోయే రోజుల్లో తరతరాలు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని తెలియజేస్తున్నా. దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సహకారం మరింతగా రావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement