ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం: సీఎం జగన్‌ | CM YS Jagan Vizianagaram Tour Live Updates | Sakshi
Sakshi News home page

గిరిజన వర్సిటీ: సీఎం జగన్‌ విజయనగరం పర్యటన లైవ్‌ అప్‌డేట్స్‌

Published Fri, Aug 25 2023 9:10 AM | Last Updated on Fri, Aug 25 2023 1:22 PM

CM YS Jagan Vizianagaram Tour Live Updates - Sakshi

Updates..

ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు.

 నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. 

 మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చాం. 

 కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్‌ కాలేజీ రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. 

 రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. 

► కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్‌ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్‌ తలచారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నాం. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయం. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతాం. 

► కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

► ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర మంత్రులు,  ఎ‍మ్మెల్యేలు. 

► మన్యం జిల్లా చినమేడపల్లి చేరుకున్న సీఎం జగన్‌

► కాసేపట్లో కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్‌.

► రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.

► విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారు. 

► విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. 

గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ 
గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు.  

అందించే కోర్సులు 
ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్‌ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14 కోర్సులను అందిస్తారు.

► వీటితో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్, ఒకేషనల్, జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్‌ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement