సీఎం రమేష్‌ను సంప్రదించిన జవదేకర్ ?
నేడు మోడీని కలవనున్న పవన్ కల్యాణ్?
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీపీడీ మధ్య సర్దుబాట్లపై చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా నగరంలో మకాం వేసి ఉన్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పొత్తు బాధ్యతలు చూస్తున్న అరుణ్ జైట్లీ దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్లు నల్లు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులతో సోమవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. గతంలో పొత్తు ప్రాతిపదికలను వీరి నుంచి తెలుసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటరీలోని నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఫోన్‌లో సంప్రదించినట్టు తెలిసింది. ఈ వివరాలను కిషన్‌రెడ్డికి చెప్పగా... పొత్తును కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. జవదేకర్ అసహనం వ్యక్తంచేస్తూ... ముగిసిన వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడవద్దని సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో మెజారిటీ సీట్లన్నా దక్కేటట్లు చూడమని కోరడంతో జవదేకర్ మధ్యాహ్నం మరోసారి సీఎం రమేష్‌ను సంప్రదించారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వినాలన్న సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు బీజేపీ తెలంగాణలో 64 అసెంబ్లీ, 9 లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో 6 లోక్‌సభ, 25ఎమ్మెల్యేల సీట్లు కోరుతున్నట్టు తెలిసింది. కాగా, తెలంగాణ శాఖ సమ్మతించినా లేకున్నా తాము పొత్తుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ నేతలు జవదేకర్‌కు స్పష్టం చేశారు.
21 నాటికి పార్టీ ప్రణాళిక ముసాయిదా
మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ ఎన్నికల ప్రణాళిక ముసాయిదాకు ఒక రూపం ఇచ్చారు. డాక్టర్ రాజేశ్వరరావు నాయకత్వంలోని ఈ కమిటీ ఈనెల 21న ముసాయిదా ప్రతిని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అందజేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు సంక్షేమం, అభివృద్ధిపై అనేక హామీలు గుప్పించినట్టు తెలిసింది.
పవన్ కళ్యాణ్, మోడీ భేటీ నేడు?
జనసేన పార్టీని ప్రారంభించిన సినీనటుడు పవన్‌కల్యాణ్ మంగళవారం అహ్మదాబాద్ లేదా న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దక్షిణాదికి చెందిన ఓ సినీ ప్రముఖుడి మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరుగుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి పవన్ కల్యాణ్ సోమవారమే కలుస్తారని ప్రచారం జరిగింది.
పురందేశ్వరి ఏ సీటూ కోరలేదు: బీజేపీ
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఏ లోక్‌సభ సీటూ కోరలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ తెలిపారు. ఆమె స్వచ్ఛందంగానే పార్టీలో చేరారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం సీటును కేటాయించమని ఆమె కోరినట్టు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు.
టీడీపీ-బీజేపీ పొత్తుపై మంతనాలు!
Published Tue, Mar 18 2014 2:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement