మరోసారి చర్చల పర్వం
ఇరుగూ పొరుగూ అన్నాక పొరపొచ్చాలు సహజం. అడపా దడపా ఘర్షణలూ తప్పవు. కానీ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్నంత బలహీనంగా, పెళుసుగా ఏ రెండు దేశాల సంబంధాలూ ఉండవన్నది నిజం. రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగడం, ఒక ఆశారేఖ తళుక్కుమనడం... ఇంతలోనే అధీనరేఖవద్ద తుపాకులు గర్జించడం, రెండువైపులనుంచీ హెచ్చరికలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తడం ఒక రివాజుగా మారింది.
మధ్యన ఏదో అంశంపై అలకలు, కార్యదర్శుల స్థాయి చర్చలో, మరొకటో నిలిచిపోవడమూ మామూలే. అందువల్లే శుక్రవారం రష్యాలోని ఉఫాలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్‌ఓసీ) సదస్సుల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన చర్చలను అందరూ స్వాగతిస్తున్నా వాటిపై పెద్ద ఆశలేమీ పెట్టుకోవడం లేదు. అయితే అధినేతలిద్దరి మధ్యా ముందు అరగంట చర్చలుంటాయనుకున్నది గంటసేపు జరగడం ఒక శుభసూచకమని విశ్లేషకుల భావన.
నిరుడు తన ప్రమాణస్వీకారానికి మిగిలిన సార్క్ దేశాల అధినేతలతోపాటు నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడంద్వారా నరేంద్ర మోదీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పుడే ఇద్దరి మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకు ఏడాదిక్రితం పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నవాజ్ ఇరు దేశాల సంబంధాలపై విభిన్నంగా మాట్లాడటంవల్ల ఈ చర్చల ఫలితంపై ఎన్నో ఆశలు రేకెత్తాయి. తమ భూభాగాన్ని ఉగ్రవాదులు భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడాన్ని అంగీకరించబోమని నవాజ్ అప్పట్లో చెప్పారు. అంతేకాదు...ముంబై దాడుల్లో తమ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం గురించి కూడా సమీక్షిస్తానని, కార్గిల్ విషయంలో జరిగిందేమిటో వెల్లడిస్తానని అన్నారు. అటు తర్వాత ఐక్యరాజ్యసమితిలో మాట్లాడినప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు.
పాక్ ప్రధానిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం అసాధారణం. ఈలోగా ఇక్కడ మోదీ అధికారంలోకి రావడం, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరగడంతో ఇరు దేశాల మధ్యా కొత్త శకం ఆవిష్కృతం అవుతుందనుకున్నారు. అయితే, ఆ చర్చలైన కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి. సరిహద్దుల్లో యధావిధిగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ముందు రెచ్చగొట్టింది మీరంటే మీరని ఆరోపణలు వినిపించాయి. మోదీ-నవాజ్ ద్వైపాక్షిక చర్చలకు కొనసాగింపుగా నిరుడు ఆగస్టులో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు హఠాత్తుగా రద్దయ్యాయి. న్యూఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషనర్ మన ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా వేర్పాటువాద హురియత్ నేతలతో సమావేశం కావడంవల్లే ఈ స్థితి ఏర్పడింది.
‘మీరు ఎవరితో చర్చలు జరపాలనుకుంటున్నారు...భారత ప్రభుత్వంతోనా, వేర్పాటువాదులతోనా, తేల్చుకోండి’ అని మన ప్రభుత్వం ఆ సందర్భంగా పాక్‌కు అల్టిమేటం కూడా ఇచ్చింది. ఆ తర్వాత నిరుడు కఠ్మాండూలో జరిగిన సార్క్ దేశాల అధినేతల సమావేశంలో మోదీ, నవాజ్‌లు పరస్పరం ఎదురుపడి చిరునవ్వులు చిందించుకోవడం మినహా పలకరింపులే లేవు... ఇక ద్వైపాక్షిక చర్చల మాట చెప్పేదేముంది? ఇలాంటి సమయంలో ఉఫాలో రెండు దేశాల అధినేతల మధ్యా జరిగిన చర్చలు ఆశ్చర్యపరచడం సహజమే.
ఇరు దేశాలమధ్యా స్తంభించిన చర్చల ప్రక్రియను పునరుద్ధరించుకోవాలని, ముంబై దాడి కేసు నిందితులపై విచారణ త్వరితగతిన జరగడానికి వీలైన చర్యలు తీసుకోవాలని చర్చల అనంతరం విడుదలైన ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఈ చర్చలు ప్రధానంగా ఉగ్రవాదంపైనా, దాని ధోరణులపైనా సాగాయని వివరించింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటన తెలిపింది. ఈ చర్చలకు కొనసాగింపుగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళానికి, పాకిస్థాన్ రేంజర్స్ మధ్యా...ఆ తర్వాత ఇరు దేశాల మిలిటరీ డెరైక్టర్ జనరళ్ల మధ్యా సంప్రదింపులు సాగుతాయని ఈ ఉమ్మడి ప్రకటన చెప్పడం ఆశావహమైన పరిణామం.
అలాగే, ముంబై దాడుల్లో ప్రమేయమున్నదని చెబుతున్న ఉగ్రవాదుల స్వర నమూనాలను అందించడంతోసహా వివిధ చర్యలు తీసుకోవాలనుకోవడం కూడా ఒక ముందడుగే. అయితే, రెండు దేశాలకూ మధ్య అత్యంత కీలకమైన సమస్యగా ఉన్న కశ్మీర్ సంగతి ఇందులో ప్రస్తావనకే రాకపోవడంవల్ల ఈ చర్చల కథ కూడా కంచికే వెళ్తుందా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి.
ఈ చర్చల కోసం నరేంద్రమోదీ ఒక మెట్టు దిగారనే చెప్పాలి. స్నేహితులను ఎంచుకున్నట్టుగా మన పొరుగువారిని ఎంపిక చేసుకోవడం సాధ్యంకాదు. ఆ పొరుగు గిల్లికజ్జాలు పెట్టుకునేదైనా... వారి వ్యవహార శైలి మనకు నచ్చకపోయినా వారిని దారికి తెచ్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేయకతప్పదు. నిరుడు ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను మన దేశం నిలిపేయడాన్ని ఈ కారణంతోనే దౌత్య నిపుణులు వ్యతిరేకించారు. చర్చలనేవి నిరంతర ప్రక్రియగా ఉండక తప్పదు.
అందులో మన వైఖరేమిటో చెప్పడం, వారి వాదనలేమిటో తెలుసుకోవడం, ఉభయులూ కలిసి పనిచేయడానికి గల అవకాశాలేమిటో చూడటం, సమస్యల విషయంలో ఒక పరిష్కారాన్ని అన్వేషించడానికి ప్రయత్నించడం తప్పనిసరి. ఉగ్రవాదానికి ఊతమీయడంవంటి అంశాల్లో గట్టిగా అభ్యంతరాలు చెప్పడం, తీరు మారనప్పుడు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఏకాకిని చేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం చేయాలి. దీనికి ఓపిక ఉండాలి. వాస్తవ పరిస్థితులను గమనించే చాకచక్యం ఉండాలి. ఇప్పుడు పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధపడటం ద్వారా మోదీ తనకు ఆ ఓపిక, ఆ చాకచక్యం ఉన్నాయని నిరూపించారు.
అయితే, ఈ చర్చలు సత్ఫలితాలనీయాలంటే పాకిస్థాన్ తన పోకడను మార్చుకోవాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తనకు చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకోవాలి. అదంత సులభం కాదు. పాక్‌లో తన మాటే నెగ్గాలని అక్కడి సైన్యం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారత్‌తో సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించినప్పుడల్లా మోకాలడ్డుతుంది. అంతర్గతంగా పాకిస్థాన్‌లో ఆ సమస్య పరిష్కారమై అంతిమంగా ఇరుదేశాల మధ్యా శాంతిసామరస్యాలు నెలకొంటే అది రెండుచోట్లా అభివృద్ధికి బాటలు పరుస్తుంది.