భారత్‌తో చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన పాక్
వాషింగ్టన్ : భారత్‌తో శాంతి చర్చలు జరపడానికి యూపీ తదితర ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అనువైన సమయంగా పాకిస్తాన్ భావిస్తోంది. ‘ఈ ఎన్నికలన్నీ మార్చి నాటికి అయిపోతాయి. భారత్‌తో చర్చల పునరుద్ధరణకు అప్పుడు మెరుగైన వాతావరణం ఏర్పడుతుందనుకొంటున్నాం. మేం ఎప్పటికీ చర్చలకు కట్టుబడి ఉన్నాం’అని పాక్ ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అహసన్ ఇక్బాల్ చెప్పారు. భారత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడంపై పెద్దగా ప్రభావం ఉండదని ఓ అమెరికన్ మేధావి అడిగిన ప్రశ్నకు ఇక్బాల్ బదులిచ్చారు. ‘ఇది దురదృష్టకరం. వీటికి భిన్నంగా మన ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉంది. శాంతియుత వాతావరణం కోసం భారత్–పాక్‌లు కలిసి నడవాలి.
భౌగోళిక స్వరూపాలను మనం మార్చలేము’అన్నారు. ఈ విషయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎంతో చొరవ చూపుతున్నారన్నారు. 46 బిలియన్ డాలర్ల ‘చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’(సీపీఈసీ)పై భారత్ అభ్యంతరాలను తొందరపాటు వ్యాఖ్యలు గా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రాంతీయ సహకారం పెరుగుతుందన్నారు. వ్యతిరేకించేకంటే సీపీఈసీలో చేరి అందులోని విభిన్న అవకాశాలను అందిపుచ్చుకో వాలన్నారు. చైనాతో వర్తకానికి సీపీఈసీ వల్ల భారత్‌కు అత్యంత దగ్గరి మార్గం ఏర్పడుతుందన్నారు.