
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మధ్య ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. మిత్రపక్షాలు ఆశిస్తున్న సీట్లలో ఎవరికి ఏయే స్థానాలు ఇవ్వాలనే విషయమై టీడీపీ, టీజేఎస్, సీపీఐ ముఖ్య నేతలు ఎల్. రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి తదితరులతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక చర్చలు ప్రారంభించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు, ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నాలుగు పార్టీల నేతలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
ఈ చర్చల్లో ఇప్పటివరకు కేవలం 11 సీట్లపై మాత్రమే ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఏం చేద్దామన్న దానిపై ఆయా పార్టీల నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇతర పార్టీలు కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపగా కాంగ్రెస్ పార్టీ 95 చోట్ల బరిలో ఉండాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 12.. అనివార్యమైతే 13, టీజేఎస్‌కు 6–7, సీపీఐకి 4–5 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, ఈ మేరకు సీట్ల సంఖ్యపై నాలుగు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది.
శనివారం లేదా ఆదివారం రాత్రికల్లా సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన వీడే అవకాశముందని తెలుస్తోంది. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో 70–75 స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాలపై ఆయా పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. మిగిలిన స్థానాలపై శుక్రవారం నాటికి ఓ అంచనాకు రానున్నారు. ఆ తర్వాత మరోమారు అన్ని పార్టీల నేతలు సమావేశమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.
వ్యూహాత్మకంగా ముందుకు...
సీట్ల సర్దుబాటు తేలాక ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది... ఆయా పార్టీల తరఫున ఎవరు బరిలో ఉంటారనే విషయాలను అధికారికంగా ప్రకటించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కూటమిలోని పక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి తొలుత 50–60 స్థానాలపై 2–3 రోజుల్లో ప్రకటన చేయాలని, ఆ తర్వాత అధికార పార్టీ అనుసరించే వ్యూహాన్ని పరిశీలించి మిగిలిన అభ్యర్థులను తేల్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై కూటమిలోని ఓ ముఖ్య నేత మాట్లాడుతూ ‘కూటమిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది... ఏ పార్టీ అభ్యర్థులెవరు అని ప్రకటించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మా ప్రకటన కోసం టీఆర్‌ఎస్ ఎదురుచూస్తోంది. మేం అక్కడ చెప్పగానే, ఇక్కడ అసంతృప్తులను లాక్కునేందుకు సిద్ధంగా ఉంది. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకొని ముందుకెళ్తున్నాం. ఈసారి కేసీఆరే మా ట్రాప్‌లో పడాలి తప్ప మేం కేసీఆర్ ట్రాప్‌లో పడేది లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు.
అన్ని చోట్లా ఇబ్బందే...!
విశ్వసనీయ సమాచారం ప్రకారం... పొత్తుల్లో భాగంగా సీపీఐ అడుగుతున్న అన్ని చోట్లా కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. తొలు త 12 స్థానాలను ఇవ్వాలని పట్టుపట్టిన సీపీఐ ఆ తర్వాత 9 స్థానాలతో సరిపెట్టుకుంటామని చెప్పింది. కానీ కాంగ్రెస్ మాత్రం 4–5 స్థానాలను ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సీపీఐ ప్రతిపాదించిన హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, మునుగోడు, దేవరకొండ స్థానాలన్నింటిలోనూ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే ఉండటంతో సీపీఐ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంలో స్పష్టత వచ్చేందుకు సమయం పట్టనుంది.
మూడు ఓకే.. మూడు పెండింగ్...
తెలంగాణ జనసమితి విషయానికి వస్తే ఆ పార్టీ పోటీ చేసే సీట్ల విషయంలో మూడు చోట్ల కాంగ్రెస్, టీజేఎస్ ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ అభిప్రాయం ప్రకారం మల్కాజ్‌గిరి, చెన్నూరు, ముథోల్ స్థానాలు టీజేఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. వరంగల్ (ఈస్ట్), ఎల్లారెడ్డి, తాండూరు స్థానాలనూ టీజేఎస్ అడుగుతున్నా అక్కడ పోటీ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని సమాచారం. వాటితోపాటు కొల్లాపూర్, మేడ్చల్, రామగుండం సీట్లనూ టీజేఎస్ అడుగుతోందని, ఆ స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
ఏడు క్లియర్.. 14పై పీటముడి..
తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇందులో కూకట్‌పల్లి, ఉప్పల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, మక్తల్, చార్మినార్, మలక్‌పేట స్థానాల విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య అవగాహన కుదిరినట్లు కనిపిస్తోంది. మిగిలిన 5 చోట్ల.. మరీ అవసరమైతే 6 చోట్ల టీడీపీ పోటీ చేసేందుకుగాను 13 అసెంబ్లీ స్థానాలపై చర్చ జరుగుతోంది.
ఇందులో ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, కోదాడ, ఖమ్మం, నిజామాబాద్ రూరల్, పటాన్‌చెరు, సికింద్రాబాద్, సనత్‌నగర్, ముషీరాబాద్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ స్థానాలున్నాయి. వాటిలో మెజారిటీ స్థానాల్లో తమకు దీటైన అభ్యర్థులున్నందున ఈ స్థానాలను ఇవ్వలేమని కాంగ్రెస్ అంటోంది. తదుపరి చర్చల్లో ఈ సీట్లపై కాంగ్రెస్, టీడీపీ మధ్య స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment