‘చేతి’ చాటు చంద్రుడు చేటేనా? | KSR Review on Telanagan Elections | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 3 2018 8:23 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

KSR Review on Telanagan Elections - Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికల పర్వం పతాక స్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌ ఒక వైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కూడిన ప్రజాఫ్రంట్‌ మరో వైపు హోరా హోరీ యుద్ధం మాదిరి ప్రచారం సాగిస్తున్నాయి. ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కన్నా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు చేయగలుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవడం వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకుండా పోయిందో మరేమో తెలియదు కాని..ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చూసినా అత్యధికంగా కాంగ్రెస్‌ ప్రచారమే హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కాంగ్రెస్‌ వెనుకాడడం లేదు. ఆ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ఇంతవరకు ప్రచార ప్రకటనలు ఇచ్చినట్లు కనిపించలేదు. బహుశా చివరి మూడు రోజులు ఏమైనా ఇస్తుందేమో తెలియదు. కాంగ్రెస్‌కు అయినా, టీఆర్‌ఎస్‌ కు అయినా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలే. బీజేపీ కూడా ప్రచారంలో దూకి రకరకాల టీవీ యాడ్స్, పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఆరంభించింది. ఆకాశమే హద్దుగా కాంగ్రెస్‌ వాగ్దానాలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రచారం విషయంలో కాంగ్రెస్‌ దూకుడు ముందు ఆగడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్‌ గత ఐదేళ్లుగా తెలంగాణలోను, ఆంధ్రలోను అధికారంలో లేదు. 

కాంగ్రెస్‌కు లాభమా..నష్టమా!
తెలంగాణ ఇచ్చినా ఇక్కడ అధికారం రాకపోవడంతో ఆ సెంటిమెంటును ప్రయోగించి ఏమైనా లాభం పొందే అవకాశం ఉందా అన్నదానిపై కాంగ్రెస్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. దానికి టీడీపీని కలుపుకోవడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు నష్టమా? లాభమా అన్నది ఆ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మొదట ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను వాడుకున్న కాంగ్రెస్‌ , తన సొంత ముఖ్యమంత్రులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కాంగ్రెస్‌ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కూడా అవసరం లేదని భావించిందో ఏమో తెలియదు కాని చంద్రబాబుకే ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్‌ గాంధీ కూడా తన ప్రసంగాలలో వారి ప్రస్తావన తేలేదు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలలో ఎక్కడా కాంగ్రెస్‌ పదేళ్ల పాలన గురించి చెప్పడం లేదు. పదిహేనేళ్ల తర్వాత కూడా హైదరాబాద్‌ అభివృద్ధి అంతా తనదే అంటూ తన ఖాతాలో క్రెడిట్‌ వేసుకుంటుంటే, కాంగ్రెస్‌ నేతలు తెల్లబోవడం తప్ప ఏమీ మాట్లాడడం లేదు.

ఒకరకంగా చేష్టలుడిగినట్లుగా వారి పరిస్థితి మారింది. కేసీఆర్‌ ఆత్మగౌరవ సమస్యను ప్రస్తావిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప జవాబు ఇవ్వలేకపోతున్నారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ ఇల్లు కట్టుకున్నారని చెబుతున్న చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇల్లు పడగొట్టి పెద్ద ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు కాని విజయవాడ అనండి..అమరావతి అనండి ఆ ప్రాంతంలో ఎక్కడా సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇక చంద్రబాబు ప్రభావం లాభం చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదానిపై కాంగ్రెస్‌ నేతలు అంచనా వేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇది ఆత్మగౌరవ సమస్యగా మారకుండా ఉండాలని కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ కాని, మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావులు తమ ప్రసంగాలలో ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజంగానే  ఆత్మగౌరవ సమస్యను ప్రజలందరు తీసుకుంటారా అంటే చెప్పలేం. కొంత మేర ఉండవచ్చు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై కొంత చర్చ జరుగుతోంది.

పథకాలపై టీఆర్‌ఎస్‌ ఆశలు...
స్థూలంగా చూస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది వోకల్‌ సెక్షన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. కింది స్థాయి వర్గాలలో అది అంతగాఉన్నట్లు అనిపించదు. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా వర్గాల వారికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అని చెప్పాలి. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా, గొర్రెలు, చేపపిల్లల పంపణీ తదితర స్కీములపై టీఆర్‌ఎస్‌ ఎక్కువ ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ఈ స్కీముల గురించి ఎక్కువగా చెప్పకుండా కేసీఆర్‌ దొరల పాలన అని, నియంతృత్వం అని, సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదని, ఇలాంటి విమర్శలను ఎక్కువగా చేస్తోంది. అదే సమయంలో రెండు లక్షల రూపాయల రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కేసీఆర్‌ చేపట్టిన వివిధ స్కీములను పెద్దగా విమర్శించకుండా, తాము మరింతగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజానికి కేసీఆర్‌ ప్రభుత్వపరంగా పెద్దగా విఫలం అయినట్లు కనిపించదు. కాకపోతే యాటిట్యూడ్‌ లో కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ లేకుండా కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసి ఉంటే టీఆర్‌ఎస్‌ కు మరింంత పోటీ ఎదురై ఉండేది. కాని చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్‌ వారు కేసీఆర్‌కు ఒక ఆయుధం ఇచ్చినట్లు అయింది. 

తేడా వస్తే... ఎంఐఎం అండ
కాంగ్రెస్‌ నేతలు ప్రస్తుతానికి అయితే చంద్రబాబో, ఎవరో ఒకరు తమకు గెలిచే విధంగా ఆర్థిక వనరులు సాయం చేస్తే చాలన్నట్లుగా సర్దుకుంటున్నారు.  కొన్ని చోట్ల తిరుగుబాట్లు కాంగ్రెస్‌కు నష్టం చేయవచ్చు. అందువల్లే లగడపాటి రాజగోపాల్‌ పది మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కొందరు టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది అని ప్రచారం చేస్తున్నా,  కాంగ్రెస్‌ కు ఇబ్బందే ఎదురు అవుతుందనిపిస్తుంది..ఎందుకంటే టీఆర్‌ఎస్‌కు ఒకవేళ 50 సీట్లు వచ్చినా, ఎంఐఎం అండ ఉంటుంది. అప్పుడు టీఆర్‌ఎస్‌  ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లను ఆకట్టుకున్నా సరిపోతుంది.  టీఆర్‌ఎస్‌ మాత్రం తమకు పూర్తి మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్‌ తన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది.

బీజేపీ కూడా ఐదు నుంచి పది సీట్లపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ కూటమికి పూర్తి మెజార్టీ వస్తేనే అధికారంలోకి రాగలుగుతుంది. కాని టీఆర్‌ఎస్‌కు 50 సీట్లు వచ్చినా అధికారం పొందే అవకాశం ఉండవచ్చు. ఇక డబ్బు ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి తోడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడం వల్ల ఎదురవుతున్న ఆత్మగౌరవ సమస్య పనిచేస్తే టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది. ఆయన ప్రభుత్వ విధానాలు కాకుండా, కేసీఆర్‌ వైఖరి , సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం వంటి విమర్శలు అధికంగా పనిచేస్తే కాంగ్రెస్‌ కూటమికి ప్రయోజనం జరగవచ్చు. ఇప్పటికైతే కేసీఆర్‌ది పై చేయిగానే కనిపిస్తోంది. అలా అని చెప్పి ప్రజా కూటమి పూర్తిగా వెనుకబడిందని చెప్పలేం.

- కొమ్మినేని శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement