Peoples Front
-
కొంపముంచిన చంద్రబాబు పొత్తు
సాక్షి వెబ్, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. కూటమి పేరుతో చేసిన పొత్తు రాజకీయాలు ఆ పార్టీని నిండా ముంచింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సొంత ఎజెండాతో కాకుండా ప్రజల్లో విశ్వసనీయత లేని పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ చివరకు సరైన ఎత్తుగడ లేక ఎన్నికల్లో చతికిలపడింది. ముందస్తు ఎన్నికలు అనివార్యమని తేలిపోయిన తర్వాత ఎంతో సమయం ఉన్నప్పటికీ తగిన వ్యూహ రచన చేయడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రధానంగా టీడీపీతో పొత్తు, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు నాయుడును ప్రచారాస్త్రంగా ఎంచుకోవడాన్ని ప్రజలు ఛీత్కరించారు. ముఖ్యంగా చంద్రబాబుతో కాంగ్రెస్ నేతల లాలూచీ వ్యవహారాలు టీఆర్ఎస్ కు మరింత బలం చేకూర్చినట్లయిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మొదటి నుంచి బలమైన స్థానాల్లో సైతం ఈసారి ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు. తెలంగాణలో బలమైన స్థానాల్లో సైతం పార్టీ ప్రతికూల ఫలితాలు రావడమంటే పొత్తు ఎత్తుగడ పూర్తిగా బెడిసికొట్టినట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు క్యూ కట్టడం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా నాయకులు నడుచుకోవడం, చంద్రబాబుతో ప్రచారం చేయించుకోవడం వంటి అనేక పరిణామాలు ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఆశలు పెట్టుకున్న నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనగా అలాంటి చోట్ల ప్రతికూల ఫలితాలు రావడం గమనార్హం. ఈ పరిణామాలను బట్టి చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని స్పష్టమైంది. (చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...) తెలంగాణ ఇచ్చింది తామే అంటూ ఎన్నికలకు వెళ్లినప్పటి 2014లో ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్కు బాగా కలిసొచ్చింది. అయితే గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఎదురైన వాతావరణాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైందని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు నాయుడుతో పొత్తు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. తెలంగాణలో ఏకైక ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఓటమి ద్వారా ఆ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. (ఫ్రంట్ పేరుతో చంద్రబాబు స్టంట్) కాంగ్రెస్ ను దెబ్బతీసిన ప్రధాన అంశాలు : టీడీపీతో పొత్తు ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోవడం విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనివ్వడం చంద్రబాబు ద్వారా సమకూరే ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడటం పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు సరిగా చేయలేకపోవడం కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను కూడా చంద్రబాబు ఖరారు చేయడం ఇతర పార్టీలతో పొత్తులు తేల్చకుండా చివరి వరకు నాన్చివేత ధోరణి అవలంభించడం టీజేఎస్ విషయంలో బలమున్న చోట కాకుండా ఇతరత్రా కారణాలతో సీట్ల కేటాయింపు ముందస్తు ఎన్నికలు అనివార్యమని తెలిసిన తర్వాత కూడా తగిన వ్యూహరచన చేయకపోవడం సరైన సమయంలో మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం ప్రజల్లో విశ్వాసం కలిగించే రీతిలో మేనిఫెస్టో రూపకల్పన జరక్కపోవడం మేనిఫెస్టోలో కొన్ని ప్రజాకర్షక పథకాలు చేర్చినప్పటికీ చంద్రబాబు కారణంగా ప్రజలు వాటిని విశ్వసించకపోవడం ఎప్పటిలాగే టికెట్ల కేటాయింపులో ఢిల్లీలో రాజకీయాలు, చివరి క్షణం వరకు సాగదీత ధోరణి అభ్యర్థులు ఆలస్యంగా రంగంలోకి దిగడం నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, సమన్వయలోపం నాయకత్వం మధ్య ఐక్యత లేకపోవడం అసంతృప్త నేతలను బుజ్జగించలేకపోవడం, వారిలో తగిన భరోసా కల్పించలేకపోవడం వలసలను నిరోధించలేకపోవడం బలమున్న స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించడం -
80 పదిలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి 75 నుంచి 80 సీట్లలో గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో సంబంధం లేకుండా.. తామే గెలుస్తామన్నారు. ఈ నెల 12న తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. నిన్న మొన్నటివరకు 105–106 స్థానాల్లో గెలుస్తామన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు 80 సీట్లలో తమదే విజయం అంటున్నారని.. 11న ఫలితాల తర్వాత 30 స్థానాలకే పరిమితం అవుతా రని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలను 2019 పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారని, ఈ సెమీఫైనల్స్‌లో కాంగ్రెస్ పార్టీ 5–0తో క్లీన్‌స్వీప్ చేస్తుంద న్నారు. శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో ఆయన ప్రజాకూటమి నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి(సీపీఐ), విద్యాధర్‌రెడ్డి (టీజేఎస్), మంద కృష్ణమాదిగ(ఎమ్మార్పీఎస్), టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సరళి తమకు అను కూలంగానే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ కుటుంబం చేసిన మోసం పై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతో రాజకీయ, రాజకీయేతర శక్తుల కలయిక తమకు కలిసొస్తుందన్నారు. దుర్మార్గపు, అణచివేత, నియంతృత్వ పాలన అవసరం లేదని తాము చేసిన విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రకటించిన హామీలు కూడా ప్రజల మనసులను హత్తుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కూటమి స్ఫూర్తితో పనిచేసిన కారణంగా ఓట్ల బదిలీ కూడా 100% జరిగిందని ఆయన పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు, సంస్థల కార్యకర్తలు, నేతలు, పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పక్కాగానే ఉన్నారు ఆత్మగౌరవం లేని పాలన తమకు అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓట్లేసేందుకు వెళ్లారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్‌కు గులామ్లము కాదనే ఈ ఎన్నికలతో తెలంగాణ ప్రజలు చెప్పబోతున్నారన్నారు. రోజురోజుకూ కూటమికి ప్రజాదరణ పెరిగిందని, దీనికి తగ్గట్లుగానే ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. అందుకే వందల కోట్ల ధనాన్ని వెదజల్లినా ఓటర్ల ఆలోచనను ప్రభావితం చేయలేకపోయారని, తమకు 75–80 స్థానాలు వస్తాయని, కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఓటు రూపంలో అస్త్రం సంధించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ టీడీపీ తరఫున ధన్యవాదాలు చెపుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ప్రజల్లో సానుకూల సంకేతాలు కనిపించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెప్పారు. కూటమి సర్దుబాటు మరో 10–15 రోజుల ముందు జరిగి ఉంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు వీలుండేదని వ్యాఖ్యానించారు. టీజేఎస్ నేత విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ నియంతృత్వ, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పారదర్శక ప్రజాపాలన కోసం ఓట్లేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కూటమి స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్ ఓటమి, కూటమి గెలుపు ఖాయమయ్యాయన్నారు. దొరలు ఓడిపోతున్నారని, ప్రజాస్వామ్యం గెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్‌దీప్ ఫోన్ చేసి.. ఎగ్జిట్‌పోల్స్ సర్వేల గురించి విలేకరులు అడగ్గా, వాటి గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని ఉత్తమ్ చెప్పారు. టీఆర్ఎస్కు 72–91 స్థానాలు వస్తాయని ఇండియాటుడే చానల్ ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పారని, కానీ, తమ సర్వేను చూసి ఆందోళన చెందవద్దని, తెలంగాణలో ఇరుపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఆ పోల్‌ను నిర్వహించిన రాజ్దీప్సర్దేశాయ్ తనకు ఫోన్ చేసి చెప్పాడని ఉత్తమ్ వెల్లడించారు. తనకు ఫోన్ చేసి చెప్పడమే కాకుండా ఇదే విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేశాడని చెప్పారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వార్తలురాసిన విలేకరులు, పత్రిక, టీవీ చానళ్ల యజమానులకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఇంకా సమయం ఉందని, ఉద్యోగులు ఆలోచించుకుని ఐఆర్, పీఆర్సీ అమలు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కోసం కూటమి అభ్యర్థులకు ఓట్లేయాలని కోరారు. ఈవీఎంలు జరభద్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) విషయంలో కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కోరారు. కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున అధికార పార్టీ ఈవీఎంలను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉందని ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవీఎంల రవాణా జరుగుతున్నప్పుడు, స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచినప్పుడు, ఆ తర్వాత వాటిని కౌంటింగ్ కేంద్రాన్ని తీసుకువచ్చేటప్పుడు కూటమి నేతలు ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంపై ఈవీఎంను పెట్టినప్పుడు ఆ ఈవీఎం నెంబర్ రాసుకోవాలని సూచించారు. ఇందుకోసం పోలింగ్ ఏజెంట్లనే కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతిస్తే బాగుంటుందని, ఈ మేరకు కూటమి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అధికారులు కూడా అక్కడికి వెళ్లకూడదని, కొన్ని చోట్ల కొందరు అధికారులు ఆ గదుల్లోకి వెళ్లి వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఈసీ విఫలమయిందని ఉత్తమ్ ఆరోపించారు. లక్షలాది మంది అర్హుల ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయని తాము మొదటి నుంచీ చెపుతున్నప్పటికీ ఈసీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని, ఇప్పుడు సాక్షాత్తూ ఎన్నికల సీఈవోనే ఓటర్ల గల్లంతుపై క్షమాపణలు అడగడం శోచనీయమన్నారు. -
‘చేతి’ చాటు చంద్రుడు చేటేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పర్వం పతాక స్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్ ఒక వైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కూడిన ప్రజాఫ్రంట్ మరో వైపు హోరా హోరీ యుద్ధం మాదిరి ప్రచారం సాగిస్తున్నాయి. ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కన్నా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు చేయగలుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవడం వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకుండా పోయిందో మరేమో తెలియదు కాని..ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చూసినా అత్యధికంగా కాంగ్రెస్ ప్రచారమే హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కాంగ్రెస్ వెనుకాడడం లేదు. ఆ స్థాయిలో టీఆర్ఎస్ ఇంతవరకు ప్రచార ప్రకటనలు ఇచ్చినట్లు కనిపించలేదు. బహుశా చివరి మూడు రోజులు ఏమైనా ఇస్తుందేమో తెలియదు. కాంగ్రెస్‌కు అయినా, టీఆర్ఎస్ కు అయినా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలే. బీజేపీ కూడా ప్రచారంలో దూకి రకరకాల టీవీ యాడ్స్, పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఆరంభించింది. ఆకాశమే హద్దుగా కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రచారం విషయంలో కాంగ్రెస్ దూకుడు ముందు ఆగడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్ గత ఐదేళ్లుగా తెలంగాణలోను, ఆంధ్రలోను అధికారంలో లేదు. కాంగ్రెస్‌కు లాభమా..నష్టమా! తెలంగాణ ఇచ్చినా ఇక్కడ అధికారం రాకపోవడంతో ఆ సెంటిమెంటును ప్రయోగించి ఏమైనా లాభం పొందే అవకాశం ఉందా అన్నదానిపై కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. దానికి టీడీపీని కలుపుకోవడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు నష్టమా? లాభమా అన్నది ఆ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మొదట ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను వాడుకున్న కాంగ్రెస్ , తన సొంత ముఖ్యమంత్రులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కాంగ్రెస్ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కూడా అవసరం లేదని భావించిందో ఏమో తెలియదు కాని చంద్రబాబుకే ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగాలలో వారి ప్రస్తావన తేలేదు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలలో ఎక్కడా కాంగ్రెస్ పదేళ్ల పాలన గురించి చెప్పడం లేదు. పదిహేనేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ అభివృద్ధి అంతా తనదే అంటూ తన ఖాతాలో క్రెడిట్ వేసుకుంటుంటే, కాంగ్రెస్ నేతలు తెల్లబోవడం తప్ప ఏమీ మాట్లాడడం లేదు. ఒకరకంగా చేష్టలుడిగినట్లుగా వారి పరిస్థితి మారింది. కేసీఆర్ ఆత్మగౌరవ సమస్యను ప్రస్తావిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప జవాబు ఇవ్వలేకపోతున్నారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని చెబుతున్న చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇల్లు పడగొట్టి పెద్ద ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు కాని విజయవాడ అనండి..అమరావతి అనండి ఆ ప్రాంతంలో ఎక్కడా సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇక చంద్రబాబు ప్రభావం లాభం చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదానిపై కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇది ఆత్మగౌరవ సమస్యగా మారకుండా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కాని, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రసంగాలలో ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజంగానే ఆత్మగౌరవ సమస్యను ప్రజలందరు తీసుకుంటారా అంటే చెప్పలేం. కొంత మేర ఉండవచ్చు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై కొంత చర్చ జరుగుతోంది. పథకాలపై టీఆర్ఎస్ ఆశలు... స్థూలంగా చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది వోకల్ సెక్షన్లో ఎక్కువగా కనిపిస్తుంది. కింది స్థాయి వర్గాలలో అది అంతగాఉన్నట్లు అనిపించదు. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాల వారికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అని చెప్పాలి. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా, గొర్రెలు, చేపపిల్లల పంపణీ తదితర స్కీములపై టీఆర్ఎస్ ఎక్కువ ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ స్కీముల గురించి ఎక్కువగా చెప్పకుండా కేసీఆర్ దొరల పాలన అని, నియంతృత్వం అని, సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదని, ఇలాంటి విమర్శలను ఎక్కువగా చేస్తోంది. అదే సమయంలో రెండు లక్షల రూపాయల రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కేసీఆర్ చేపట్టిన వివిధ స్కీములను పెద్దగా విమర్శించకుండా, తాము మరింతగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వపరంగా పెద్దగా విఫలం అయినట్లు కనిపించదు. కాకపోతే యాటిట్యూడ్ లో కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ కు మరింంత పోటీ ఎదురై ఉండేది. కాని చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ వారు కేసీఆర్‌కు ఒక ఆయుధం ఇచ్చినట్లు అయింది. తేడా వస్తే... ఎంఐఎం అండ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతానికి అయితే చంద్రబాబో, ఎవరో ఒకరు తమకు గెలిచే విధంగా ఆర్థిక వనరులు సాయం చేస్తే చాలన్నట్లుగా సర్దుకుంటున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాట్లు కాంగ్రెస్‌కు నష్టం చేయవచ్చు. అందువల్లే లగడపాటి రాజగోపాల్ పది మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కొందరు టీఆర్ఎస్కు ఇబ్బంది అని ప్రచారం చేస్తున్నా, కాంగ్రెస్ కు ఇబ్బందే ఎదురు అవుతుందనిపిస్తుంది..ఎందుకంటే టీఆర్ఎస్కు ఒకవేళ 50 సీట్లు వచ్చినా, ఎంఐఎం అండ ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లను ఆకట్టుకున్నా సరిపోతుంది. టీఆర్ఎస్ మాత్రం తమకు పూర్తి మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ తన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ కూడా ఐదు నుంచి పది సీట్లపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కూటమికి పూర్తి మెజార్టీ వస్తేనే అధికారంలోకి రాగలుగుతుంది. కాని టీఆర్ఎస్కు 50 సీట్లు వచ్చినా అధికారం పొందే అవకాశం ఉండవచ్చు. ఇక డబ్బు ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి తోడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడం వల్ల ఎదురవుతున్న ఆత్మగౌరవ సమస్య పనిచేస్తే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది. ఆయన ప్రభుత్వ విధానాలు కాకుండా, కేసీఆర్ వైఖరి , సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం వంటి విమర్శలు అధికంగా పనిచేస్తే కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం జరగవచ్చు. ఇప్పటికైతే కేసీఆర్‌ది పై చేయిగానే కనిపిస్తోంది. అలా అని చెప్పి ప్రజా కూటమి పూర్తిగా వెనుకబడిందని చెప్పలేం. - కొమ్మినేని శ్రీనివాసరావు -
నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ పగ్గాలు అందుకోనున్నారు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసన సభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ను ఎన్నుకుంది. శనివారం జరిగిన డీఏఎన్ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా జెలియాంగ్‌ను కొత్త నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నైపూ రియో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఇక్కడ కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. జెలియాంగ్ ప్రస్తుతం గనులు, భూగర్భ వనరులు, ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నారు. జెలియాంగ్ అభ్యర్థిత్వానికి డీఏఎన్లోని పక్షాలైన జేడీయూ, ఎన్సీపీ, బీజేపీ, స్వత్రంతులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జెలియాంగ్ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. నైపూ రియో, ఎన్పీఎఫ్ అధ్యక్షుడు షుర్హోజెలిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.