సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 80కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ, ధర్మగంట మోగే తెలంగాణ, వెలుగుల తెలంగాణ కావాలంటే టీఆర్‌ఎస్ గద్దె దిగాల్సిందేనని, ఓటర్లందరూ ప్రజాఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం కీలకదశకు చేరుకున్న సమయంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్య విశేషాలు..
సాక్షి: ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మీ ప్రచారం ఎలా సాగుతోంది?
ఉత్తమ్: అద్భుతంగా సాగుతోంది. ఇంటింటి ప్రచారంతో పాటు బహిరంగసభలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా మా పార్టీ, పీపుల్స్ ఫ్రంట్ సందేశం ప్రతి ఓటరుకు చేరేలా సాగుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల కన్నా మా కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యంగా జరిగింది కదా..?
ఇది తప్పు. అభ్యర్థుల ఎంపిక సరైన సమయంలోనే జరిగింది. మరీ ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసినా అనేక రకాల ఇబ్బందులుంటాయి. అభ్యర్థులతో పాటు పార్టీ ప్రచారం పకడ్బందీగా సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలోకి వస్తే మేం చేయబోతున్న పనుల గురించి పోలింగ్ రోజు కంటే ముందే ప్రతి ఓటరుకు మూడు నాలుగు సార్లు చేరవేసేలా ముందుకెళుతున్నాం.
ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు జరుగుతుందంటున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది?
అవినీతితో దోచుకున్న సొమ్ము, మద్యం ఉపయోగించి తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో టీఆర్‌ఎస్ ఉంది. కానీ, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా డబ్బు, మద్యం, గోబెల్స్ ప్రచారం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనం. దీన్ని ఓటింగ్‌లో తెలంగాణ సమాజం సహించదు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మాటల మాంత్రికుడిగా పేరున్న ఆయన ఎన్నికల ప్రచారంపై మీ అభిప్రాయం?
కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. 2014 ఎన్నికల సమయంలో ఆయన మాటలు విని మోసపోయామనే భావన తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల్లో ఉంది. మళ్లీ మోసపోం అని కూడా తెలంగాణ ప్రజల అనుకుంటున్నారు. అందుకోసమే కేసీఆర్ సభలు కానీ, టీఆర్‌ఎస్ ఇతర ప్రచార కార్యక్రమాలు కానీ అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. అదే సమయంలో మా ప్రచార సభలకు పెద్ద ఎత్తున జనస్పందన కనిపిస్తోంది. కేసీఆర్ సభలకు సరైన సంఖ్యలో జనం రావడంలేదు. వచ్చినవాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొనడంలేదు.
టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తును తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా?
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, టీడీపీ పొత్తును సంపూర్ణంగా స్వీకరించారు. ఇందుకు నిదర్శనంగానే మా పార్టీలు కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ అంశంలో మేం సర్వే కూడా చేశాం. ఇందులో పాల్గొన్న 90–95 శాతం మంది మా పొత్తును ఆమోదించారు. ఇది ఒక చారిత్రక అవసరం. దేశ, రాష్ట్ర స్థాయిలో ప్రస్తుత పాలకుల నిరంకుశ, నియంతృత్వ ధోరణి, ఫాసిస్టు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న రాజకీయ, రాజకీయేతర శక్తులు కలిసి ఈ ప్రజావ్యతిరేక దుర్మార్గపు పాలకులను గద్దె దింపాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ, సీబీఐ, న్యాయ, పార్లమెంటరీ, మీడియా వ్యవస్థలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సర్వనాశనం చేస్తున్నాయి. అదే పోకడతో తెలంగాణలో కూడా కేసీఆర్ శాసన, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో జరిగిన రాజకీయ పునరేకీకరణలో రాజకీయ, రాజకీయేతర శక్తులు చేతులు కలపడం అవసరం.
కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల బదిలీ జరిగే పరిస్థితులు లేవంటున్నారు?
ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై మేం క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. నూటికి నూరుశాతం ఓట్ల బదిలీ జరగబోతున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం ఉంది. అన్నీ బయటకు చెప్పలేం కానీ.. ఇందుకోసం మేం అనేక చర్యలు తీసుకుంటున్నాం.
సూట్‌కేసులు రాలేదనే సోనియా కడుపు తరుక్కుపోతుందా అన్న కేసీఆర్ కామెంట్స్‌పై మీరేమంటారు?
కేసీఆర్ అత్యంత దిగజారుడు వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. తన జీవితం మొత్తం సూట్‌కేసులు తీసుకునే అలవాటున్న కేసీఆర్‌కు త్యాగస్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేసే వారి వ్యక్తిత్వం అర్థం కాదు. ఒకనాడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్, సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఆన్‌రికార్డ్ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఓడిపోతున్నాననే ఆందోళనతోనే సోనియాను విమర్శిస్తున్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అవినీతికి నిలువెత్తు నిదర్శనమైన అవకాశవాది, అబద్ధాలకోరు, మోసగాడు మాట్లాడడమా..? దీన్ని గమనించిన తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు.
బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మీ విజయావకాశాలను దెబ్బతీసేట్టు ఉన్నారు?
బీజేపీ, ఎంఐఎంలకు గత ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు కూడా రావు. అదో విచిత్ర కలయిక. బీజేపీతో రహస్య ఒప్పందం, ఎంఐఎంతో బహిరంగ ఒప్పందం చేసుకుని టీఆర్‌ఎస్ ఎన్నికలకు వెళుతోంది. గత నాలుగేళ్లుగా అనేక సందర్భాల్లో కేసీఆర్ బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు. జీఎస్టీ, నోట్లరద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయాల్లో కేసీఆర్ ఏం చేశాడనేది తెలంగాణలోని మైనార్టీలు గమనిస్తున్నారు. ఇంత పచ్చిగా బీజేపీకి మద్దతిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ఎందుకు మద్దతిస్తోందో ఓవైసీ ఇంతవరకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెప్పలేదు. తక్కువ ధరకు భూముల కేటాయింపు, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వ్యక్తిగత లబ్ధి కోసం ఓవైసీ టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం ముస్లిం సమాజంలో ఎవరికీ రుచించడం లేదు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కానీ, వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూముల రక్షణలో కానీ, ఉర్దూ అకాడమీని బలపర్చడంలో కానీ ముస్లింలకు కేసీఆర్ సాయపడలేదు. ఆలేరు ఎన్‌కౌంటర్, మక్కామసీదు పేలుళ్ల నిందితులను కిందికోర్టు దోషులుగా ప్రకటించినప్పుడు పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లకపోవడం కానీ, ముస్లిం పర్సనల్ లాలో బీజేపీ తలదూర్చినప్పుడు కేసీఆర్ మద్దతు పలకడంపై ముస్లిం సమాజం ఆగ్రహంతో ఉంది.
ఈ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు?
కచ్చితంగా 80 స్థానాల కంటే ఎక్కువగానే గెలవబోతున్నాం. ఎవరికైనా సందేహాలున్నా డిసెంబర్ 11న నివృత్తి అయిపోతుంది.
అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు?
మా మేనిఫెస్టో ఇప్పటికే విడుదల చేశాం. ఒకే దఫాలో రూ.2లక్షల రైతు రుణమాఫీ, 2009 తర్వాత తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, 17 పంటలకు గిట్టుబాటు ధరలు, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతుబంధు పథకం విస్తరణ, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులకు లబ్ధి కలిగేలా పెట్టుబడి సాయం, ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంపు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల భృతి, 20వేల పోస్టులతో మెగా డీఎస్సీ, పాతపద్ధతిలోనే డీఎస్సీ నిర్వహణ, మైనార్టీలకు సబ్‌ప్లాన్, ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.5లక్షల వర్తింపు, ప్రతి మండలానికి 20–30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, సొంత స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పాతబకాయిల చెల్లింపు, పాత ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది కోసం రూ.2లక్షలు, వివాహాలకు ఆర్థిక సాయంగా రూ.1,50,116, తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలెండర్లు, మహిళా సంఘాల రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు, రూ.50వేల వరకు రుణాల మాఫీ, రూ.లక్షకు తగ్గకుండా నగదు రూపంలో గ్రాంటు, సీసీఎస్ విధానం రద్దు, కొత్త పీఆర్సీ ద్వారా 01–07–2018 నుంచి ఆర్థిక ప్రయోజనాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి, కోటి ఎకరాలకు సాగునీరు, అన్ని ప్రాజెక్టులకు తగిన నిధుల కేటాయింపు వంటి హామీలిస్తున్నాం.
మీరు సీఎం అవుతాననుకుంటున్నారా?
నేను సీఎం అవుతానా కాదా అన్నది ప్రధానాంశం కాదు. మూడున్నరేళ్ల క్రితం నేను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోతున్న పరిస్థితులున్నాయి. ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కోల్పోవాల్సిన పరిస్థితి. సీఎంగా కేసీఆర్ 20 ఏళ్ల పాటు ఉంటాడని, పోటీనే లేదనే భావన చాలా మందిలో ఉండేది. ఆ పరిస్థితి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తున్న ఓ అద్భుత స్థితికి పార్టీ వచ్చింది. ఇందులో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఎన్నికలతో పార్టీ అధ్యక్షుడిగా నా పాత్ర పూర్తవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కలిసి ఎవరిని సీఎంగా ఎన్నుకున్నా నాకు ఆమోదయోగ్యమే.
మీరు, మీ భార్య పద్మావతి ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? మీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది?
ఇద్దరం సునాయాసంగా భారీ మెజార్టీతో మళ్లీ ఎమ్మెల్యేలు కాబోతున్నాం. మాకు పిల్లల్లేరు. తెలంగాణ ప్రజల కోసమే మా జీవితాలు అంకితం చేశాం. ఇదే విధంగా నిరంతరం నిస్వార్థంగా, నిజాయితీతో ప్రజా జీవితంలో కొనసాగుతాం.
తెలంగాణ ప్రజలకు మీరిచ్చే ఎన్నికల సందేశం ఏంటి?
తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో తిరిగి ఎన్నికల్లో గెలవాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఏ త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధమై పూర్తి స్వేచ్ఛతో దేనికీ ప్రలోభపడకుండా, ప్రభావితం కాకుండా ఓటేయాలని విజ్ఞప్తి. తెలంగాణ అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లకు నా సవినయ విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఉద్దేశం నెరవేరలేదు. తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, నిరుపేద వర్గాలకు ఈ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మేలు జరగలేదు. అవినీతి మితిమీరిపోయింది. మార్పు కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ కోసం, ధర్మగంట మోగే తెలంగాణ కోసం మనం ఓటేద్దాం. ప్రజాఫ్రంట్ అభ్యర్థులను గెలిపించండి. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపండి.
Published Sun, Dec 2 2018 2:26 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment