
అలా ఓ నిర్ణయానికి వచ్చేవారు...
పెను సమస్యలేవైనా మీదపడ్డప్పుడు ఒక నిర్ణయానికి రావాలంటే, వాడి వేడి చర్చలతో తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే! ఎడతెగని చర్చలు ఒక్కోసారి ఒక పట్టాన కొలిక్కి రావు. వేడెక్కిన బుర్రను చల్లార్చే సాధనాలేవీ అందుబాటులో ఉండవు. ఆధునికులకు ఈ పరిస్థితి అనుభవపూర్వకమే! ప్రాచీనకాలంలో పర్షియన్లు పెద్ద పెద్ద సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రెండు విడతలుగా చర్చలు జరిపేవారు. తప్పతాగిన స్థితిలో మొదటి విడత చర్చలు సాగించేవారు. మర్నాడు మళ్లీ సమావేశమై ‘మందు’మార్బలమేమీ లేకుండా, పెద్దమనుషుల్లా అదే విషయంపై చర్చ కొనసాగించేవారు. చర్చ ఒక కొలిక్కి వచ్చి, సమస్యకు పరిష్కారం లభించాక ఆ ఆనందంలో వారు తిరిగి ‘మదిరా’నందంలో మునిగిపోయేవారు. క్రీస్తుపూర్వం 450 ఏళ్ల నాడు పర్షియాలో అన్నిచోట్లా ఈ పద్ధతి ఉండేది. అప్పట్లో పర్షియాలో పర్యటించిన గ్రీకు చరిత్రకారుడు హెరిడాటస్ ఈ వింతాచారాన్ని చూసి విస్తుపోయి, తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు.