బీజేపీలోకి ‘ఆమంచి’?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఆమంచి త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీ సానుభూతి ఎమ్మెల్యేగా ఉంటానని మీడియా ముందు ప్రకటించారు. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుల సునీత మరో కీలక ఎంపీతో పాటు కొందరు మంత్రులు పార్టీలో ఆమంచి చేరికను అడ్డుకున్నారు. దీంతో ఆయన కొద్దినెలలుగా రాజకీయాలకు దూరంగా ఉండి సొంత కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.
రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన ఆమంచి నియోజకవర్గంలో పలు అధికారక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులను చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కేసులో మొదటి ముద్దాయి ఆయనే. ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆయన సోదరుడి ఇసుక క్వారీపై దాడులు జరిగాయి.
12లారీలను సీజ్ చేసి సోదరుడుపై నాన్ బెయిల్‌బుల్ కేసులు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరితే కేసులు, ఇతరత్రా సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నది ఆయన నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయిన కొణిజేటి రోశయ్యకు ఏకలవ్య శిష్యుడైన ఆమంచి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆయన వర్గం కూడా ఖండించకపోవడం గమనార్హం.