'ఆమంచి' అనుచరులు ... అర్ధరాత్రి వీరంగం
వేటపాలెం పోలీసుస్టేషన్‌లో అర్ధరాత్రి వీరంగం
కుర్చీతో పాటు స్టేషన్‌లోని ఇతర సామగ్రి ధ్వంసం
తొమ్మిది మందిపై కేసులు.. ముగ్గురు అరెస్టు
కేసు నమోదైన వారిలో ఇద్దరు విలేకరులు
వేటపాలెం : ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు వేటపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. పోలీసుస్టేషన్‌పై ఆయన అనుచరులు దాడి చేశారు. కుర్చీలు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చీరాల రూరల్ సీఐ పాపారావు కథనం ప్రకారం.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ కారు డ్రైవర్ గోపిరాజు శుక్రవారం ఉదయం బైకుపై బైపాస్‌లో వెళ్తున్నాడు.
ఆ సమయంలో బైకును ఎస్సై చంద్రశేఖర్ అపి లెసైన్‌స పత్రాలు అడిగారు. అవి లేకపోవడంతో ఆయన బైకును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బైకుకు సంబంధించిన పత్రాలు తెచ్చి చూపాలని, ఆ తర్వాతే బైకు తీసుకెళ్లాలని గోపిరాజుకు ఎస్సై తేల్చి చెప్పారు. అదేరోజు అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరుడు, కొత్తపేటకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు తులసీరామ్, గోపిరాజు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పాటు మరో ఆరుగురు పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు.
సెంట్రీ విధుల్లో ఉన్న వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తులసీరామ్, కారు డ్రైవర్ గోపీరాజు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిలో తులసీరామ్, గోపీరాజు, వెంకటేశ్వర్లును అరెస్టు చేసి దర్శి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఇంకా మరో ఆరుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. వారిలో ఇద్దరు విలేకరులు ఉన్నారు.
జర్నలిస్టుల ఖండన
పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరు విలేకరుల పేర్లు చేర్చడం దారుణమని జర్నలిస్టులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి వివరాలు సేకరించేందుకు వెళ్లిన విలేకరులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులు నమోదై ఉన్న విలేకరుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, ప్రింట్ మీడియా ప్రతినిధి (సాక్షి కాదు) ఉన్నారు. స్టేషన్‌పై దాడి జరిగిన సందర్భంలో సదరు విలేకరులు ఇద్దరూ అక్కడే ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు.