
ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి కరణం బలరామ్ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. కరణం బలరామ్‌తోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కరణం బలరామ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని, దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, అందువల్ల బలరామ్ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఇటీవల ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమంచి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..తన నామినేషన్‌లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్‌లో ప్రస్తావించలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.