chirala mla
-
కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి కరణం బలరామ్ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. కరణం బలరామ్‌తోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరణం బలరామ్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని, దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, అందువల్ల బలరామ్ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఇటీవల ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమంచి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..తన నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్లో ప్రస్తావించలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
ఎమ్మెల్యే సోదరుడి ఇంటిలో భారీ చోరీ
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీహరి అలియాస్ సీతయ్య నివాసంలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని నివాసంలో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీ చేశారు. శ్రీహరి బావమరిది చెరుకూరి లక్ష్మీనారాయణ తెలిపిన సమాచారం మేరకు... అనారోగ్యంతో ఉన్న శ్రీహరి కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులక్రితం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి కాపలాగా ఉంటున్న వాచ్‌మన్ గురువారం రాత్రి రాకపోవడం గమనించిన దొంగలు ఇంటి వెనుకవైపు నుంచి గోడదూకి లోనికి ప్రవేశించారు. తలుపు గడియ పగలగొట్టి ఇంటిలోని సొరుగుల్లో ఉన్న నగలు, డబ్బులు తీసుకుని పరారయ్యారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పనిమనిషి తలుపులు తెరచి, గడియ విరిగి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని సీతయ్య బావ మరిది లక్ష్మీనారాయణకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్సై వెంకటకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్ ఆధారాల కోసం వెతికారు. ఇంటి యజమాని వచ్చేవరకు చోరీ జరిగిన సొత్తు విలువ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 250 సవర్ల బంగారం, 25 కేజీల వెండి, 16 లక్షల నగదు అపహరణకు గురైందని, మొత్తం రూ.కోటి విలువ ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. -
ఎమ్మెల్యే ఆమంచి దౌర్జన్యం
చీరాల: వాడరేవులోని మత్య్సకార మహిళపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దౌర్జన్యానికి దిగారు. నన్నే ఎదిరించి మాట్లాడతావా.. అంటూ ఆమె జీవనోపాధి అయిన చేపల బండిని తీసివేయించి ఆమె బతుకుదెరువును ప్రశ్నార్థకం చేశారు. వివరాలు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తామెందుకు చెత్త వేస్తామని ఆమె తిరిగి ప్రశ్నించింది. అంతేకాకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉన్నా తమకేమీ ఉపయోగపడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే నోరు జాగ్రత్తగా పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా.. అసలు బండిపై చేపలు పెట్టుకునేందుకు పంచాయతీ అనుమతి ఉందా... అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పెట్టుకున్న బండ్లు లైసెన్సులు లేవని ఆమె అనడంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే బండిని పంచాయతీ కార్యాలయంలో పెట్టమని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డిని ఆదేశించారు. నువ్వు కావాలనే గొడవ చేసేందుకు వచ్చావని, నాతోనే వాదన పెట్టుకుంటావా..అంటూ ఎమ్మెల్యే ఆవేశంతో మాట్లాడారు. చేపలబండిని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. ఆవేదనకు గురైన ఆమె తాము ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కావడంతోనే బండి తీసేశారని, మిగిలిన బళ్లను అక్కడే ఉంచారని ఆరోపించింది. సమస్యలపై ప్రశ్నించినందుకు తన పొట్టపై కొట్టారని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. -
ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?
-
ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?
ప్రకాశం జిల్లా చీరాల గడియారం సెంటర్లోని పోలీసు స్టేషన్ ఎదురుగానే ఒక పాత్రికేయుడిని ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా కర్ర పట్టుకుని చితకబాదిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పక్కా ప్లానింగ్‌తో ముందుగానే ఒక దళితుడిని పోలీసు స్టేషన్‌కు పంపి, అతడితో నాగార్జునరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించి ఆ తర్వాత కొద్ది సేపటికే దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు.. ఇలా ఆమంచి సోదరులు చేస్తున్న అక్రమాలను వెలికితీసి పత్రికలలో రాయడం వల్లే ఈ దాడి జరిగిందన్నది బహిరంగ రహస్యమే అయినా పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. దీనిపై తనమీద దాడి జరిగిన ప్రదేశంలోనే జర్నలిస్టు నాగార్జునరెడ్డి సోమవారం ఉదయం ధర్నా చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. ఎమ్మల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు స్వయంగా తనను కొట్టాడని చెప్పారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉండటంతో.. దీనిపై పోలీసులను 'సాక్షి' ప్రశ్నించగా, పాలేటి రామారావు ఇంటివద్ద గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని, ఆ సమయంలో సరిగ్గా ఇక్కడ దాడి జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారిని తప్పకుండా పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. స్వతంత్ర సభ్యుడిగా గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 'కాదేదీ దోపిడీకి అనర్హం' అన్నట్లుగా భూమి, ఇసుక, నీరు, బియ్యం, చెట్లు, ప్రజల ఆస్తులు, ప్రజాధనం దేననీ వదలకుండా దోచుకుతింటున్న గజదొంగ అని నాగార్జున రెడ్డి తాను రాసిన 'చీరాలకు చీడపురుగు' కథనంలో పేర్కొన్నారు. 'మట్టిచేతుల బాస' అనే మాసపత్రిక తాజా సంచికలో ఈ కథనం ముఖచిత్ర కథనంగా వచ్చింది. మొత్తం 14 పేజీల స్టోరీ రాశానని, అందులో ప్రతి ఒక్క విషయానికీ పూర్తి ఆధారాలు ఉన్నాయని నాగార్జునరెడ్డి చెప్పారు. దళితులు, గిరిజనుల భూములను ఆక్రమంచి, వాటికి అధికారబలంతో పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాదిస్తున్నారని, అక్రమ పద్ధతుల్లో రెవెన్యూ రికార్డులు సృష్టిస్తున్నారని కూడా అందులో రాశారు. ప్రశ్నించేవారిపై అక్రమకేసులు బనాయిస్తారని, అడ్డుగా వస్తున్నారనుకున్నవారి ఆస్తులను ధ్వంసం చేసి భయానక పరిస్థితులు సృష్టించి తన పబ్బం గడుపుకొంటారని పేర్కొన్నారు. మచ్చుకి కొన్ని అంశాలు పరిశీలిద్దాం అంటూ.. సుదీర్ఘంగా అక్రమాల చిట్టాను బయటపెట్టారు. దాంతో ఆయనపై దాడి జరిగింది. -
ఆమంచి అతిపెద్ద అక్రమార్కుడు
పర్సంటేజీలు ఇవ్వకుంటే దాడులు చేయిస్తుంటాడు ఎవరైనా ఎదురుతిరిగిన వారిపై మావోయిస్టు ముద్ర నా దగ్గర ఆధారాలున్నాయి ఎమ్మెల్యే దురాగతాలపై న్యాయ పోరాటం చేస్తాం వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వరికూటి అమృతపాణి చీరాల: ‘చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అతిపెద్ద అక్రమార్కుడు. రోజుకు 200 లారీల ఇసుక చీరాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేసి రూ. కోట్లు దండుకుంటున్నాడు. ఎమ్మెల్యే అక్రమాలపై నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆమంచి కృష్ణమోహన్ దురాగతాలపై న్యాయ పోరాటం చేస్తా’నని వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వరికూటి అమృతపాణి అన్నారు. చీరాలలోని ఆయన వైద్యశాలలో గురువారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వైద్యశాలల వైద్యులు తనకు అనుకూలంగా లేరనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రైవేటు వైద్యశాలలపై తనిఖీలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే తన వైద్యశాలకు సెల్లార్ లేకపోయినా ఉందనే నెపంతో పాటు, సెల్లార్లో వ్యాపారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో తనకు నోటీసులు అందించారన్నారు. చీరాలలో ఏ వ్యాపారం చేయాలన్నా ఆమంచికి పర్సంటేజీ ఇవ్వాలని, వైద్యులు అలా ఇవ్వనందునే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రూ. 75 లక్షల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అనుమతి లేని చానళ్లను పైరసీ ద్వారా సరఫరా చేస్తున్నారన్నారు. పందిళ్లపల్లిలోని ఎస్సీ గ్రామకంఠం భూమిని ఆక్రమించి అందులో ఇల్లు కట్టాడని, చివరకు ఎమ్మెల్యే తండ్రి సమాధి కూడా ఎస్టీల భూముల్లో నిర్మించాడన్నారు. ఎమ్మెల్యేపై 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రౌడీషీట్ తెరవాలన్నారు. ఎమ్మెల్యేకు అడ్డుగా ఉన్నందుకే పొట్టి సుబ్బయ్య పాలెం ఖాళీ చేయించే ప్రయత్నం ఎమ్మెల్యేకు ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ నుంచి మురుగు, ఇతర వ్యర్థాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన కంపెనీకి అడ్డుగా ఉన్న పొట్టిసుబ్బయ్య పాలేన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేశారని వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి అమృతపాణి ఆరోపించారు. రొయ్యల ఫ్యాక్టరీకి పర్యావరణశాఖ అనుమతి లేదన్నారు. అటవీభూముల్లో పైపులైన్లు వేసి అక్రమంగా వాడుకుంటున్నారని విమర్శించారు. చేనేత కార్మికులకు 450 ఇళ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి కేవలం 250 మాత్రమే కట్టి మిగతా నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. ఆమంచి అరాచకాలను వ్యతిరేకిస్తున్న వారిపై మావోయిస్టు ముద్ర వేసి మాచర్ల మోహన్‌రావు లాంటి చేనేత నాయకునిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. ఆమంచి అక్రమాలపై తనవద్ద ఉన్న ఆధారాలతో న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నందునే తనపై వైధింపులకు పాల్పడుతున్నారన్నారు. చీరాల నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, పార్టీ నాయకులు ఉన్నారు. -
చీరాల టీడీపీలో ముసలం
ఆమంచి వర్సెస్ శ్రీరామ్ మాల్యాద్రి పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాలు నవనిర్మాణ దీక్షకు ఎంపీని ఆహ్వానించని ఎమ్మెల్యే మాల్యాద్రి, పోతుల సునీత వర్గం గైర్హాజరు ఆగ్రహంతో రగులుతున్న ఎంపీ.. అధిష్టానానికి ఫిర్యాదు భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు ఒంగోలు: చీరాల టీడీపీలో ముసలం పుట్టింది. అధికార పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆమంచి అధికార పార్టీలో చేరడాన్ని అటు పోతుల సునీత, ఇటు ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలు ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా ముఖ్యమంత్రి ఆమంచిని పార్టీలో చేర్చుకోవడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. తాజాగా సోమవారం చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి నిర్వహించిన నవనిర్మాణ దీక్ష సభకు ఎంపీ మాల్యాద్రి, సునీత వర్గాలు హాజరుకాలేదు. దీక్షకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావులు హాజరైనప్పటికీ అధికార పార్టీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ నేత హాజరుకాకపోవడంపై చర్చలు మొదలయ్యాయి. ఎంపీ శ్రీరామ్, సునీతను ఎమ్మెల్యే ఆమంచి ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయినా ఇద్దరు మంత్రులు ఈ విషయం తమకెందుకన్నట్లు నోరు మెదపలేదని సమాచారం. అధికార పార్టీ కార్యక్రమానికి ఎంపీ హోదాలో ఉన్న తనను పిలవకపోవడంపై ఎంపీ మాల్యాద్రి ఆగ్రహం చెంది, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కనీసం మంత్రులు కూడా మాటమాత్రం కూడా తనను పిలవకపోవడంపై మరింత ఆవేదన చెంది, ఈ విషయంపై ఇటు జిల్లా స్థాయి, అటు రాష్ట్రస్థాయి నేతలకు ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పోతుల సునీత వర్గం ఒంగోలులో ఉన్న ఎంపీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నాటి వైద్యశిబిరంలో విభేదాలకు బీజం.. చీరాల అధికార పార్టీలో ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, పోతుల సునీతలు ఒక వర్గంగా, ఆమంచి మరో వర్గంగా విడిపోయూరు. దీంతో అధికార పార్టీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే పోతుల, ఆమంచి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుండగా, తాజాగా ఎమ్మెల్యే బాపట్ల ఎంపీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చుతోంది. ఆమంచి పార్టీలో చేరిన కొత్తలో ఎంపీ మాల్యాద్రి చీరాలలో మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేతో పాటు సునీతను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత వర్గాలు అక్కడే గొడవకు దిగాయి. దీంతో ఆమంచిని ఎంపీ మందలించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడే ఇరువర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపీ చీరాలలో ప్రత్యేక వర్గం కూడగట్టుకుంటుండాన్ని ఆమంచి వర్గం జీర్ణించుకోలేకపోతుంది. నాలుగు నెలల క్రితం చీరాలలో జరిగిన అంబేద్కర్ భవన్ ప్రారంభానికి సైతం ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులను ఆహ్వానించినా... ఎంపీని మాత్రం పిలవలేదు. తాజాగా నవ నిర్మాణ దీక్షకు సైతం పిలవకపోవడంతో మాల్యాద్రి, సునీత వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. -
'ఆమంచి' అనుచరులు ... అర్ధరాత్రి వీరంగం
వేటపాలెం పోలీసుస్టేషన్లో అర్ధరాత్రి వీరంగం కుర్చీతో పాటు స్టేషన్‌లోని ఇతర సామగ్రి ధ్వంసం తొమ్మిది మందిపై కేసులు.. ముగ్గురు అరెస్టు కేసు నమోదైన వారిలో ఇద్దరు విలేకరులు వేటపాలెం : ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు వేటపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి హల్చల్ చేశారు. పోలీసుస్టేషన్‌పై ఆయన అనుచరులు దాడి చేశారు. కుర్చీలు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చీరాల రూరల్ సీఐ పాపారావు కథనం ప్రకారం.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ కారు డ్రైవర్ గోపిరాజు శుక్రవారం ఉదయం బైకుపై బైపాస్‌లో వెళ్తున్నాడు. ఆ సమయంలో బైకును ఎస్సై చంద్రశేఖర్ అపి లెసైన్‌స పత్రాలు అడిగారు. అవి లేకపోవడంతో ఆయన బైకును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బైకుకు సంబంధించిన పత్రాలు తెచ్చి చూపాలని, ఆ తర్వాతే బైకు తీసుకెళ్లాలని గోపిరాజుకు ఎస్సై తేల్చి చెప్పారు. అదేరోజు అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరుడు, కొత్తపేటకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు తులసీరామ్, గోపిరాజు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పాటు మరో ఆరుగురు పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. సెంట్రీ విధుల్లో ఉన్న వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తులసీరామ్, కారు డ్రైవర్ గోపీరాజు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిలో తులసీరామ్, గోపీరాజు, వెంకటేశ్వర్లును అరెస్టు చేసి దర్శి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఇంకా మరో ఆరుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. వారిలో ఇద్దరు విలేకరులు ఉన్నారు. జర్నలిస్టుల ఖండన పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరు విలేకరుల పేర్లు చేర్చడం దారుణమని జర్నలిస్టులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి వివరాలు సేకరించేందుకు వెళ్లిన విలేకరులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులు నమోదై ఉన్న విలేకరుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, ప్రింట్ మీడియా ప్రతినిధి (సాక్షి కాదు) ఉన్నారు. స్టేషన్‌పై దాడి జరిగిన సందర్భంలో సదరు విలేకరులు ఇద్దరూ అక్కడే ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు ఆయన అనుచరులు తమపై దాడులకు దిగి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుదవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళనకు దిగి.... తమ నిరసన తెలిపారు. ఈ నిరసనలో జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య కాలనీకి చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీజేపీలోకి ‘ఆమంచి’?
-
బీజేపీలోకి ‘ఆమంచి’?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఆమంచి త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీ సానుభూతి ఎమ్మెల్యేగా ఉంటానని మీడియా ముందు ప్రకటించారు. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పోతుల సునీత మరో కీలక ఎంపీతో పాటు కొందరు మంత్రులు పార్టీలో ఆమంచి చేరికను అడ్డుకున్నారు. దీంతో ఆయన కొద్దినెలలుగా రాజకీయాలకు దూరంగా ఉండి సొంత కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన ఆమంచి నియోజకవర్గంలో పలు అధికారక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులను చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కేసులో మొదటి ముద్దాయి ఆయనే. ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆయన సోదరుడి ఇసుక క్వారీపై దాడులు జరిగాయి. 12లారీలను సీజ్ చేసి సోదరుడుపై నాన్ బెయిల్‌బుల్ కేసులు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరితే కేసులు, ఇతరత్రా సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నది ఆయన నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయిన కొణిజేటి రోశయ్యకు ఏకలవ్య శిష్యుడైన ఆమంచి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆయన వర్గం కూడా ఖండించకపోవడం గమనార్హం. -
బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే?
హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకులతో ఆమంచి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఆమంచి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలసి బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చీరాలలో జన్మభూమి రచ్చ రచ్చ
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని విజయనగర కాలనీలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆదివారం రచ్చ రచ్చ అయింది. జన్మభూమి కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ పోతుల సునీతను ఆహ్వానించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏ అర్హతతో వచ్చావో చెప్పాలని ఆమంచి వర్గీయులు సునీతను డిమాండ్ చేశారు. దీంతో సునీతతోపాటు ఆమె వర్గీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ఆమె వర్గీయులు ఆమంచి వర్గీయులపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదే క్రమంలో పోతుల సునీతను అదుపులోకి తీసుకునేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించారు. దీంతో సునీత ఆగ్రహంతో మహిళ కానిస్టేబుల్‌పై దాడి చేసింది.