వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీహరి అలియాస్ సీతయ్య నివాసంలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని నివాసంలో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీ చేశారు. శ్రీహరి బావమరిది చెరుకూరి లక్ష్మీనారాయణ తెలిపిన సమాచారం మేరకు... అనారోగ్యంతో ఉన్న శ్రీహరి కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులక్రితం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి కాపలాగా ఉంటున్న వాచ్‌మన్ గురువారం రాత్రి రాకపోవడం గమనించిన దొంగలు ఇంటి వెనుకవైపు నుంచి గోడదూకి లోనికి ప్రవేశించారు. తలుపు గడియ పగలగొట్టి ఇంటిలోని సొరుగుల్లో ఉన్న నగలు, డబ్బులు తీసుకుని పరారయ్యారు.
శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పనిమనిషి తలుపులు తెరచి, గడియ విరిగి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని సీతయ్య బావ మరిది లక్ష్మీనారాయణకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్సై వెంకటకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్ ఆధారాల కోసం వెతికారు. ఇంటి యజమాని వచ్చేవరకు చోరీ జరిగిన సొత్తు విలువ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 250 సవర్ల బంగారం, 25 కేజీల వెండి, 16 లక్షల నగదు అపహరణకు గురైందని, మొత్తం రూ.కోటి విలువ ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment