mla amanchi krishna mohan
-
టీడీపీ ఎమ్మెల్యేకు షాక్.. మైనింగ్ క్వారీలు సీజ్
సాక్షి, చీరాల : టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. పలు మైనింగ్, ఇసుక క్వారీలను సీజ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, అధికార టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారంటూ పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలో ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ ఇటీవల అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమంచి వర్గీయులు చేస్తున్న అక్రమాలు రోజురోజుకు పెరిగిపోయాయి. అంతేకాదు అదే పార్టీకి చెందిన పలువురు నేతలను సైతం బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు నేతలు సైతం ఆమంచి క్వారీయింగ్‌పై పలు ఆరోపణలు చేసారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమ మైనింగ్‌పై దృష్టిపెట్టారు. చినగంజాం మండలంలోని కడవకుదురులోని రెండు క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారు. ఈదాడుల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. -
ఎమ్మెల్యే సోదరుడి ఇంటిలో భారీ చోరీ
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీహరి అలియాస్ సీతయ్య నివాసంలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని నివాసంలో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీ చేశారు. శ్రీహరి బావమరిది చెరుకూరి లక్ష్మీనారాయణ తెలిపిన సమాచారం మేరకు... అనారోగ్యంతో ఉన్న శ్రీహరి కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులక్రితం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి కాపలాగా ఉంటున్న వాచ్‌మన్ గురువారం రాత్రి రాకపోవడం గమనించిన దొంగలు ఇంటి వెనుకవైపు నుంచి గోడదూకి లోనికి ప్రవేశించారు. తలుపు గడియ పగలగొట్టి ఇంటిలోని సొరుగుల్లో ఉన్న నగలు, డబ్బులు తీసుకుని పరారయ్యారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పనిమనిషి తలుపులు తెరచి, గడియ విరిగి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని సీతయ్య బావ మరిది లక్ష్మీనారాయణకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్సై వెంకటకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్ ఆధారాల కోసం వెతికారు. ఇంటి యజమాని వచ్చేవరకు చోరీ జరిగిన సొత్తు విలువ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 250 సవర్ల బంగారం, 25 కేజీల వెండి, 16 లక్షల నగదు అపహరణకు గురైందని, మొత్తం రూ.కోటి విలువ ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. -
'ఆమంచి' ఆగడాలు : సాక్షి ప్రసారాల నిలిపివేత
ప్రకాశం : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆమంచి అరాచకాలపై వార్త రాసినందుకు జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేశాడు. ఆ దాడి దృశ్యాలను ప్రసారం చేసిన 'సాక్షి' చానల్‌పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారు. (చదవండి : ఆమంచి ఆటవిక రాజ్యం.. ) చీరాలలో సాక్షి ప్రసారాలను సోమవారం ఎమ్మెల్యే ఆమంచి నిలిపి వేయించారు. ఎమ్మెల్యే తీరుపై జర్నలిస్ట్ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 500 మంది ఆమంచి బాధితులతో కలిసి సీఎం చంద్రబాబుకు గతంలోనే ఫిర్యాదు చేశానని బాధిత జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి తెలిపారు. అయినా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. నాగార్జునరెడ్డికి పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. -
ఎమ్మెల్యే ‘ఆమంచి’ మోసం చేశారు
► మంజూరైన బ్యాంకు రుణం ఇవ్వకుండా మోసగించాడన్న బాధితుడు ► చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనను మోసగించారని, ఆయనపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుడు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేటపాలెం మండలానికి చెందిన బాధితుడు సర్వేపల్లి సుబ్బయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటరీ ఇన్చార్జి అమృతపాణి సహకారంతో వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ కార్పొషన్ ద్వారా బ్యాంకు రుణం కోసం 2014–15లో దరఖాస్తు చేసుకున్నానన్నాడు. వేటపాలెం ఎస్బీఐ అధికారులు కిరాణ షాపు కోసం రూ 2 లక్షల రుణాన్ని మంజూరు చేశారన్నారు. సరుకుల కొనుగోలుకు కొటేషన్ తీసుకురావాలని బ్యాంకు అధికారులు సూచించగా సాయం చేయమని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఆశ్రయించగా ఆయన చీరాలకు చెందిన వ్యాపారి చుండూరి శ్రీనివాసరావు ద్వారా కొటేషన్ ఇప్పించారన్నారు. అయితే సదరు చుండూరి శ్రీనివాసరావు తనకు డబ్బులు కానీ కిరాణా సరుకులు కానీ ఇవ్వకుండా తిప్పుతూ అవహేళనగా మాట్లాడారన్నారు. పలుమార్లు గట్టిగా ప్రశ్నించగా తన పర్సంటేజిని తీసుకుని మిగిలిన డబ్బును ఎమ్మెల్యేకు ఇచ్చానని చెప్పాడన్నారు. డబ్బులు ఇవ్వాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడగా ఆయన అకౌంట్ నుంచి రూ.50,000 తన అకౌంట్‌కు బదిలీ చేశారన్నారు. మిగతా డబ్బులు కూడా ఇస్తే కిరాణా వ్యాపారం పెట్టుకుని జీవిస్తామని ఎమ్మెల్యేకు అడగగా కులం పేరుతో బూతులు తిట్టి చంపేస్తానని బెదిరించాడని బాధితుడు వాపోయాడు. ఎమ్మెల్యే నుంచి తనకు రావాల్సిన రూ.1,50,000 ఇప్పించాలని, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వ్యాపారి చుండూరి శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. వారి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని బాధితుడు సుబ్బయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బలహీన వర్గాల సంఘ రాష్ట్ర కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత, గిరిజన ఫ్రంట్ కన్వీనర్ పులిపాటì బాబురావు, తదితరులు సుబ్బయ్యకు మద్దతుగా నిలిచారు.