చీరాల టీడీపీలో ముసలం
- ఆమంచి వర్సెస్ శ్రీరామ్ మాల్యాద్రి
- పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాలు
- నవనిర్మాణ దీక్షకు ఎంపీని ఆహ్వానించని ఎమ్మెల్యే
- మాల్యాద్రి, పోతుల సునీత వర్గం గైర్హాజరు
- ఆగ్రహంతో రగులుతున్న ఎంపీ.. అధిష్టానానికి ఫిర్యాదు
- భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు
ఒంగోలు: చీరాల టీడీపీలో ముసలం పుట్టింది. అధికార పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆమంచి అధికార పార్టీలో చేరడాన్ని అటు పోతుల సునీత, ఇటు ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలు ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా ముఖ్యమంత్రి ఆమంచిని పార్టీలో చేర్చుకోవడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి.
తాజాగా సోమవారం చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి నిర్వహించిన నవనిర్మాణ దీక్ష సభకు ఎంపీ మాల్యాద్రి, సునీత వర్గాలు హాజరుకాలేదు. దీక్షకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావులు హాజరైనప్పటికీ అధికార పార్టీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ నేత హాజరుకాకపోవడంపై చర్చలు మొదలయ్యాయి. ఎంపీ శ్రీరామ్, సునీతను ఎమ్మెల్యే ఆమంచి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
అయినా ఇద్దరు మంత్రులు ఈ విషయం తమకెందుకన్నట్లు నోరు మెదపలేదని సమాచారం. అధికార పార్టీ కార్యక్రమానికి ఎంపీ హోదాలో ఉన్న తనను పిలవకపోవడంపై ఎంపీ మాల్యాద్రి ఆగ్రహం చెంది, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కనీసం మంత్రులు కూడా మాటమాత్రం కూడా తనను పిలవకపోవడంపై మరింత ఆవేదన చెంది, ఈ విషయంపై ఇటు జిల్లా స్థాయి, అటు రాష్ట్రస్థాయి నేతలకు ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పోతుల సునీత వర్గం ఒంగోలులో ఉన్న ఎంపీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.
నాటి వైద్యశిబిరంలో విభేదాలకు బీజం..
చీరాల అధికార పార్టీలో ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, పోతుల సునీతలు ఒక వర్గంగా, ఆమంచి మరో వర్గంగా విడిపోయూరు. దీంతో అధికార పార్టీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే పోతుల, ఆమంచి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుండగా, తాజాగా ఎమ్మెల్యే బాపట్ల ఎంపీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చుతోంది. ఆమంచి పార్టీలో చేరిన కొత్తలో ఎంపీ మాల్యాద్రి చీరాలలో మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేతో పాటు సునీతను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత వర్గాలు అక్కడే గొడవకు దిగాయి. దీంతో ఆమంచిని ఎంపీ మందలించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడే ఇరువర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపీ చీరాలలో ప్రత్యేక వర్గం కూడగట్టుకుంటుండాన్ని ఆమంచి వర్గం జీర్ణించుకోలేకపోతుంది.
నాలుగు నెలల క్రితం చీరాలలో జరిగిన అంబేద్కర్ భవన్ ప్రారంభానికి సైతం ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులను ఆహ్వానించినా... ఎంపీని మాత్రం పిలవలేదు. తాజాగా నవ నిర్మాణ దీక్షకు సైతం పిలవకపోవడంతో మాల్యాద్రి, సునీత వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం.