సాక్షి, గుంటూరు: పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు ఆయన కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని, అది పవన్ మాటల్లోనే అర్థమయ్యిందని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు వలన కాపులకు కలిగే ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ ప్రయోజనం కోసమే పవన్ పార్టీ పెట్టారని, జనసేన పార్టీ పెట్టి కాపు కులాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దని ఆమంచి అన్నారు.
కరోనా వల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తినా సంక్షేమం అందించాం. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. వాలంటీర్ల వ్యవస్థతో పారదర్శకంగా పథకాలను అందిస్తున్నాం. వైసీపీకి భావజాలం లేదనటం సబబు కాదు, ఆ పదాలను పవన్ విత్ డ్రా చేసుకోవాలి. పురందేశ్వరి పూటకో పార్టీ మారుతూ విమర్శలు చేస్తుంటారు. కాంగ్రెస్‌లో ఉంటూ చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు బీజేపీలో ఉంటూ వైసీపీని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తూ జగన్ పాలన గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమంచి కృష్ణమోహన్ హితవు పలికారు.
‘‘చంద్రబాబుతో మీ బంధుత్వాన్ని రాజకీయాలకు వాడొద్దు. ఇది అసహజమైన పరిణామం. చంద్రబాబుపై కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఏనాడూ గెలిచింది లేదు. అలాంటి వ్యక్తి జగన్‌ని విమర్శించటం దారుణం. చంద్రబాబు ఎలాంటి యాత్రలు చేసినా ఎదుర్కోవటానికి మేము సిద్దమే. మా బస్సుయాత్రలకు జనం స్పందన బాగుంది’’ అని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.
చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత?
Comments
Please login to add a commentAdd a comment