
ఇచ్చిపుచ్చుకుందాం..!
గవర్నర్ సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల చర్చలు
తెలంగాణకు సముద్రం లేదు...
తెచ్చిపెట్టుకుంటే రాదు. మనకు దగ్గర్లో ఉండే మచిలీపట్నం పోర్టు నుంచి ఎగు మతులు, దిగుమతులు చేసుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్‌తో ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాంటి వాటిపై ఇరువురం కూర్చుని చర్చలతో పరిష్కరించుకుంటూ పరస్పరం సహకరించుకుంటాం.. - తెలంగాణ సీఎం కేసీఆర్
'కేసీఆర్, నేను కొత్తేమీ కాదు. 1984 నుంచి పరిచయముంది. రాజకీయాల్లో కొన్ని వైఖరులు తీసుకున్నా ప్రజల విషయంలో సరైన విధానాల్లో వెళ్లాలి. గతంలో మేము కొన్ని సమయాల్లో విభేదించుకున్నా.. విమర్శించుకున్నా.. ఆ సందర్భం వేరు. కానీ నేడు ఇద్దరం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది' - ఏపీ సీఎం చంద్రబాబు
పరిష్కరించుకున్న అంశాలివీ...
ఉద్యోగుల పంపిణీ..: రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని స్థానికత ఆధారంగా చేసుకోవడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. ఇందుకోసం అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకూ ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. వారం పది రోజుల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తిచేయాలని నిర్ణయించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజనపై 22వ తేదీకి స్పష్టత వచ్చే అవకాశాల నేపథ్యంలో.. ఒకవేళ తెలంగాణ సీఎస్, డీజీపీలను ఏపీకి కేటాయించిన పక్షంలో వారిని తిరిగి తెలంగాణకే ఇచ్చేందుకు ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. అందుకు చంద్రబాబు అంగీకరించారు.
సంస్థల సేవలు..: విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల సేవలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ఒప్పందాలు చేసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. తెలంగాణలో ఉన్న సంస్థలకు ఎండీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఏపీ ప్రభుత్వం జేఎండీని ఏర్పాటు చేసుకోవాలని; ఏపీలో ఉన్న సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎండీని ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం జేఎండీని ఏర్పాటు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలూ అంగీకరించాయి.
అసెంబ్లీ భవనాలు..: అసెంబ్లీ, మండలిలో భవనాలు, స్థలం కేటాయింపుల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర చర్చలు, సహాయ సహకారాలకు నాంది పలికింది. గవర్నర్ నిర్వహించిన ఒక్క సమావేశంలోనే ప్రధానమైన మూడు సమస్యలకు పరిష్కారం లభించింది. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలనుంచి సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో.. మూడు అంశాలకు పరిష్కారం లభించింది. ఉద్యోగుల పంపిణీ, అసెంబ్లీ భవనాల స్థల కేటాయింపులు, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సీఎస్‌లు, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.
కోర్టులకెళితే ఏళ్లు గడుస్తాయి: గవర్నర్
గవర్నర్ నరసింహన్ తొలుత ఇద్దరు సీఎంలతో సుమారు 20 నిముషాల పాటు సమావేశమై మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, గిల్లికజ్జాలను, కీచులాటలను కాదని, దీన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని సూచించారు.విభజన సమయంలో కచ్చితంగా సమస్యలు వస్తాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వివాదాలు, గొడవలు పడరాదని హితవుపలికారు. కొన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు తనను వినియోగించుకోవచ్చునని కూడా గవర్నర్ సూచించారు. ఇరురాష్ట్రాల ప్రజలు తెలుగు వారేనని తగువు పడితే ప్రజలను చులకన చేయడమేనని గవర్నర్ అన్నారు. దీనికి చంద్రబాబు, కేసీఆర్‌లు స్పందిస్తూ.. ఇక తామే తరచూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు.
‘ఉద్యోగుల’పై సీఎస్‌ల భేటీలో..: సీఎంలతో వేరుగా మాట్లాడిన అనంతరం గవర్నర్ సమక్షంలో ఇద్దరు సీఎంలు, రెండు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, సీఎస్‌లు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తొలుత ఉద్యోగుల పంపిణీపై చర్చను ప్రారంభించారు. ‘‘కేవలం 45,000 మంది రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీయే కదా.. రెండు రాష్ట్రాల సీఎస్‌లు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే ఇద్దరు ముఖ్యమంత్రులం కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఇందులో పంచాయితీలు అవసరం లేదని కేసీఆర్ పేర్కొనగా.. చంద్రబాబు కూడా స్పందిస్తూ రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలం కలిసే ఉందామని స్పందించారు. ఈ దశలో కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటా అసెంబ్లీ, మండలి విషయంలో తెలంగాణ సభాపతులు పేర్కొన్న ప్రకారం అంగీకరించామని, ఇందులో సమస్యే లేదని చెప్పారు. దీనిపై మధుసూదనాచారి, స్వామిగౌడ్ స్పందిస్తూ అవునన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని కోసం కేంద్ర ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సహకరించాలని కేసీఆర్‌ను కోరారు. ఈ విషయంలో కచ్చితంగా సహకరిస్తామని కేసీఆర్ బదులిచ్చారు. నదీ జలాల విషయంలో కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
గత జ్ఞాపకాలతో...
అధికారికంగా నిర్వహించిన గవర్నర్ సమావేశంలో రెండు వైపుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. గవర్నర్ మధ్యలో కూర్చుండగా గవర్నర్ కుడివైపున చంద్రబాబు, ఎడమ వైపున కేసీఆర్ కూర్చున్నారు. మధ్యాహ్నం12 గంటలకు కేసీఆర్ రాజభవన్‌కు చేరుకోగా 12.05 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. ఈ భేటీ సందర్భంగా కేసీఆర్, చంద్రబాబు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. గతంలో బాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.