సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది.
పలు విడతల్లో జరిగిన చర్చలతో..
విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్‌మెంట్‌ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్‌మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్‌రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ..
♦ 7 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం.
♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్‌తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు.
♦ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు.
♦ వర్క్‌మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు.
♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు.
♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు.
♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం.
♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం.
♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి).
♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం.
♦ ఈఎన్‌టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు.
♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు.
♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు.
♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు.
♦ జెన్‌కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు
25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం
ఆర్టిజన్లకు 7శాతం ఫిట్‌మెంట్‌ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు.
తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్‌ఆర్‌ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment