చర్చలు విఫలమైనట్లు ప్రకటిస్తున్న అశ్వత్థామరెడ్డి
‘అంతా సవ్యంగానే సాగింది. హైకోర్టు చెప్పిన సూచనల ప్రకారమే చర్చల ఎజెండా సిద్ధం చేశాం. కానీ వాటిని చర్చించేందుకు జేఏసీ నేతలు ఇష్టపడలేదు. మొత్తం డిమాండ్లపై చర్చకు పట్టుబట్టారు. అదెలా కుదురుతుంది. ఇదే విషయం అడిగితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లి తిరిగి రాలేదు – అధికారులు
ఆర్టీసీ చరిత్రలోనే కాదు ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎన్నడూ చూడలేదు. ఫోన్లు కూడా లాగేసుకుని, పోలీసు పహారా పెట్టి జరిపేవి చర్చలెలా అవుతాయి. యూనియన్ల డిమాండ్లు పక్కన పెట్టి తమ ఎజెండా ప్రకారమే చర్చ జరగాలని అధికారులు చెప్పటం దారుణం – కార్మిక సంఘాల జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఇరవై రెండు రోజుల సమ్మె తర్వాత పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తూ ఇటు ప్రభుత్వం చర్చలకు పిలవటం, వెంటనే కార్మిక సంఘాలు స్వాగతించటంతో.. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ చర్చలు ఇటు జేఏసీ నేతలు, అటు అధికారులు సమావేశ మందిరంలో కూర్చున్న కొద్దిసేపటికే అర్ధంతరంగా ఆగిపోయాయి. ఎవరి పట్టు వారు ప్రదర్శించటంతో చర్చలు విఫలమ య్యాయి. అధికారులది తప్పంటూ కార్మిక సంఘాల జేఏసీ, జేఏసీ తీరు సరికాదంటూ అధికారులు ప్రకటించి నిష్క్రమించారు. మళ్లీ చర్చలకు పిలిస్తే తాము సిద్ధమని జేఏసీ పేర్కొనగా, తాము చర్చల హాలులోనే ఉన్నా మళ్లీ జేఏసీ నేతలు రాలేదని అధికారులు పేర్కొనటం విశేషం. వెరసి మళ్లీ చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఆదివారం దీపావళి కావ టం, సోమవారమే కోర్టుకు నివేదించాల్సి ఉండటంతో పరిస్థితి అయో మయంగా మారింది. విఫలం కావాలన్న ఎజెండాతోనే ప్రభుత్వం ఈ తరహా చర్చలకు ప్లాన్ చేసిందని జేఏసీ ఆరోపించింది. సమ్మె యథాతథంగా సాగుతుందని, 30న సకల జనుల సమర భేరీ భారీ స్థాయిలో నిర్వహించే ఏర్పాట్లు సాగుతున్నాయని జేఏసీ నేతలు వెల్లడించారు.
ఉదయమే చర్చలపై సమాచారం..
శుక్రవారం సాయంత్రం ఆరుగురు సభ్యుల అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం దాదాపు 5 గంటల పాటు సమీక్షించి చర్చలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. కానీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ సంతకంతో ఉన్న లేఖలు అందజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు చర్చలుంటాయని, ఎండీ కార్యాలయం ఉన్న ఎర్రంమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ కార్యాలయాన్ని వేదికగా పేర్కొన్నారు. దీనికి జేఏసీ నేతలు సమ్మతించి అఖిలపక్ష నేతలతో భేటీ అయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా జేఏసీ నేతలు 16 మంది ఆ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. గేట్ వద్దనే వారిని ఆపేసి జేఏసీలోని నాలుగు సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు మాత్రమే హాజరు కావాలని పేర్లను పిలిచారు. దీంతో కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్లు రాజిరెడ్డి, వీఎస్‌రావు, వాసుదేవరావులు చర్చలకు వెళ్లడంతో మిగతావారు బయటే ఉండిపోయారు. లోపలికి వెళ్లిన వారి ఫోన్లు బయటే డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
ఇది పద్ధతి కాదని, అవసరమైతే తాము వెలుపల ఉన్న నేతలతో మాట్లాడాల్సి ఉంటుందని, ఫోన్లు అనుమతించాలని కోరినా అధికారులు అంగీకరించలేదు. వాటిని స్విచ్ఛాఫ్ చేసి పెట్టిన తర్వాతే అనుమతించారు. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాలు చర్చలకు సిద్ధమయ్యారు. హైకోర్టు సూచించినట్లు 21 అంశాలపై చర్చలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అదెలా సాధ్యమని, అసలు హైకోర్టు 21 అంశాలపైనే చర్చించాలని చెప్పలేదని, జే ఏసీ సూచించిన 26 అంశాలపైన అయినా, కోర్టులో మరో పిటిషన్‌దారు అయిన టీఎంయూ పేర్కొన్న 45 డిమాండ్లపైన అయినా చర్చించాలని జేఏసీ నేతలు కోరారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఆధారంగానే ఈ చర్చలుంటాయని, అన్ని డిమాండ్లపై సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో దాదాపు రెండు గంటలు గడిచాక జేఏసీ నేతలు వెలుపలికి వచ్చారు. మీడియా ప్రతినిధులను కూడా గేట్ వద్దనే పోలీసులు అపేయటంతో, వారు గేట్ వద్దకు వచ్చి చర్చలు మొదలు కాకుండానే అర్ధంతరంగా ఆగిపోయినట్లు వెల్లడించారు. తాము అధికారులు పిలిస్తే ఎప్పుడైనా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని, వారి పిలుపు కోసం ఎదురు చూస్తామని చెప్పి నిష్క్రమించారు. వారు వెళ్లిన గంటన్నర తర్వాత చర్చల్లో పాల్గొన్న ఇద్దరు అధికారులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడి నిష్క్రమించారు.
కోర్టు ఉత్తర్వును వక్రీకరించారు: జేఏసీ నేతలు
‘ప్రభుత్వానికి చర్చలు ఫలించాలన్న ఆలోచన లేదని ఈ చర్చల తంతుతో తేలిపోయింది. చర్చలు విఫలమయ్యేలా సొంత ఎజెండా రూపొందించింది. చర్చల సారాంశాన్ని సోమవారం హైకోర్టుకు నివేదించాల్సి ఉన్నందున, జేఏసీ నేతలే చర్చలను విఫలం చేశారని కోర్టుకు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అసలు కోర్టు ఆదేశించింది వేరు.. ఇక్కడ జరిగింది వేరు. 21 అంశాలపైనే చర్చించాలని కోర్టు చెప్పలేదు. జేఏసీ సూచించిన 26 అంశాలపై చర్చించమని కోరాం. వాటిల్లో మేం, అధికారులు ఏయే విషయాల్లో పట్టువిడుపులతో వ్యవహరిస్తారనేది తర్వాత సంగతి. ముందు చర్చిస్తే తేలిపోతుంది కదా.. దానికి అధికారులు సిద్ధంగా లేరు. వారు 21 అంశాలపైనే చర్చిస్తామని పట్టుపట్టి కూర్చున్నారు. సమ్మెకు పూర్వం జరిగిన చర్చల్లో 16 మందిని అనుమతించారు. ఇప్పుడు వారిని బయటే ఆపారు. ఫోన్లు లాగేసుకున్నారు. దీనిపై మేం మాట్లాడుతుండగానే అధికారులే సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. వారు మళ్లీ వస్తారని కాసేపు అక్కడే కూర్చుని, సిబ్బందితో టీ తెప్పించుకుని తాగాం. అధికారులు రాకపోవటంతో మేం బయటకొచ్చాం. శత్రు దేశాల మధ్య చర్చలు కూడా ఇంత దారుణంగా ఉండవు. చర్చల తంతు మొత్తం వీడియో రికార్డు చేయించాం. ఆ వీడియోను కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని చూస్తే ఎవరు చర్చలను విఫలం చేశారో తెలుస్తుంది’
మళ్లీ వస్తామని వెళ్లిపోయారు: చర్చల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు
చర్చలు ఫలవంతమయ్యేలా మేం ప్రయత్నించాం. కానీ జేఏసీ నేతలే సహకరించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదని ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పింది. కోర్టుకు కూడా విన్నవించింది. అది మినహాయించి మిగతావాటిల్లోని 21 అంశాలపై చర్చించాలని కోర్టు సూచించింది. ఆ మేరకే 21 అంశాలపై చర్చిద్దామని పేర్కొన్నాం. కానీ అన్ని డిమాండ్లపై చర్చించాలని వారు పట్టుపట్టారు. కాసేపు బయటకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు. మళ్లీ అదే పట్టుపట్టారు. మేం మళ్లీ అదే విషయాన్ని వారికి చెప్పాం. దీంతో తమ వారితో మాట్లాడి వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర వరకు వేచి చూశాం. వారు రాలేదు. దీంతో ఇక వారు చర్చల నుంచి నిష్క్రమించినట్లు భావించి మేం కూడా వెలుపలికి వచ్చేశాం. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు ఉండాలని ఎక్కడా రూల్ లేదు. ఫోన్లను అనుమతించటానికి వేరే కారణమేమీ లేదు. సమావేశం మధ్యలో ఫోన్లు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వాటిని అనుమతించకూడదనుకున్నాం’
మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment