పాత పాల్వంచలో ఎమ్మెల్యే వనమా కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. సమ్మె ప్రారంభమై 38 రోజులు జరుగుతున్నా, కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవటం దారుణమని నినదిస్తూ సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపేలా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఆయనపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించటంతో సోమవారం ఉదయం నుంచి వారి ఇళ్ల ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో కార్మికులు వారి ఇళ్ల వద్దకు రాకుండా అడ్డుకోవటంతో కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రజా ప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో అక్కడి సిబ్బందికి వినతి పత్రాలు ఇచ్చి వెళ్లారు. తమ ముట్టడికి స్పందించని ప్రజాప్రతినిధుల ఇళ్లముందు చావుడప్పు కొట్టనున్నట్టు జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి ప్రకటించారు. సాయంత్రం హన్మకొండలోని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటిముందు కార్మికుల ఆధ్వర్యంలో చావుడప్పు వాయించే కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ముగ్గురు కోకన్వీనర్లు మంగళవారం ప్రారంభించాల్సిన నిరవధిక నిరశన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇందిరాపార్కు వద్ద దీన్ని చేపట్టాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment