సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో ఆర్టీసీ సమ్మె సహా మరో 30 అంశాల ఎజెండాపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ సమ్మె 28 రోజులకు చేరిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై ఈ భేటీలో ప్రభుత్వం పరిశీలన జరపనుంది.
రాష్ట్రంలోని దాదాపు 4 వేల రూట్లలో ప్రైవేటు బస్సులను నడపడానికి పర్మిట్లు జారీ చేసే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీకి సన్నాహకంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు బస్సులకు తక్షణమే 4 వేల రూట్లలో పర్మిట్ల జారీకి సంబంధించి విధివిధానాలు, నోటిఫికేషన్ జారీ తదితర అంశాలపై ఈ సమావేశంలో ఓ అభిప్రా యానికి వచ్చినట్టు సమాచారం. ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని సైతం కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.
కేబినెట్ భేటీలో తీసుకోనున్న మరికొన్ని ముఖ్య నిర్ణయాలు..
- గాంధీ 150వ జయంతి సందర్భంగా 10 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
- భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
- అన్ని జిల్లాల్లో, పోలీస్ కమిషనరేట్లలో ఫింగర్ ప్రింట్ అనాలసిస్ యూనిట్ల ఏర్పాటు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై నిర్ణయం
- పలు కోర్టుల్లో పోస్టులు మంజూరు
- సమాచార పౌర సంబంధాల శాఖలో 36 పోస్టుల మంజూరు
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ను ఆర్‌అండ్‌బీలో విలీనం చేస్తూ నిర్ణయం
- గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కొత్త పోస్టులకు అనుమతి
- రంగారెడ్డి జిల్లాలో కొత్త గ్రామపంచాయతీగా అంకిరెడ్డి గూడెం ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment