ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు: జగ్గారెడ్డి | MLA Jagga Reddy demands Kcr To Recruit RTC Employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు: జగ్గారెడ్డి

Published Tue, Nov 26 2019 1:17 PM | Last Updated on Tue, Nov 26 2019 2:03 PM

MLA Jagga Reddy demands Kcr To Recruit RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం విచిత్రంగా తయారవుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత ఎంతో మేలు జరుగుతుందన్న ఆశతో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వద్దకు తీసుకువచ్చారన్నారు. కార్మికుల డిమాండ్లు నిజమైనప్పటికీ ప్రాణనష్టం జరుగుతోందన్న ఆలోచనతో సమ్మె విరమించారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మె విరమించి తిరిగి విధుల్లో చేరాలనుకుంటున్న ఉద్యోగులను ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ విధుల్లోకి తీసుకోమని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ‘ఆయన ఎవరు ప్రకటన చేయడానికి.. రాష్ట్రంలో ఏం జరుగుతుంది. రాష్ట్రంలో మంత్రులు లేరా’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆకలి అవుతుందని చెప్పుకునే పరిస్థితి.. నిరసన తెలిపే హక్కు కూడా లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. గత 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ప్రతి పక్షాలకు మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీని సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ప్రైవేటు చేసినా.. భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రైవేటును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు లేఖలు రాస్తున్నానని, ఈ విషయాన్ని కూడా తమ పార్టీ పెద్దలకు లేఖలో వివరిస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

ఆర్టీసీని ఆదుకోవాలి
అలాగే ‘చక్రపాణి, అల్లం నారాయణ, కారం రవీందర్‌రెడ్డి, టీఎన్‌జీఓ, టీజీఓ నేతలంతా ఎక్కడున్నారు. మీ అందరికీ చీము నెత్తురు లేదా.. మీకు అసలు సిగ్గుందా.. ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారా...చరిత్ర హీనులుగా మిగిలిపోతారా’ అంటూ ధ్వజమెత్తారు. అదే విధంగా ‘సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు. ఆర్టీసీని ఆదుకోవాలి. ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు. పోలీసులు మీ చేతుల్లో ఉండవచ్చు. కానీ అన్ని రోజులు మనవి కావని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement