సీఎం కేసీఆర్‌ వరాల విందు | KCR Announce Huge Sops For TSRTC Employees | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ వరాల విందు

Published Mon, Dec 2 2019 1:39 AM | Last Updated on Mon, Dec 2 2019 1:40 PM

KCR Announce Huge Sops For TSRTC Employees - Sakshi

ఆదివారం ప్రగతి భవన్‌లో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు

ఆర్టీసీకి నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తా. టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతి నెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. అవసరమైన పక్షంలో కార్మికులు రోజుకు అరగంట నుంచి గంట సమయం ఎక్కువ పనిచేయాలి. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. 

ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్లు ఉంటరు. రామాయణ యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముడిని అడగ్గా కలియుగంలో అక్కడక్కడా పుట్టాలని రాముడు సూచించాడు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారు. వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఏ ఒక్క రూటులోనూ ఒక్క ప్రైవేటు బస్సుకూ అనుమతి ఇవ్వబోమని హామీ ఇచ్చారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ఏటా రూ. వెయ్యి కోట్ల లాభం సంస్థకు రావాలని, ప్రతి ఉద్యోగీ ఏడాదికి రూ. లక్ష బోనస్‌ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్‌ నెల జీతాన్ని మంగళవారం అందిస్తామని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. 

ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి పువ్వాడ తదితరులు 

భోజన సమయంలో కూడా సీఎం కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసు కున్నారు. సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబం ధించిన ప్రతి అంశం, సమస్యపై అప్పటికప్పుడు సీఎం స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలు, కంట్రోలర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. అధికారులు, 

ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సమష్టిగా కష్టపడి సాధించుకున్న తెలంగాణ స్పూర్తితోనే ఆర్టీసీని లాభాలబాట నడిపించాలని కోరారు. తాను రవాణాశాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టించానని, నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందన్నారు. ఆర్టీసీని బతికించడానికి ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలసి పనిచేసి ఆర్టీసీని కాపాడాలన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని సూచించారు. 

ఆర్టీసీకి తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతి నెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన పక్షంలో రోజుకు అరగంట నుంచి గంట సమయం ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని సీఎం ప్రకటించారు. విద్యుత్‌ ఉత్పత్తిని ప్రైవేటుకు ఇవ్వలేదని గుర్తుచేశారు. విద్యుత్‌ ఉద్యోగుల మాదిరిగా ఎక్కువ వేతనాలు, సింగరేణి కార్మికుల మాదిరిగా ఏటా బోనస్‌లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని ఆకాంక్షించారు. 

ఆదివారం ప్రగతి భన్‌లో ఆర్టీసీ సిబ్బందితో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

నాటి రాక్షసులే మళ్లీ పుట్టి...
ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్లు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు. ‘యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముడిని అడగ్గా కలియుగంలో అక్కడక్కడా పుట్టాలని రాముడు సూచించాడన్నారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరంటూ కేసీఆర్‌ పేర్కొనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం..

‘‘ఆర్టీసి కార్మికులతో సీఎం కేసిఆర్‌ ఆత్మీయ సమావేశం... ఆద్యంతం ఉద్వేగభరితంగా జరిగింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణంలో సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందబాష్పాలు నింపాయి. మధ్యమధ్యలో సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించిన సందర్భంలో సమావేశ మందిరం కరతాళ ధ్వనులు, హర్షాతిరేకాలతో దద్దరిల్లింది. సీఎం తమ కోసం, తమ పిల్లల కోసం, తమ కుటుంబాల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగుల హృదయాల్లో ఆనందం చప్పట్ల రూపంలో హాలులో ప్రతిధ్వనించింది’’అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రియాంకరెడ్డి ఉదంతంపై ఆవేదన..
ఆర్టీసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. దీన్ని దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా అభివర్ణించారు.

ఆర్టీసీ ఉద్యోగులతో భేటీలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు...
► కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే. ఒకే కుటుంబంలా వ్యవహరించాలి. 
► యథావిధిగా ఇంక్రిమెంట్‌ చెల్లింపు.
► సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా.
► ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత.
► సంపూర్ణ టికెట్‌ బాధ్యత ప్రయాణికుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోం. 
► కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
► మహిళా ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు వేయొద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
► ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్‌ చేంజ్‌ రూమ్స్, లంచ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి.
► మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలలపాటు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ మంజూరు చేస్తాం.
► మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్‌ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్‌ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రెస్‌ వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫారం వేసుకునే అవకాశం కల్పిస్తాం.
► మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి, తగు సూచనలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
► రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు నిర్వహించేది లేదు.
► ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం.
► ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్‌ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో.. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి.
ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పొద్దు.
► ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి.
► ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తాం.
► ఉద్యోగుల పీఎఫ్‌ బకాయిలను, సీపీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
► డిపోల్లో కావాల్సిన స్పేర్‌ పార్ట్స్‌ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
► తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేస్తాం
► కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన చేస్తాం.
► ఆర్టీసీలో పార్సిల్‌ సర్వీసులను ప్రారంభించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement