
ఓ అభిప్రాయానికి వచ్చాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం నెలకొన్న ఉద్యోగుల విభజన, అసెంబ్లీలో భవనాల కేటాయింపు, తొమ్మిదో, పదో షెడ్యూల్‌లోని సంస్థల అంశంలో ఒక అభిప్రాయానికి వచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఇంకా ఏవైనా అంశాలు ఉంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ చర్చలు జరిపి పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారుల చర్చల అనంతరం కేసీఆర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని.. ఇరు రాష్ట్రాలు అహం లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, ఇరు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు నాగిరెడ్డి, పీవీ రమేష్, ముఖ్యమంత్రుల ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, అజయ్ సహానీ సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేడర్ ఉద్యోగులు 67 వేల మంది ఉంటే అందులో 22 వేల వరకు ఖాళీలున్నాయని... మిగతా 45 వేల మంది ఉద్యోగులను మాత్రమే విభజించాల్సి ఉంటుందన్నారు. అదేమీ పెద్ద సమస్య కాదని, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు దీనిపై చర్చించి పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలంగాణ డీజీపీ, సీఎస్‌లుగా ఉన్న అధికారులను ఆంధ్రాకు కేటాయిస్తే.. వారిని తెలంగాణకు ఇవ్వడానికి ఎన్‌వోసీ ఇవ్వాలని కోరగా చంద్రబాబు అంగీకరించారని కేసీఆర్ తెలిపారు.
గౌరవం కాపాడుతాం..
శాసనసభకు సంబంధించి భవనాల కేటాయింపుపై పత్రికల్లో వార్తలు రావడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చామని కేసీఆర్ తెలిపారు. పాత అసెంబ్లీ భవనంలో ఉన్న తెలంగాణ శాసనసభ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలని సూచించామన్నారు. తెలుగువాళ్లం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... సాధారణ అంశాలపై ఇరువురం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని నిర్ణయించామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ ఆరో తేదీతో ముగించడానికి చంద్రబాబు అంగీకరించారని కేసీఆర్ తెలిపారు. పదో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. ‘‘తెలంగాణకు సముద్రం లేదు. తెచ్చిపెట్టుకుంటే రాదు. మనకు దగ్గర్లో ఉండే మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్‌తో ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాంటి వాటిపై ఇరువురం కూర్చుని చర్చలతో పరిష్కరించుకుంటూ పరస్పరం సహకరించుకుంటాం..’’ అని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం పరిష్కరించుకుంటే కేంద్రానికి అంతకు మించిన సంతోషం మరొకటి లేదన్నారు. ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోలేని పక్షంలో కేంద్రం జోక్యం ఉంటుందని చెప్పారు. తొమ్మిదో, పదో షెడ్యూల్‌లోని సంస్థలు ఏ ప్రాంతంలో ఉంటే.. ఆ రాష్ట్రానికి చెందుతాయని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని కేసీఆర్ తెలిపారు. ఎక్కడ సంస్థ ఉంటే ఆ రాష్ట్రానికే వాటి అధిపతులను నియమించే అధికారం ఉంటుందని, జాయింట్ ఎండీ పోస్టును పొరుగు రాష్ట్రం నియమించవచ్చని సూచించారు. దీనికి ఏపీ సీఎం అంగీకరించినట్లు చెప్పారు. నిథిమ్, నాక్‌ల నియామకాలపై చర్చించామని, మరేఅంశాలు చర్చకు రాలేదని పేర్కొన్నారు.