కాసులు కురిపిస్తున్న క్యాప్సికం | capcicum crop in rathnagiri | Sakshi
Sakshi News home page

కాసులు కురిపిస్తున్న క్యాప్సికం

Published Fri, Aug 11 2017 10:37 PM | Last Updated on Mon, Oct 1 2018 5:09 PM

కాసులు కురిపిస్తున్న క్యాప్సికం - Sakshi

కాసులు కురిపిస్తున్న క్యాప్సికం

కరువు నేలలో బంగారం పండిస్తున్న రైతు
ఎకరా ఫాలిహౌస్‌లో రెడ్, ఎల్లో క్యాప్సికం
ప్రతివారం రెండు టన్నుల దిగుబడి
అనంత రైతుకు ఆదర్శంగా నిలుస్తోన్న లోకేష్‌


కరువుకు చిరునామాగా మారిన జిల్లా... వేలమీటర్లు తవ్వినా నీటిచెమ్మ కనిపించని పరిస్థితి. అయినా రైతులంతా చెనక్కాయలే వేయడం...తీవ్రంగా నష్టపోతూ అప్పుల పాలవడం..ఏటా ఇదే దుస్థితి. అందుకే ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. సంప్రదాయ పంటలను పక్కనపెట్టి వాణిజ్య పంటలవైపు దృష్టి సారించాడు. కేవలం ఎకరాలో పొలంలోనే క్యాప్సికం పండిస్తూ సిరులు కురిపిస్తున్నాడు.

రత్నగిరి(రొళ్ల): మారుతున్న కాలానికి అనుగుణంగా ‘అనంత’ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వాణిజ్య పంటసాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ ఇతర రాష్ట్రాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు రొళ్ల మండలం రత్నగిరికి చెందిన రైతు లోకేష్‌. అందరిలాగే సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాలు చవిచూసిన లోకేష్‌...ఈసారి మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఆధునిక పద్ధతులతో క్యాప్సికం సాగు చేశాడు. వారానికి రూ.2 లక్షల చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాడు.

బెంగళూరు నుంచి నారు సరఫరా
క్యాప్సికం గురంచి బాగా అధ్యయనం చేసిన లోకేష్‌ ముందుగా రూ. 42 లక్షలు ఖర్చు చేసి ఎకరా స్థలంలో పాలీహౌస్‌ నిర్మించాడు. ఇందుకు ఉద్యానశాఖ రూ.16 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఆ తర్వాత బెంగళూరులోని ఏకలవ్య నర్సరీల్లో ఒకటిన్నర నెలల లేత నారు తీసుకువచ్చాడు. ఇందులో రెడ్‌ క్యాప్సికం కోసం రూ.6 వేలు, ఎల్లో క్యాప్సికం కోసం రూ.5 వేలు ఖర్చు చేశాడు. అర మీటర్‌ విస్తీర్ణంలో ఫాలిహౌస్‌లో సాగు చేపట్టాడు. నీటిని ఆదా చేసుకునేందుకు డ్రిప్పు పద్ధతికి శ్రీకారం చుట్టాడు.

9 నెలల వరకూ దిగుబడి
క్యాప్సికం సాగు చేసిన 70 రోజుల నుంచి ప్రారంభమై 9 నెలల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే ఒకటిన్నర సంవత్సరం వరకు దిగుబడి వస్తుందని రైతు లోకేష్‌ చెబుతున్నాడు. దిగుబడి ప్రారంభమైన తర్వాత  10 రోజుల ఒకసారి కాయలను కోయల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు ప్రతి కోతకు రెండు టన్నుల వరకు దిగుబడి వస్తోందని వెళ్లడించారు.

మార్కెట్‌లో మంచి రేటు
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో క్యాప్సికం రూ.30 నుంచి రూ.35 వరకు ధర పలుకుతోందనీ, ప్రస్తుతానికి తాను రూ.2 లక్షల వరకు ఆదాయం పొందానని లోకేష్‌ తెలిపారు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, బెంగళూరు, కోలారు, తుమకూరు మార్కెట్‌లకు క్యాప్సికంను తరలిస్తున్నానని వెళ్లడించాడు.

‘ఖోఖో’సాగులోనూ లాభాలే
తాను క్యాప్సిక్సంతో పాటు వక్కతోటలో అంతర పంటగా 2.5 ఎకరాల్లో ఖోఖో పంటను కూడా సాగు చేశానని లోకేష్‌ తెలిపారు. ఖోఖో విత్తనాలను ప్రస్తుతం ఏలూరుకు తరలిస్తున్నాననీ, అక్కడ కిలో ఖోఖో విత్తనాలు రూ.150 నుంచి 200 వరకు ధర పలుకుతున్నాయని వెళ్లడించారు. క్యాడ్బరీ చాక్లెట్‌ కంపెనీ వారే నేరుగా ఖోఖో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారనీ, ఐదేళ్లుగా ఖోఖో పంట సాగులోనూ అధిక లాభాలు గడిస్తున్నానని లోకేష్‌ చెబుతున్నారు.

వాణిజ్య పంటలపై మక్కువతోనే...
ఏటా సంప్రదాయ పంటలు వేసి నష్టపోవడంతో వాణిజ్య పంటలు పండించాలనుకున్నాను. ఎకరా విస్తీర్ణంలో ఫాలీహౌస్‌ ఏర్పాటు చేసి రెడ్, ఎల్లో క్యాప్సికం పంటను సాగు చేశాను. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. ఇప్పటికే నాలుగు సార్లు కోత కోశాం. ప్రతి కోతకు రెండు టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం ఉంటే ఇంకా బాగుండేది.
- లోకేష్‌, రైతు రత్నగిరి గ్రామం, రొళ్ల మండలం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement