rathnagiri
-
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2023 విజేత రత్నగిరి జెట్స్
2023 మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ విజేతగా రత్నగిరి జెట్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తి మ్యాచ్ సాధ్యపడకపోవడంతో, పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం రత్నగిరి జెట్స్, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారమే (జూన్ 29) జరగాల్సి ఉండింది. అయితే ఆ రోజు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్‌ను శుక్రవారానికి వాయిదా వేసారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ప్రకటించారు. అప్పటికీ వర్షం ఎడతెరిపి ఇచ్చిన ప్రతిసారి మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్వహకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 16 ఓవర్ల ఆట కూడా జరిగింది. కేదార్ జాదవ్ నేతృత్వంలోని కొల్హాపూర్ టస్కర్స్ 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ ఆగలేదు. దీంతో పాయింట్ల ఆధారంగా రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. టస్కర్స్‌కు కూడా జెట్స్తో సమానంగా పాయింట్లు ఉండటంతో నెట్ రన్ ఆధారంగా విజేతను డిసైడ్ చేశారు. విన్నింగ్ జట్టు కెప్టెన్ అజీమ్ ఖాజీకి 50 లక్షల చెక్ లభించగా.. రన్నరప్ టస్కర్స్‌కు 25 లక్షల చెక్ అందింది. -
కరోనా ఎఫెక్ట్: దయచేసి హోలి పండుగకు ఊరు రావొద్దు
సాక్షి, ముంబై: ఈ సారి హోలి పండుగకు ఊరికి రావొద్దని ముంబైలో ఉంటున్న తమవారికి గ్రామాల్లో ఉన్న బంధువులు ఫోన్లు చేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనూ హోలి పండుగపై అధికారులు ఆంక్షలు విధించడంతో రావొద్దని కోరుతున్నారు.ఏటా ఎంతో ఘనంగా, ఆర్భాటంగా నిర్వహించే హోలి పండుగా ఈ సారి కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహించాలని అనేక గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేగాకుండా కలెక్టర్లు హోలి పండుగపై కొన్ని మార్గదర్శక సూచనలు జారీ చేశారు. అందులో పట్టణాల్లో ఉంటున్న తమ బంధువులను, పిల్లలను, ఇతర కుటుంబ సభ్యులను స్వగ్రామాలకు రావొద్దని చెప్పాలని పేర్కొన్నారు. అంతేగాకుండా పల్లెటూర్లలో జరుగుతున్న హోలి పండుగ కార్యక్రమాన్ని ఆన్లైన్లో, కేబుల్ నెట్వర్క్ లేదా వెబ్సైట్ తదితర మాధ్యమాల ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. ఒకవేళ బంధువులు వేడుకలకు రావాలనుకుంటే కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చేతపట్టుకుని రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) రత్నగిరిలో వైభవంగా.. ఏటా స్వగ్రామంలో జరిగే హోలి పండుగకు హాజరయ్యేందుకు ముంబై, పుణే నుంచి పెద్ద సంఖ్యలో రత్నగిరి, సింధుదుర్గ్ తదితర జిల్లాలకు బయలుదేరుతారు. ఈ ఏడాది హోలి పండుగ ఈ నెల 29వ తేదీన ఉంది. దీంతో 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29 సోమవారం హోలి ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కూలీలు, ఇతర రంగాల కార్మికులు స్వగ్రామాలకు బయలు దేరేందుకు ఇప్పటి నుంచి సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. కానీ, రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని హోలి పండుగకు స్వగ్రామాలకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ హోలి పండుగ జరుపుకోవడం లేదని, మీరు రావద్దని ఫోన్లో చెబుతున్నారు. దీంతో ఏటా సొంత ఊళ్లలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవల్సిన హోలీ పండుగను ఈ సారి ముంబైలోనే ఒంటరిగా లేదా మిత్రుల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు వాపోతున్నారు. ఒకవేళ ఊరు వెళ్లాల్సి వస్తే కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని చెప్పడంతో అయోమయంలో పడిపోయారు. చదవండి: (సెకండ్ వేవ్ భయం.. లాక్డౌన్ దిశగా కర్ణాటక!?) -
కాసులు కురిపిస్తున్న క్యాప్సికం
కరువు నేలలో బంగారం పండిస్తున్న రైతు ఎకరా ఫాలిహౌస్లో రెడ్, ఎల్లో క్యాప్సికం ప్రతివారం రెండు టన్నుల దిగుబడి అనంత రైతుకు ఆదర్శంగా నిలుస్తోన్న లోకేష్ కరువుకు చిరునామాగా మారిన జిల్లా... వేలమీటర్లు తవ్వినా నీటిచెమ్మ కనిపించని పరిస్థితి. అయినా రైతులంతా చెనక్కాయలే వేయడం...తీవ్రంగా నష్టపోతూ అప్పుల పాలవడం..ఏటా ఇదే దుస్థితి. అందుకే ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. సంప్రదాయ పంటలను పక్కనపెట్టి వాణిజ్య పంటలవైపు దృష్టి సారించాడు. కేవలం ఎకరాలో పొలంలోనే క్యాప్సికం పండిస్తూ సిరులు కురిపిస్తున్నాడు. రత్నగిరి(రొళ్ల): మారుతున్న కాలానికి అనుగుణంగా ‘అనంత’ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వాణిజ్య పంటసాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ ఇతర రాష్ట్రాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు రొళ్ల మండలం రత్నగిరికి చెందిన రైతు లోకేష్. అందరిలాగే సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాలు చవిచూసిన లోకేష్...ఈసారి మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఆధునిక పద్ధతులతో క్యాప్సికం సాగు చేశాడు. వారానికి రూ.2 లక్షల చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాడు. బెంగళూరు నుంచి నారు సరఫరా క్యాప్సికం గురంచి బాగా అధ్యయనం చేసిన లోకేష్ ముందుగా రూ. 42 లక్షలు ఖర్చు చేసి ఎకరా స్థలంలో పాలీహౌస్ నిర్మించాడు. ఇందుకు ఉద్యానశాఖ రూ.16 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఆ తర్వాత బెంగళూరులోని ఏకలవ్య నర్సరీల్లో ఒకటిన్నర నెలల లేత నారు తీసుకువచ్చాడు. ఇందులో రెడ్ క్యాప్సికం కోసం రూ.6 వేలు, ఎల్లో క్యాప్సికం కోసం రూ.5 వేలు ఖర్చు చేశాడు. అర మీటర్ విస్తీర్ణంలో ఫాలిహౌస్లో సాగు చేపట్టాడు. నీటిని ఆదా చేసుకునేందుకు డ్రిప్పు పద్ధతికి శ్రీకారం చుట్టాడు. 9 నెలల వరకూ దిగుబడి క్యాప్సికం సాగు చేసిన 70 రోజుల నుంచి ప్రారంభమై 9 నెలల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే ఒకటిన్నర సంవత్సరం వరకు దిగుబడి వస్తుందని రైతు లోకేష్ చెబుతున్నాడు. దిగుబడి ప్రారంభమైన తర్వాత 10 రోజుల ఒకసారి కాయలను కోయల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు ప్రతి కోతకు రెండు టన్నుల వరకు దిగుబడి వస్తోందని వెళ్లడించారు. మార్కెట్లో మంచి రేటు ప్రస్తుతం మార్కెట్లో కిలో క్యాప్సికం రూ.30 నుంచి రూ.35 వరకు ధర పలుకుతోందనీ, ప్రస్తుతానికి తాను రూ.2 లక్షల వరకు ఆదాయం పొందానని లోకేష్ తెలిపారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, బెంగళూరు, కోలారు, తుమకూరు మార్కెట్లకు క్యాప్సికంను తరలిస్తున్నానని వెళ్లడించాడు. ‘ఖోఖో’సాగులోనూ లాభాలే తాను క్యాప్సిక్సంతో పాటు వక్కతోటలో అంతర పంటగా 2.5 ఎకరాల్లో ఖోఖో పంటను కూడా సాగు చేశానని లోకేష్ తెలిపారు. ఖోఖో విత్తనాలను ప్రస్తుతం ఏలూరుకు తరలిస్తున్నాననీ, అక్కడ కిలో ఖోఖో విత్తనాలు రూ.150 నుంచి 200 వరకు ధర పలుకుతున్నాయని వెళ్లడించారు. క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ వారే నేరుగా ఖోఖో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారనీ, ఐదేళ్లుగా ఖోఖో పంట సాగులోనూ అధిక లాభాలు గడిస్తున్నానని లోకేష్ చెబుతున్నారు. వాణిజ్య పంటలపై మక్కువతోనే... ఏటా సంప్రదాయ పంటలు వేసి నష్టపోవడంతో వాణిజ్య పంటలు పండించాలనుకున్నాను. ఎకరా విస్తీర్ణంలో ఫాలీహౌస్ ఏర్పాటు చేసి రెడ్, ఎల్లో క్యాప్సికం పంటను సాగు చేశాను. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. ఇప్పటికే నాలుగు సార్లు కోత కోశాం. ప్రతి కోతకు రెండు టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం ఉంటే ఇంకా బాగుండేది. - లోకేష్, రైతు రత్నగిరి గ్రామం, రొళ్ల మండలం -
నేటి నుంచి ‘రత్నగిరి’ బ్రహ్మోత్సవాలు
రొళ్ల (మడకశిర) : రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్లాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారి కె.శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9న జలధి ఉత్సవం, కలశ స్థాపన, 10న బ్రహ్మ రథోత్సవం, 11న కలశ ఉత్సవం, గంగ పూజ, 12 నుంచి 15 వరకు భక్తులచే హారతి ఉత్సవాలు, 16న రాత్రి ఆర్డీటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, 17న పోతులరాజు బండార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉత్సవం సందర్భంగా రోజూ ఓ కార్యక్రమం చొప్పున నాటిక, హరికథలు ఉంటాయన్నారు. భక్తులకు మడకశిర ఆర్టీసీ డిపో నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం మధుగిరి, శిరా, పావగడ నుంచి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
మెగా వాటర్‌షెడ్‌లో రూ.79లక్షలు స్వాహా
మడకశిర : రొళ్ల మండలం రత్నగిరి మెగావాటర్‌షెడ్‌లో రూ.79లక్షల నిధులు స్వాహా అయినట్లు డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏపీడీ) విశ్వనాథ్ తెలిపారు. ఈ నిధులను స్వాహా చేసిన ఫోర్డు సంస్థ అధ్యక్షులు బద్రీష్‌తోపాటు సిబ్బంది లక్ష్మణమూర్తి, మహాలింగప్ప, నరసింహామూర్తి, బాలజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరింగిందని పేర్కొన్నారు. హార్టికల్చర్, ఫారంపాండ్ పనుల్లోనూ అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ప్రాథమిక దర్యాపులో రూ.79 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించామన్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నామని ఏపీడీ తెలిపారు.