ఢిల్లీ–నోయిడా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. మూడు కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ భాను(బీకేయూబీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
బీకేయూబీ అధ్యక్షుడు భాను ప్రతాప్‌సింగ్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. మూడు చట్టాల రాజ్యాంగబద్ధతను, చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి రవి, ఛత్తీస్‌గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేత రాకేశ్ వైష్ణవ్ తదితరులు గతంలో సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ భారతీయ కిసాన్ పార్టీ నవంబర్‌లో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లన్నింటిపై డిసెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
ఏకపక్షంగా ఆమోదించారు..
పార్లమెంట్‌లో పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించి, సాగు చట్టాలను తీసుకొచ్చిందని భాను ప్రతాప్‌సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రైతు సంఘాల వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సర్కారు నిర్ణయం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ముమ్మాటికీ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, రైతు వ్యతిరేకమని తెలిపారు. తిరుచ్చి రవి దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు కూడా ఇంప్లీడ్ కావాలని భాను ప్రతాప్‌సింగ్ అభ్యర్థించారు.
చర్చలకు సిద్ధం: ఏఐకేఎస్‌సీసీ
రైతుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) స్పష్టం చేసింది. చర్చల నుంచి రైతు సంఘాల నేతలు అర్ధాంతరంగా వెళ్లిపోయారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ, గాజీపూర్, పల్వాల్‌లోని ధర్నా ప్రాంతాలకు దేశవ్యాప్తంగా రైతులు తరలి వస్తున్నారని తెలి పింది. డిసెంబరు 15న ముంబైలో, 16న కోల్‌కతా లో నిరసనలు నిర్వహించనున్నట్లు ఏఐకేఎస్‌సీసీ తెలిపింది.
సంఘ వ్యతిరేక శక్తులతో జాగ్రత్త
సాగు చట్టాలపై పోరు సాగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. సంఘ వ్యతిరేక, వామపక్ష, మావోయిస్టు శక్తులు చొరబడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రమాదముందని పేర్కొంది. వేర్వేరు ఆరోపణల కింద అరెస్టయిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలంటూ టిక్రి వద్ద జరుగుతున్న నిరసనల్లో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడంపై వ్యవసాయ మంత్రి తోమర్ ఈ మేరకు అప్రమత్తం చేశారు.
14న పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ నిరసనలు
సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు మద్దతుగా 14వ తేదీన పంజాబ్‌లో రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపాయి. రైతుల డిమాండ్ల విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వారికి సంఘీభావంగా 14న ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా బైఠాయింపులు నిర్వహిస్తామని వెల్లడించారు.
11వ రోజుకు చేరిన ఆందోళనలు
కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ–నోయిడా సరిహద్దులో రైతులు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ను కలిపే ఈ సరిహద్దు వద్ద రైతుల నిరసనల కారణంగా అధికారులు వాహనాల రాకపోకలను పాక్షికంగా నిలిపివేశారు. ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు.
700 జిల్లాల్లో ప్రచారం.. 100 ప్రెస్‌మీట్లు..
వాస్తవాల వివరణకు బీజేపీ నిర్ణయం
న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలతో ఒనగూరే లాభాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టాలతో రైతన్నలకు లబ్ధి కలుగుతుందే తప్ప ఎలాంటి నష్టం ఉండబోదని తెలియజేయనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనుంది. త్వరలో 100 మీడియా సమావేశాలు, 700కు పైగా జిల్లాల్లో ప్రజలతో భేటీలు, ప్రచార కార్యక్రమాలు తలపెట్టింది. ఈ ప్రచార పర్వంలో కేంద్ర మంత్రులు సైతం పాల్గొంటారని, కొత్త చట్టాల గురించి ప్రజలకు సవివరంగా తెలియజేస్తారని, సందేహాలను నివృత్తి చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన ఉధృతం అవుతుండడం, ప్రతిపక్షాలు సైతం ఒక్కతాటిపైకి వస్తుండడంతో బీజేపీ అప్రమత్తమైంది. సాగు చట్టాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించి, వాస్తవాలను వివరించాలని నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే ఈ చట్టాల ప్రయోజనాలపై ప్రధాని సహా పార్టీ నేతలు పలుమార్లు ప్రజలకు వివరణలు ఇచ్చారు. సాగు చట్టాల విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment