Concern for farmers
-
సుప్రీం మెట్లెక్కిన రైతులు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. మూడు కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ భాను(బీకేయూబీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బీకేయూబీ అధ్యక్షుడు భాను ప్రతాప్‌సింగ్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. మూడు చట్టాల రాజ్యాంగబద్ధతను, చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి రవి, ఛత్తీస్‌గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేత రాకేశ్ వైష్ణవ్ తదితరులు గతంలో సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ భారతీయ కిసాన్ పార్టీ నవంబర్‌లో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లన్నింటిపై డిసెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ఏకపక్షంగా ఆమోదించారు.. పార్లమెంట్లో పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించి, సాగు చట్టాలను తీసుకొచ్చిందని భాను ప్రతాప్‌సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు సంఘాల వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సర్కారు నిర్ణయం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ముమ్మాటికీ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, రైతు వ్యతిరేకమని తెలిపారు. తిరుచ్చి రవి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు కూడా ఇంప్లీడ్ కావాలని భాను ప్రతాప్‌సింగ్ అభ్యర్థించారు. చర్చలకు సిద్ధం: ఏఐకేఎస్‌సీసీ రైతుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) స్పష్టం చేసింది. చర్చల నుంచి రైతు సంఘాల నేతలు అర్ధాంతరంగా వెళ్లిపోయారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ, గాజీపూర్, పల్వాల్‌లోని ధర్నా ప్రాంతాలకు దేశవ్యాప్తంగా రైతులు తరలి వస్తున్నారని తెలి పింది. డిసెంబరు 15న ముంబైలో, 16న కోల్‌కతా లో నిరసనలు నిర్వహించనున్నట్లు ఏఐకేఎస్‌సీసీ తెలిపింది. సంఘ వ్యతిరేక శక్తులతో జాగ్రత్త సాగు చట్టాలపై పోరు సాగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. సంఘ వ్యతిరేక, వామపక్ష, మావోయిస్టు శక్తులు చొరబడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రమాదముందని పేర్కొంది. వేర్వేరు ఆరోపణల కింద అరెస్టయిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలంటూ టిక్రి వద్ద జరుగుతున్న నిరసనల్లో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడంపై వ్యవసాయ మంత్రి తోమర్ ఈ మేరకు అప్రమత్తం చేశారు. 14న పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ నిరసనలు సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు మద్దతుగా 14వ తేదీన పంజాబ్‌లో రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపాయి. రైతుల డిమాండ్ల విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వారికి సంఘీభావంగా 14న ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా బైఠాయింపులు నిర్వహిస్తామని వెల్లడించారు. 11వ రోజుకు చేరిన ఆందోళనలు కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ–నోయిడా సరిహద్దులో రైతులు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ను కలిపే ఈ సరిహద్దు వద్ద రైతుల నిరసనల కారణంగా అధికారులు వాహనాల రాకపోకలను పాక్షికంగా నిలిపివేశారు. ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. 700 జిల్లాల్లో ప్రచారం.. 100 ప్రెస్మీట్లు.. వాస్తవాల వివరణకు బీజేపీ నిర్ణయం న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలతో ఒనగూరే లాభాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టాలతో రైతన్నలకు లబ్ధి కలుగుతుందే తప్ప ఎలాంటి నష్టం ఉండబోదని తెలియజేయనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనుంది. త్వరలో 100 మీడియా సమావేశాలు, 700కు పైగా జిల్లాల్లో ప్రజలతో భేటీలు, ప్రచార కార్యక్రమాలు తలపెట్టింది. ఈ ప్రచార పర్వంలో కేంద్ర మంత్రులు సైతం పాల్గొంటారని, కొత్త చట్టాల గురించి ప్రజలకు సవివరంగా తెలియజేస్తారని, సందేహాలను నివృత్తి చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన ఉధృతం అవుతుండడం, ప్రతిపక్షాలు సైతం ఒక్కతాటిపైకి వస్తుండడంతో బీజేపీ అప్రమత్తమైంది. సాగు చట్టాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించి, వాస్తవాలను వివరించాలని నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే ఈ చట్టాల ప్రయోజనాలపై ప్రధాని సహా పార్టీ నేతలు పలుమార్లు ప్రజలకు వివరణలు ఇచ్చారు. సాగు చట్టాల విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. -
భూగర్భజల పతనం
అన్నదాతకు ప్రకంపనం జిల్లావ్యాప్తంగా అడుగంటిన నీటిమట్టం సాగుకు సమస్యలు తప్పవని రైతుల ఆందోళన లంకలను చుట్టుముట్టుతున్న ఉప్పునీరు ఆ ప్రభావంతో పంటలు దెబ్బతినే ముప్పు అమలాపురం : జీవనది గోదావరి నదీపాయల మధ్య ఉండే లంకల్లో ఒకప్పుడు 25 నుంచి 30 అడుగుల లోతు తవ్వితే జలధార తన్నుకు వచ్చేది. ఇప్పుడు ఇంకో అరుుదడుగుల లోతుకు వెళుతున్నా నాలుగంగుళాల నీరు కూడా రాని దుస్థితి. దీంతో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. లంకల్లో పరిస్థితే ఇలా ఉందంటే మిగిలిన ప్రాంతాల్లో రైతుల పాట్లు ఇంకెన్నో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జిల్లాలో సగటు కన్నా 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు అంతకు ముందుకన్నా డెల్టాలో సగటున నాలుగు అడుగులు, మెట్ట, ఏజెన్సీల్లో పది అడుగుల పైగా కిందకు పోయూయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మోటార్ల ద్వారా వచ్చే జలధార బక్కచిక్కిపోతోంది. డెల్టాలో మెరక ప్రాంతాల రైతులు వరి, కొబ్బరి, ఇతర వాణిజ్య పంటలకు, కూరగాయ పంటలకు, లంక గ్రామాల రైతులు కూరగాయలు, ఉద్యాన పంటలకు ఆయిల్ ఇంజన్లు, విద్యుత్ మోటార్లతో పుష్కలంగా నీరు పెట్టేవారు. ఇప్పుడు జలాలు అడుగంటడంతో మోటార్ల ద్వారా మూడు, నాలుగు అంగుళాల మించి నీరు రావడం లేదు. దీనితో రైతులు గంటల తరబడి చేలకు, తోటలకు నీరందించాల్సి వస్తోంది. గతంలో ఎకరా మొక్కజొన్న, టమాటా, వంగ తోటలకు పూర్తిస్థాయిలో నీరు పెట్టేందుకు రెండుమూడు గంటలు సరిపోయేది. ఇప్పుడు కనీసం ఐదారు గంటలైనా ఏకబిగిన నీరందించాల్సి వస్తోంది. సాధారణంగా లంక గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల వీరికి ఉచిత విద్యుత్ సౌకర్యం అందదు. ఇక్కడ 70 శాతం డీజిల్ ఇంజన్లే. దీనితో పెట్టుబడి పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. డెల్టాలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి. ఎండలు ముదరడంతో వరి చేలకే కాక కొబ్బరి, అరటిలో సాగయ్యే అంతర పంటలకు తరచూ తడులు ఇవ్వాల్సి రావడం, ఏడుగంటలకు మించి విద్యుత్ అందకపోవడం, అది కూడా ఒకేసారి ఇవ్వకపోవడం వల్ల తరచూ తడులు అందించాల్సి వస్తోంది. మెట్ట పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికే ఎండలు ముదురుతుండగా, ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. ఎండలకు తోడు భూగర్భజలాలు కూడా లేకపోతే పంటలకు ముప్పేనని ఆందోళన చెందుతున్నారు. నిరుడే లంకల్లో పంటలకు ఉప్పుముప్పు మిగిలిన ప్రాంతాలతో పోల్చితే భూగర్భ జలాలు తగ్గడం లంక రైతులకు ముందుముందు పెను ముప్పుగా మారనుంది. నవంబరు నుంచి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీరు విడుదల కానందున సముద్రపు ఉప్పునీరు గోదావరి పాయలమీదుగా ఎగదన్నుకు వస్తుంది. ఈ ప్రభావం జిల్లాలో ఐ.పోలవరం, తాళ్లరేవు, కె.గంగవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, అంబాజీపేట, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, పి.గన్నవరం మండలాల్లో నదీపాయల మధ్య ఉన్న లంక భూములపై పడుతుంది. ఈ మండలాల్లోని లంక గ్రామాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో కొబ్బరి, అరటి, మొక్కజొన్నతోపాటు వివిధ కూరగాయ పంటలు సాగవుతుంటాయి. సాధారణ సమయంలో కన్నా అమావాస్య సమయంలో నీరు ఎగదన్నుకు రావడం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల లంక గ్రామాల చుట్టూ ఉండే నది పాయల్లో ఉప్పునీరు నిలిచిపోతుంది. భూగర్భ జలాలు బాగా ఇంకిన సమయంలో చుట్టూ ఉప్పునీరు పోటెత్తితే మోటార్ల ద్వారా అందే నీటిలో కూడా ఉప్పుశాతం పెరిగి పంటలు దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు. భూగర్భజలాలు ఇంతగా అడుగంటకపోరుునా నిరుడు మేలో నీరందించే అవకాశం లేక అంబాజీపేట, అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో రైతులు విలువైన పంటలు కోల్పోయారు. ఈ ఏడాది నష్టం ఇంకా పెరిగే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు. -
ఎదురుచూపులు
రెండో విడత రుణమాఫీ ఎప్పుడో తెలియక అవస్థలు పలుమార్లు వారుుదాపడి 31తో ముగియనున్న గడువు 1.40 లక్షలకు పైగా ఖాతాలు అప్లోడ్ చేయనున్న అధికారులు ఇందులో తిరస్కరణ అయితే పరిస్థితి ఏమిటని రైతుల ఆందోళన కడప : అధికారంలోకి రావడమే తరువాయి... తొలి సంతకంతోనే రుణమాఫీ అంటూ ‘దేశం’ నేతలు ఊదరగొట్టినా తీరా అమలుమాత్రం అంతంతే. మొదటి విడతలో రూ. 50 వేలలోపు ఉన్న రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నా అది ఉత్తుత్తిదే అని తేలిపోరుుంది. ఇక లక్ష రూపాయలు, ఆపైన రుణం తీసుకున్న వారికి తొలి విడతలో రూ. 20 వేలు వేస్తున్నట్లు పేర్కొన్నా అది కూడా అందరికి దక్కలేదని పలువురు రైతులు వాపోతున్నారు. మరికొంతమంది రైతులకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది. ఆధార్‌కార్డు సరిగా లేదనో... రేషన్‌కార్డులో తప్పులు ఉన్నాయనో... కుటుంబ వివరాలు లేవనో... ఏదో ఒకసాకు చూపి తిరస్కరించడంతో నిస్సహాయ స్థితిలో రైతన్నలు కొట్టుమిట్లాడుతున్నారు. రెండవ విడతకు సంబంధించి ప్రభుత్వం గడువుమీద గడువు పెంచుతూ పోతూ ఎట్టకేలకు 31తో ముగిస్తోంది. తొలి విడతలో 2,78,078 మందికి వర్తింపు తెలుగుదేశం సర్కార్ రుణమాఫీ పేరుతో ఎంతో కొంత రైతుల ఖాతాల్లో జమచేసి మాఫీని మమ అనిపించారు. మొదటి విడతకు సంబంధించి 2,78,078 మందిలో చాలామందికి అంతంత మాత్రంగానే జమ అరుుంది. పూర్తి స్థాయి మాఫీ కొందరికి మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 4,95,008 రైతులకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వానికి రుణమాఫీ అర్హుల జాబితాగా అప్లోడ్ చేసినా అందులో 2,78,070 మందికే వర్తించడం వెనుక మతలబు అర్థం కావడంలేదు. పైగా ఏదో ఒక సాకుచూపి ఎంత వీలైతే అంత మాఫీని తగ్గించడమే పరమావధిగా ప్రభుత్వం ముందకు వెళుతోందని విమర్శలు వ్యక్తం అవుతున్నారుు. 2,78,070 మంది రైతులకు సంబంధించి సుమారు రూ. 315.82 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికి కొన్ని బ్యాంకులు ఇచ్చినా చాలా మండలాల్లో రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఇచ్చిన సొమ్మంతా వడ్డీకే రుణమాఫీ కింద ప్రభుత్వం అందజేస్తున్న సొమ్మంతా వడ్డీకే సరిపోతోంది. ఉదాహరణకు లక్ష రూపాయలు లోను ఉన్న రైతుకు ప్రస్తుతం రెన్యూవల్ చేయడానికి దాదాపు రూ.17 వేలు వడ్డీ అవుతుంది. ప్రభుత్వం మాత్రం రూ. 20 వేలు ఖాతాలో రుణమాఫీ కింద జమచేస్తే మిగిలేది రూ.3 వేలు మాత్రమే. ఇలా ప్రతి రైతుకు రుణమాఫీలో వచ్చిన మొత్తం రెన్యూవల్ చేస్తే వడ్డీకే సరిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. పైగా రుణమాఫీ వర్తించిన రైతులను బ్యాంకు అధికారులు పదేపదే పిలుస్తూ రెన్యూవల్ చేసుకోవాలని కోరుతున్నారు. రెన్యూవల్ చేయడం ద్వారా మాఫీసొమ్మును వడ్డీకి జమ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో బ్యాంకు లావాదేవీలు చాలావరకు పడిపోయిన నేపధ్యంలో రెన్యూవల్ ద్వారా మళ్లీ బ్యాంకుల్లో సేవలు ఊపందుకునేలా జాగ్రత్త పడుతున్నారు. రెండవ విడత ముగింపునకు సిద్ధమవుతున్న అధికారులు మొదటి విడత పూర్తయింది... రెండవ విడత జనవరి 8వ తేదీలోపు ప్రభుత్వానికి రైతుల జాబితా వస్తుందని పేర్కొన్నా... రానురాను గడువు పెరిగిపోతోంది. తొలుత 8వతేదీ అనుకున్నా తర్వాత 14, 23, ప్రస్తుతం ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రెండవ విడతలో ఇప్పటికే సుమారు 1,09,682 రైతుల ఖాతాలను అప్లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మొదటి విడతలో ఆధార్, రేషన్‌కార్డుల్లో తేడా నేపధ్యంలో తిరస్కరణకు గురైన ఖాతాలను కూడా మండల లెవెల్ కమిటీ పరిశీలించి సుమారు 33 వేలు రైతుల ఖాతాలను అప్లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ కూడా రెండవ విడత లిస్టులో ప్రభుత్వానికి వెళ్లనున్నారుు. అక్కడ ఎన్నిటికి కోత పడుతుందో ఎంతమంది అర్హులవుతారోనని ఎదురుచూస్తున్నారు. -
రైతుల రుణ మాఫీపై 20 నుంచి ఆందోళన
ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వెల్లడి {పభుత్వ పనుల స్తంభన - మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక ముంబై: కరువు కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ప్రకటించారు. రైతుల రుణాను మాఫీ చేయడంతోపాటు హెక్టారుకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నామని చెప్పారు. ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పనులు స్తంభింపజేయడంతోపాటు ఒక్క మంత్రిని కూడా పర్యటించకుండా అడ్డుకుంటామని ఠాక్రే హెచ్చరించారు. మరాఠ్వాడ ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సమీక్షించేందుకు స్థానిక పదాధికారులతో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. మాణిక్‌రావ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మాజీ మంత్రులు అబ్దుల్ సత్తార్, సిరాజ్ షేఖ్, ఓంప్రకాశ్ పోకర్ణ, ఎమ్మెల్యేలు బసవరాజ్ పాటిల్, అమర్ రాజుర్కర్, మాజీ ఎమ్మెల్యేలు సురేశ్‌కుమార్ జెతలియా, కైలాస్ గోరంట్యాల్, మాధవ్‌రావ్ పాటిల్, మాజీ ఎంపీ తుకారాం రేంగే పాటిల్, కాదీర్ మౌలానా, జిల్లాధ్యక్షుడు కేశవ్‌రావ్ ఔతాడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్‌రావ్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1972లో వచ్చిన కరువు కంటే ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారని చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్రంలో కరువు ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వానికి తెలుసునని, కానీ బాధితులను మాత్రం ఆదుకోలేకపోతోందని మాణిక్‌రావ్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం రాదని, వారు కనీసం 50 శాతం లాభపడే పథకాలను ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ యావత్మాల్లో జరిగిన సభలో ఉద్ఘాటించారని గుర్తు చేశారు. కాని మోదీ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసి రైతులకు కనీస ధర రాకుండా చేసిందని ఆరోపించారు. దీంతో రైతులు రెండు విధాలుగా ఇబ్బందుల్లో పడిపోయారని అన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఎక్కడ ప్రారంభం కాలేదపి, రైతులకు ఆర్థిక సాయం చేయాలంటే కేంద్రంపై వేలెత్తి చూపుతున్నారని అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో మరాఠ్వాడలో 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. జాయ్క్వాడీ జలాశయంలోకి నీరు విడుదల చేయాలని వాటర్ అథారిటీ అనుమతి ఇచ్చిందని, అయినా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరాఠ్వాడ ప్రాంత ప్రజలు సంయమనం కోల్పోతే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని చవాన్ హెచ్చరించారు.