రైతుల రుణ మాఫీపై 20 నుంచి ఆందోళన
ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వెల్లడి
{పభుత్వ పనుల స్తంభన - మంత్రుల
పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక
ముంబై: కరువు కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ప్రకటించారు. రైతుల రుణాను మాఫీ చేయడంతోపాటు హెక్టారుకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నామని చెప్పారు. ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పనులు స్తంభింపజేయడంతోపాటు ఒక్క మంత్రిని కూడా పర్యటించకుండా అడ్డుకుంటామని ఠాక్రే హెచ్చరించారు. మరాఠ్వాడ ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సమీక్షించేందుకు స్థానిక పదాధికారులతో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. మాణిక్‌రావ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మాజీ మంత్రులు అబ్దుల్ సత్తార్, సిరాజ్ షేఖ్, ఓంప్రకాశ్ పోకర్ణ, ఎమ్మెల్యేలు బసవరాజ్ పాటిల్, అమర్ రాజుర్కర్, మాజీ ఎమ్మెల్యేలు సురేశ్‌కుమార్ జెతలియా, కైలాస్ గోరంట్యాల్, మాధవ్‌రావ్ పాటిల్, మాజీ ఎంపీ తుకారాం రేంగే పాటిల్, కాదీర్ మౌలానా, జిల్లాధ్యక్షుడు కేశవ్‌రావ్ ఔతాడే తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాణిక్‌రావ్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1972లో వచ్చిన కరువు కంటే ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారని చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్రంలో కరువు ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వానికి తెలుసునని, కానీ బాధితులను మాత్రం ఆదుకోలేకపోతోందని మాణిక్‌రావ్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం రాదని, వారు కనీసం 50 శాతం లాభపడే పథకాలను ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ యావత్మాల్‌లో జరిగిన సభలో ఉద్ఘాటించారని గుర్తు చేశారు. కాని మోదీ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసి రైతులకు కనీస ధర రాకుండా చేసిందని ఆరోపించారు. దీంతో రైతులు రెండు విధాలుగా ఇబ్బందుల్లో పడిపోయారని అన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఎక్కడ ప్రారంభం కాలేదపి, రైతులకు ఆర్థిక సాయం చేయాలంటే కేంద్రంపై వేలెత్తి చూపుతున్నారని అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో మరాఠ్వాడలో 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. జాయ్‌క్వాడీ జలాశయంలోకి నీరు విడుదల చేయాలని వాటర్ అథారిటీ అనుమతి ఇచ్చిందని, అయినా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరాఠ్వాడ ప్రాంత ప్రజలు సంయమనం కోల్పోతే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని చవాన్ హెచ్చరించారు.