భూగర్భజల పతనం
అన్నదాతకు ప్రకంపనం
జిల్లావ్యాప్తంగా అడుగంటిన నీటిమట్టం
సాగుకు సమస్యలు తప్పవని రైతుల ఆందోళన
లంకలను చుట్టుముట్టుతున్న ఉప్పునీరు
ఆ ప్రభావంతో పంటలు దెబ్బతినే ముప్పు
అమలాపురం : జీవనది గోదావరి నదీపాయల మధ్య ఉండే లంకల్లో ఒకప్పుడు 25 నుంచి 30 అడుగుల లోతు తవ్వితే జలధార తన్నుకు వచ్చేది. ఇప్పుడు ఇంకో అరుుదడుగుల లోతుకు వెళుతున్నా నాలుగంగుళాల నీరు కూడా రాని దుస్థితి. దీంతో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. లంకల్లో పరిస్థితే ఇలా ఉందంటే మిగిలిన ప్రాంతాల్లో రైతుల పాట్లు ఇంకెన్నో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జిల్లాలో సగటు కన్నా 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు అంతకు ముందుకన్నా డెల్టాలో సగటున నాలుగు అడుగులు, మెట్ట, ఏజెన్సీల్లో పది అడుగుల పైగా కిందకు పోయూయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మోటార్ల ద్వారా వచ్చే జలధార బక్కచిక్కిపోతోంది. డెల్టాలో మెరక ప్రాంతాల రైతులు వరి, కొబ్బరి, ఇతర వాణిజ్య పంటలకు, కూరగాయ పంటలకు, లంక గ్రామాల రైతులు కూరగాయలు, ఉద్యాన పంటలకు ఆయిల్ ఇంజన్లు, విద్యుత్ మోటార్లతో పుష్కలంగా నీరు పెట్టేవారు. ఇప్పుడు జలాలు అడుగంటడంతో మోటార్ల ద్వారా మూడు, నాలుగు అంగుళాల మించి నీరు రావడం లేదు. దీనితో రైతులు గంటల తరబడి చేలకు, తోటలకు నీరందించాల్సి వస్తోంది. గతంలో ఎకరా మొక్కజొన్న, టమాటా, వంగ తోటలకు పూర్తిస్థాయిలో నీరు పెట్టేందుకు రెండుమూడు గంటలు సరిపోయేది. ఇప్పుడు కనీసం ఐదారు గంటలైనా ఏకబిగిన నీరందించాల్సి వస్తోంది. సాధారణంగా లంక గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల వీరికి ఉచిత విద్యుత్ సౌకర్యం అందదు. ఇక్కడ 70 శాతం డీజిల్ ఇంజన్లే. దీనితో పెట్టుబడి పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. డెల్టాలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి. ఎండలు ముదరడంతో వరి చేలకే కాక కొబ్బరి, అరటిలో సాగయ్యే అంతర పంటలకు తరచూ తడులు ఇవ్వాల్సి రావడం, ఏడుగంటలకు మించి విద్యుత్ అందకపోవడం, అది కూడా ఒకేసారి ఇవ్వకపోవడం వల్ల తరచూ తడులు అందించాల్సి వస్తోంది. మెట్ట పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికే ఎండలు ముదురుతుండగా, ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. ఎండలకు తోడు భూగర్భజలాలు కూడా లేకపోతే పంటలకు ముప్పేనని ఆందోళన చెందుతున్నారు.
నిరుడే లంకల్లో పంటలకు ఉప్పుముప్పు
మిగిలిన ప్రాంతాలతో పోల్చితే భూగర్భ జలాలు తగ్గడం లంక రైతులకు ముందుముందు పెను ముప్పుగా మారనుంది. నవంబరు నుంచి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీరు విడుదల కానందున సముద్రపు ఉప్పునీరు గోదావరి పాయలమీదుగా ఎగదన్నుకు వస్తుంది. ఈ ప్రభావం జిల్లాలో ఐ.పోలవరం, తాళ్లరేవు, కె.గంగవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, అంబాజీపేట, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, పి.గన్నవరం మండలాల్లో నదీపాయల మధ్య ఉన్న లంక భూములపై పడుతుంది. ఈ మండలాల్లోని లంక గ్రామాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో కొబ్బరి, అరటి, మొక్కజొన్నతోపాటు వివిధ కూరగాయ పంటలు సాగవుతుంటాయి. సాధారణ సమయంలో కన్నా అమావాస్య సమయంలో నీరు ఎగదన్నుకు రావడం ఎక్కువగా ఉంటుంది.
దీని వల్ల లంక గ్రామాల చుట్టూ ఉండే నది పాయల్లో ఉప్పునీరు నిలిచిపోతుంది. భూగర్భ జలాలు బాగా ఇంకిన సమయంలో చుట్టూ ఉప్పునీరు పోటెత్తితే మోటార్ల ద్వారా అందే నీటిలో కూడా ఉప్పుశాతం పెరిగి పంటలు దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు. భూగర్భజలాలు ఇంతగా అడుగంటకపోరుునా నిరుడు మేలో నీరందించే అవకాశం లేక అంబాజీపేట, అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో రైతులు విలువైన పంటలు కోల్పోయారు. ఈ ఏడాది నష్టం ఇంకా పెరిగే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు.