సాక్షి, అమరావతి: తుంగభద్ర నదిలో ఈ ఏడాఇ నీటిలభ్యత బాగా పెరిగినప్పటికీ రాయలసీమలో హెచ్చెల్సీ(ఎగువ కాలువ), దిగువ కాలువ(ఎల్లెల్సీ), కేసీ(కర్నూలు–కడప) కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో తుంగభద్ర నదిపై ఆధారపడిన 6.44 లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 40 శాతానికి కూడా నీళ్లందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు కూడా వరి పంటకు కాదు కదా.. కనీసం ఆరుతడి పంటలకూ నీళ్లివ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. తుంగభద్ర నదిలో ఈ ఏడాది నీటి లభ్యత పెరిగింది.
ఇప్పటివరకు తుంగభద్ర జలాశయంలోకి 351.69 టీఎంసీలు రాగా దిగువకు 180 టీఎంసీలను విడుదల చేశారు. ఇందులో సుంకేసుల బ్యారేజీలోకి 173 టీఎంసీలు చేరాయి. దీనిలో 166 టీఎంసీలను దిగువకు.. అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ హెచ్చెల్సీకి 32.50, ఎల్లెల్సీకి 24, కేసీ కెనాల్‌కు పది, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం)కు 6.51 టీఎంసీలు చొప్పున కేటాయించింది. కేసీ కెనాల్‌కు బచావత్ ట్రిబ్యునల్ 39.90 టీఎంసీలను కేటాయించింది(ఇందులో 29.9 టీఎంసీలు సుంకేశుల బ్యారేజీ వద్ద లభిస్తాయని, మిగతా 10 టీఎంసీలను తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది).
అంటే, ఆర్డీఎస్ కింద తెలంగాణ వాటా పోనూ తుంగభద్ర జలాల్లో కనీసం వంద టీఎంసీలు రాయలసీమకు దక్కాలి. కానీ ఇప్పటివరకూ కేసీ కెనాల్‌కు పది, ఎల్లెల్సీకి ఆరు, హెచ్చెల్సీకి 11 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. కేసీ కెనాల్ కింద సాగు చేసిన పంటలు చేతికి అందాలంటే ఇంకా 24 టీఎంసీలు అవసరం. హెచ్చెల్సీ, ఎల్లెల్సీల ఆయకట్టుకు సక్రమంగా నీటిని విడుదల చేయకపోవడం వల్ల 25 శాతం ఆయకట్టులో కూడా పంటలు సాగుచేయలేని దుస్థితి నెలకొంది.
కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గం పరిధిలో పదివేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. హెచ్చెల్సీ ఆయకట్టులోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 84.96 టీఎంసీలుగా ఉంది. ఈ నీటిలో సింహభాగం రాష్ట్రానికే దక్కాలి. కానీ ఆ మేరకు తుంగభద్ర బోర్డుపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. కర్ణాటక జలచౌర్యాన్ని అడ్డుకోవడంలోనూ చేతులు ఎత్తేసింది. పర్యవసానంగానే ఆయకట్టుకు నీళ్లందట్లేదని రైతులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment