చిగురిస్తున్న ఆశలు
- టీబీ డ్యామ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న నీటిమట్టం
- ఆరుతడి పంటలపై రైతుల ఆశలు
హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్, డి.హీరేహళ్, విడపనకల్లు మండలాల్లో 36వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం వీరికి తెలియదు. ఖరీఫ్ ఆరంభంలో టీబీ డ్యామ్‌లో నీటి మట్టం అధ్వానంగా ఉండేది. అప్పటి పరిస్థితిని బట్టి సాగుకు నీరివ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగి... నీటి నిల్వలు పెరిగితే ఆలోచిద్దామన్నారు. ప్రస్తుతం తాజాగా టీబీ డ్యామ్ ఇన్‌ఫ్లో 5,756వేల క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 72.410 టీఎంసీలకు చేరుకుంది. గత వారంలో డ్యామ్‌కు వరద భారీగా చేరింది. ఈ క్రమంలో ఆయకట్టు రైతుల్లో ఆశలు రోజురోజుకూ చిగురిస్తున్నాయి.
29 వేల ఎకరాల్లో తడి భూమి
వరికెలాగూ సాగునీరివ్వలేమని గతంలె అధికారులు చెప్పడంతో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో 90శాతం మంది రైతులు వరిసాగు చేయలేదు. బోర్లున్న రైతులు మాత్రం అడపాదడపా వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీటి నిల్వ పెరుగుతుండటంతో ఆరుతడి పంటల సాగుకైనా నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌ఎల్‌యంసీ పరిధిలోని 36వేల ఎకరాల ఆయకట్టులో 29వేల ఎకరాలు తడి భూమి, 7వేల ఎకరాల ఆరుతడి భూమి ఉంది. ఈ భూమిలో వరి పంటల సాగుకోసం 2.5 టీఎంసీల నీరు అవసరముండేది. ప్రతి ఏటా హెచ్‌ఎల్‌ఎంసీకి 2.5 టీఎంసీ నీటిని కేటాయించేవారు. ఈ నీళ్లతో సరిపెట్టుకుంటూ రైతులు వరి సాగు చేసేవారు. ఆరుతడి పంటలకైతే అంత నీళ్లు కూడా అవసరం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఒకటి నుంచి ఒకటిన్నర టీఎంసీల నీరున్నా చాలంటున్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆయకట్టుకు నీరిస్తే ఆ నీళ్లతోనే ఆరుతడి పంటలు పండించుకుంటామంటున్నారు.
స్పందించని మంత్రి కాలవ
టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత ప్రకారం హెచ్చెల్సీకి 13 టీఎంసీల వరకు నీరొచ్చే అవకాశముంది. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు పోను మరో 3 టీఎంసీలు కూడా వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ కింద ఆరుతడి సాగుకు నీరివ్వాలని రైతులు కోరుతున్నారు. ఆరుతడి పంటల సాగుకు ఇప్పుడే సరైన సమయమని.... డ్యామ్‌లో నీటి మట్టం ఆశాజనకంగా ఉన్నందున ఆయకట్టుకు సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు తమ బాధను చెప్పుకుంటున్న అధికారుల్లో మాత్రం స్పందన కన్పించడం లేదు. మంత్రి కాలవ శ్రీనివాసులు సైతం నోరు విప్పడం లేదు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆరాటపడుతున్నా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది.