ఎండుతున్న ఆశలు!
ఎండుతున్న ఆశలు!
Published Sun, Feb 19 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
- ఎస్‌ఆర్‌బీసీలో నిలిచిన నీరు
- ఆందోళనలో రైతులు
- స్పందించని అధికారులు
బనగానపల్లె : ఆయకట్టు రైతుల ఆశలు నీరుగారాయి. మార్చి వరకు నీరు వస్తుందని ఎస్‌ఆర్‌బీసీ(శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్) కింద రబీ సీజన్‌లో పంటలు సాగు చేసిన అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పది రోజుల క్రితం నీటి విడుదల నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే దిగుబడులు లభించబోవని.. అప్పులే మిగులుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సార్బీసీ కింద కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలలో 1.92లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో మార్చి చివరి వరకు ఆయకట్టుకు నీరు వస్తుందని భావించి రబీలో సుమారుగా 6 వేల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. మరో 4వేల హెక్టార్లలో ఆరుతడి పంటలైన ఆముదం, మొక్కజొన్న, నువ్వులు, ఆవాలు.. ఇతర పంటలు సాగు చేశారు. సంబంధిత అధికారులు కూడా నీటివిడుదల మార్చి వరకు ఉంటుందని అనధికారికంగా పేర్కొనడంతో భరోసాతో ఉన్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి పేరున జనవరి నెలలో శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని నాగార్జున సాగర్‌కు విడుదలచేసి సీమ ప్రాంతానికి ప్రభుత్వం అన్యాయం చేసినట్లు ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఎస్‌ఆర్‌బీసీ ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పరోక్షంగా వ్యవసాయ బోర్ల ఆధారంగా సాగులో ఉన్న పంటలు కూడా ఎండిపోతున్నాయి.
ముందస్తు సమాచారంలేదు..
ముందస్తు సమాచారం లేకుండా పది రోజుల క్రితమే నీటిని ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువకు నిలిపివేశారు. నీటి విడుదల నిలిపివేసే సమాచారాన్ని జనవరి ప్రారంభంలోనే చెప్పి ఉంటే పంటలను సాగుచేసే వారం కాదని ప్రస్తుత పంట నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
నంద్యాల మండలంలో..
మండల పరిధిలోని పోలూరు, మునగాల, రాయమాల్పురం, పులిమద్ది, ఊడుమాల్పురం గ్రామ రైతులు.. ఎస్సార్బీసీ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు 2500 ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఒకతడి నీరు పొలానికి పారితే పంట పూర్తిగా చేతికి వస్తుంది. అయితే ఎస్‌ఆర్‌బీసీకి నీరు బంద్ కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరా నీరు పారించుకోవడానికి అద్దె పైపులు, ఆయిల్ ఇంజన్ల ఖర్చు రూ.2వేలు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement