ముంబై: రోజు మొత్తం ఒడిదుడుకుల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 28,060 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8650 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 28 వేలకు ఎగువన, నిఫ్టీ గట్టి మద్దుతు స్థాయి వద్ద స్థిరపడ్డాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో హెల్త్‌కేర్ సెక్టార్ దూకుడు మార్కెట్ ను ఆదుకొంది. ముఖ్యంగా అరబిందో ఫార్మా ప్ఫలితాల నేపథ్యంలో భారీగా లాభపడింది. సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమ్, హైకాల్, టొరంట్, ఇప్కా, ఇండొకో, గ్రాన్యూల్స్, వీనస్ రెమిడీస్, దివీస్, శిల్పా మెడి షేర్లు మెరుపులు మెరిపించాయి. టాటా పవర్, మారుతీ, సిప్లా, జీ 2.5-1.6 శాతం మధ్య లాభపడగా, ఐడియా, లుపిన్, అంబుజా, టాటా మోటార్స్ డీవీఆర్, టాటా స్టీల్ నష్టపోయాయి.
కాగా రేపు(25న) ఆగస్ట్ నెల డెరివేటివ్స్ ముయనుంది. అలాగే శుక్రవారం ఫెడ్ ఛైర్ పర్సన్ జానెట్ ఎల్లెన్ వార్షిక సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో ప్రసగించనున్నారు. ఈ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించనున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
అటు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. ఎంసీఎక్స్ లో 10 గ్రా. పుత్తడి రూ. 49 నష్టంతో 31,321 వద్ద ఉంది. రూపాయి కూడా 0.05 పైసల నష్టంతో 67.11 దగ్గర ఉంది.