ఆదివారం ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళనల్లో నినాదాలు చేస్తున్న రైతులు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్‌తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం.
మేం భారత్ బంద్‌కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్‌లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్‌లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్‌కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘ఎంఎన్‌ఎం’ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి.
ఎన్‌ఆర్‌ఐ కుటుంబాల మద్దతు
ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు.
విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్‌యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు.
లండన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్‌ఆర్‌ఐల నిరసన
Comments
Please login to add a commentAdd a comment