రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్ శ్యాంసుందర్, సీఐ జీవన్‌రెడ్డి
సారంగపూర్(నిర్మల్) : మండలకేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై భైఠాయించి రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20రోజులుగా మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డుకు మొక్కజొన్న తరలిస్తున్నా కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. దిగుబడి నిలువలు ఎక్కడికక్కడ పేరుకుపోయి కనీసం ఆరబెట్టుకునే స్థలం కూడాలేకుండా పోయిందన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో నష్టపోయే ప్రమాదముందని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్యాంసుందర్, నిర్మల్ రూరల్ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై రాజు అక్కడికి చేరుకున్నారు. వారు రైతులకు నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు ఎంతకు వినకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. రూరల్ సీసీ మార్కెటింగ్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రైతుల సమస్యను, తాజా పరిస్థితిని వివరించారు. ఈమేరకు స్పందించిన అధికారులు వారం లోపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రెండుగంటల పాటు సాగిన ఆందోళనతో రహదారికిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment