formers demand
-
పరిహారం ఇచ్చి కదలండి..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్) : తమకు పరిహారం ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు పనులు సాగించాలని ఉదండాపూర్, వల్లూరు రైతులు ఆందోళన చేపట్టారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నా రు. ప్రాజెక్ట్ పనులకు మట్టిని, కంకరను తీసుకెళ్తున్న టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సేకరించిన భూములకు పరిహారం ఇప్పటి వరకు అందలేదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు ఇచ్చిన విధంగా తమకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపుకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ పునరావాసానికి సంబధించి శంకరాయపల్లి, కావేరమ్మపేట పరిధిలో ఇళ్ల స్థలాలను వెంటనే ఖరారు చేసి పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. వల్లూరు ప్రధాన రహదారిపై గ్రామస్తులు, విద్యార్థులు లు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. నిర్లక్ష్యం వీడని ప్రభుత్వం.. రిజర్వాయర్ నిర్మాణానికి సానుకూలంగా స్పం దించి భూములు అప్పగించినా ప్రభుత్వం తమ ను చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశా రు. బహిరంగ మార్కెట్లో ఎకరంగా కనీసంగా రూ.25 లక్షలు పలుకుతుందని, తమ భూములకు మాత్రం ప్రభుత్వం కేవలం రూ.5.50, రూ.6.50 లక్షలు మాత్రమే ఖరారు చేసిందని అన్నారు. తమ భూములకు ఆ విలువలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తేగాక తమకు రైతుబంధు పథకం సైతం నిలిపి వేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక ఉదండాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు సమావేశమై ఆందోళనకు సిద్దమయ్యారు. రూ.32 కోట్లు విడుదల భూపరిహారం కోసం శుక్రవారం రూ.32 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్సి లక్ష్మారెడ్డి తెలిపారు. సమస్యలను సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించామని,సమస్యల పరిశ్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. వల్లూరు, ఉదండాపూర్‌లో అదికారులు పర్యటించి ఇండ్ల నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆయా విలువను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలకు సంబందించి ఖరారు చేసిన ఇళ్ల స్థలాలను కేటాయించి పునరావాసానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో ఆర్డీఓగా పనిచేసి బదిలీపై వెళ్లిన లక్ష్మినారాయణను కూడా డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని అందరికీ న్యాయం జరిగే విదంగా తాము సముచితమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధివిశయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు సుదర్శన్‌గౌడ్, తదితరులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి విశయాన్ని వివరించారు. దీంతో ఆయన ఫోన్లో మైక్ ద్వారా గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. రిజర్వాయర్‌నిర్మాణానికి అందరు సహకరించాలని,సమస్యల పరిశ్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనేపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రిజర్వాయర్‌పనులకు తరలిస్తున్న కంకరను వల్లూరు సమీపంలో డంప్ చేయించారు. కంకరను విక్రయించి ఆసొమ్ముద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈసందర్భంగా పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన రైతులు
సారంగపూర్(నిర్మల్) : మండలకేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై భైఠాయించి రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20రోజులుగా మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డుకు మొక్కజొన్న తరలిస్తున్నా కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. దిగుబడి నిలువలు ఎక్కడికక్కడ పేరుకుపోయి కనీసం ఆరబెట్టుకునే స్థలం కూడాలేకుండా పోయిందన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో నష్టపోయే ప్రమాదముందని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్యాంసుందర్, నిర్మల్ రూరల్ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై రాజు అక్కడికి చేరుకున్నారు. వారు రైతులకు నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు ఎంతకు వినకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. రూరల్ సీసీ మార్కెటింగ్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యను, తాజా పరిస్థితిని వివరించారు. ఈమేరకు స్పందించిన అధికారులు వారం లోపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రెండుగంటల పాటు సాగిన ఆందోళనతో రహదారికిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తదితరులు ఉన్నారు. -
‘చింతలపూడి’ పనులకు ఆటంకం
చింతలపూడి: చింతలపూడి మండలం కాంతంపాలెం గ్రామంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ తవ్వకం పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి సత్యవతి, నాగబాబుకు చెందిన భూముల్లో తవ్వకం పనులను ప్రారంభించడానికి వచ్చిన యంత్రాలను అడ్డుకుని నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా తమ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు చిట్లూరి అంజిబాబు మాట్లాడుతూ అధికారులు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో పక్షపాతం చూపుతున్నారని విమర్శించారు. దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలువకు భూములు పోగొట్టుకున్న రైతులకు రాజకీయ ఒత్తిళ్లతో ఎకరాకు రూ.30 లక్షలు ఇచ్చారని, ఇక్కడ మాత్రం జిరాయితీ భూములకు తక్కువ ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఆర్డీవో చక్రధరరావు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. బుధవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరావు, పీతల సుజాతతో నష్టపరిహారం విషయమై సమావేశం ఉందని, సీఎం పర్యటన ఉండటంతో గురువారం మంత్రులతో చర్చిస్తామని ఆర్డీవో అన్నారు. మంత్రులతో సమావేశం పూర్తయ్యేవరకు పనులు నిలిపివేస్తామని చెప్పారు. తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ ఆయన వెంట ఉన్నారు. -
కృష్ణా డెల్టా ఆయకట్టును ఆదుకోండి
ఏలూరు (సెంట్రల్): కృష్ణా డెల్టా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం వరి దుబ్బులతో ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో మన జిల్లాకు చెందిన 58 వేల ఎకరాల్లో సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని, జూలై 16లోపు నీరందిస్తామన్న అధికారులు, పాలకులు మాటలు నీటిమూటలుగానే మిగిలాయని విమర్శించారు. మురుగు నీరు, వర్షం నీటితో కొద్ది ఆయకట్టులో నాట్లు వేయగా ప్రస్తుతం నీరందక ఎండిపోతున్నాయన్నారు. పోణంగి పుంత పనులు తక్షణమే పూర్తి చేసి ఏలూరు మండలాల్లోని గ్రామాలకు సాగునీరందించాలని, కృష్ణా ఆయకట్టుకు సాగు నీరందించడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం నాయకులు మావూరి శ్రీనివాసరావు, పైడిపాటి భాస్కరరావు, పి.పెద్దియ్య పాల్గొన్నారు.