Purchase center
-
తెలంగాణలో పాగా వేస్తాం
ఖమ్మంమామిళ్లగూడెం : కర్నాటక రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలిచితీరుతుందని, అదే ఊపుతో తెలంగాణలోనూ పాగా వేస్తామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. సోమవారం ఖమ్మం హర్షా హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర పథకాలు గ్రామీణ స్థాయి వరకు చేరేలా ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటూనే..తిరిగి బురదజల్లేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోటీ చేసినా గతంలో విఫలమయ్యారన్నారు. స్వామినాథన్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందించాలని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్‌ను సీఎం కేసీఆర్ రాజకీయ ఎజెండాగా చేశారని విమర్శించారు. రైతుల బాధలు పట్టవా..? తల్లాడ : రైతుల బాధలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యగా రైతు బంధు చెక్కులను అందిస్తోందని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత, పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ అన్నారు. తల్లాడ మండలం మల్లవరం సమీపంలో సోమవారం మార్కెట్ కమిటీ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మొక్కజొన్న బస్తాలు వందలాదిగా నిల్వ ఉన్నాయని, వారం రోజులుగా రైతులు ఇక్కడే పడిగాపులు కాస్తున్నా కాంటాలు వేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మునుపెన్నడూ లేదని, కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. రైతులు మధ్య దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయించి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రూ.1425 ప్రభుత్వ ధర ఉంటే దళారులు రూ.1100కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేవలం హైదరాబాద్ ప్రగతి భవన్లో కూర్చుంటే, హెలికాప్టర్లో తిరిగితే రైతు సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు తమ భాదలను దత్తాత్రేయకు విన్నవించారు. అనంతరం తల్లాడలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నే ఉధయ్‌ప్రతాప్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయుకులు నంబూరి రామలింగేశ్వర్రావు, ఆపతి వెంకటరామారావు, తేజావత్ బాలాజీ నాయక్, గల్లా సత్యనారాయణ, కోటమైసమ్మ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నంబూరి కనకదుర్గ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కొలిపాక శ్రీదేవి, ఉప్పల శారద పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతులు
సారంగపూర్(నిర్మల్) : మండలకేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై భైఠాయించి రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20రోజులుగా మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డుకు మొక్కజొన్న తరలిస్తున్నా కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. దిగుబడి నిలువలు ఎక్కడికక్కడ పేరుకుపోయి కనీసం ఆరబెట్టుకునే స్థలం కూడాలేకుండా పోయిందన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో నష్టపోయే ప్రమాదముందని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్యాంసుందర్, నిర్మల్ రూరల్ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై రాజు అక్కడికి చేరుకున్నారు. వారు రైతులకు నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు ఎంతకు వినకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. రూరల్ సీసీ మార్కెటింగ్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యను, తాజా పరిస్థితిని వివరించారు. ఈమేరకు స్పందించిన అధికారులు వారం లోపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రెండుగంటల పాటు సాగిన ఆందోళనతో రహదారికిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తదితరులు ఉన్నారు. -
రోడ్డెక్కిన కంది రైతు
మద్నూర్(జుక్కల్) : కంది రైతులు కన్నెర్ర చేశారు. కంది పంట కొనుగోలు కేంద్రం పునః ప్రారంభిచాలంటు రైతులు రోడెక్కారు. మండలంలోని మేనూర్‌లో జాతీయ రహదారిపై మంగళవారం బీజేపీ నాయకులు, రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండలంలోని డోంగ్లీ సహకార సంఘంలో గత రెండు రోజుల క్రితం కంది కొనుగోలు కేంద్రం మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోంగ్లీలో కొనుగోలు కేంద్రం మూసివేస్తున్నామని రైతులు మద్నూర్ మార్కెట్లోని కంది కొనుగోలు కేంద్రానికి పంటను తరలించాలని అధికారులు సూచించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ రాములు అన్నారు. డోంగ్లీ చుట్టూ పక్కల ప్రాంతాల రైతులు మద్నూర్‌కు పంటను తరలించాలంటే రవాణ ఖర్చులు తడిసిమోపెడవుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు వెంటనే డోంగ్లీలో కంది కొనుగోలును ప్రారంభిచాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, తహసీల్దార్ ధన్వాల్ సంఘటన స్థలానికి చేరుకోని రైతులు, రైతునాయకులతో మాట్లాడారు. త్వరలో ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేౖసామని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు. శనగ పంటను తీసుకోవాలి రబీ సీజన్‌కు సంబందించి రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎంపీటీసీ రాములు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో శనగ క్వింటాలుకు రూ.3400 నుంచి రూ.3600 వరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4400 ప్రకటించిందని ఇక్కడ శనగకొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు క్వింటాల్‌కు వెయ్యి రూపాయాలు నష్టపోతున్నారని పేర్కోన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే మండలంలో అక్రమంగా కందులను రైతుల పేరిట విక్రయించిన దళారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటు నాయకులు, స్థానిక రైతులు ఉన్నారు. కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ సత్తయ్య దళారులు అక్రమంగా మహారాష్ట్ర నుంచి కందులను తీసుకచ్చి విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న కంది కోనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. దళారులు రైతుల వద్ద నుంచి పట్టాపాస్ పుస్తకాలు సేకరించి వారి పేరున కందులు తూకం వేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రతి రోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికి చెందిన రైతుల కందులను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయాధికారులు గ్రామాలను ఎంపిక చేసి రైతులకు సమాచారం అందించాలని, రైతులు తమ పట్టాపాసు పుస్తకాలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అక్రమ కంది కొనుగోళ్లపై పూర్తి విచారణ జరుపుతామని, దళారులను ఆరికట్టెందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులను నియమించామన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సిబ్బంది ఆన్లైన్ పనులను వేగవంతం చేయాలన్నారు. మేనూర్‌లో రైతులు రాస్తారోకో విషయం ప్రస్తావిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మార్కెట్ యార్డులలోనే కంది కొనుగోలు కేంద్రాలు ఉండాలన్న నిబంధనలతోనే డోంగ్లీ సోసైటీలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారని దీనికి రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీతో పాటు తహసీల్దార్ ధన్వాల్, సిబ్బంది ఉన్నారు. -
అక్రమార్కులపై గురి
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై రెవెన్యూ, పోలీస్‌శాఖలు పంజా విసిరాయి. ఈ కేంద్రంలో రైతులు తాము పండించిన పంటను నేరుగా అమ్ముకునే కన్నా బినామీ రైతుల పేరిట దళారులు, కమీషన్‌వ్యాపారులు, వ్యాపారుల సరుకే అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సోమవారం అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు ఎం.ఏ అలీం, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో వెంకారెడ్డి, ఖమ్మం త్రీటౌన్ సీఐ రెహమాన్‌లు సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తి రైతులదా ? దళారులదా ? బినామీ రైతుల పేరిట కమీషన్ వ్యాపారులు తెస్తున్నారా ? అనే అంశాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో సీసీఐ కేంద్రంలో జరిగే అక్రమాలన్నీ బయటపడ్డాయి. అసలేం జరిగింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో రైతులు అమ్మకానికి తీసుకువచ్చే సరుకు కన్నా దళారులు, కమీషన్‌దారులే ఎక్కువ సరుకును అమ్మకానికి తీసుకువచ్చి అమ్ముతున్నారు. దళారులు, కమీషన్‌వ్యాపారులు రైతుల వద్ద క్వింటాలుకు రూ,3,000 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేసి సీసీఐ కేంద్రంలో వారికి సంబంధించిన రైతుల పేరిట క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,050 వరకు అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల మేరకు 8-12 తేమ శాతం ఉన్న సరుకును మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. కానీ కమీషన్‌దారులు 12 శాతానికి మించి తేమ ఉన్న సరుకును తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఖమ్మం సీసీఐ కేంద్రానికి నిత్యం 30 వేల బస్తాలకు పైగా సరుకు అమ్మకానికి వస్తుంది. నిబంధనల మేరకు సరుకు ఉండకపోవటంతో సీసీఐ కొనుగోలుదారులు సరుకును కొనుగోలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. గేటు వద్ద సరుకును మాయిశ్చర్ యంత్రంతో పరీక్షించి, నిబంధనలకు లోబడి ఉన్న రైతుల సరుకును మాత్రమే లోనకు అనుమతించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేశారు. రైతుల ముసుగులో అక్రమార్కులు సరుకును తీసుకువచ్చి లోనకు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు అందుకు అంగీకరించకపోవటంతో గేట్ల తాళాలు పగులగొట్టి సరుకును లోనకు తీసుకువెళ్లి దిగుమతి చేశారు. ఈ వ్యవహారంలో కొందరు అక్రమార్కుల ఆగడాలను అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఈ వ్యవహారాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ సీరియస్‌గా తీసుకొని ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో వెంకారెడ్డిలను రంగంలోకి దించారు. ఈ వ్యవహారంలో శాంతి భద్రతలను కల్పించాలని పోలీస్ శాఖను కూడా కోరారు. ఖమ్మం డిఎస్పీ బాలకిషన్ రావు నేతృత్వంలో త్రీటౌన్ సీఐ రహమాన్, సీసీఎస్ సీఐ విశ్వేశ్వర రావులు పోలీసు బలగాలతో మార్కెట్‌కు వచ్చారు. రెవెన్యూ, మార్కెట్, పోలీస్ అధికారుల బృందం సరకు వద్దకు వెళ్లి ఆ సరుకుకు సంబంధించిన రైతుల వివరాలు, వారు నిజమైన రైతులేనా అనే విషయాలను పరిశీలించారు. చింతకాని, తిరుమలాయపాలెం, బోనకల్లు తదితర మండలాలకు చెందిన రైతులమని శేషయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు చెప్పుకొచ్చారు. వీఆర్వో నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొచ్చారా..? అని ప్రశ్నించగా తాము తీసుకురాలేదని, అంతా కమీషన్వ్యాపారే చూసుకుంటున్నారని తెలిపారు. ఈ వ్యవహారాన్నంతటిని అధికారులు వీడియోలో, కెమెరాల్లో (ఫోటోలు) రికార్డు చేశారు. ఒక్కొక్కటిగా అక్రమ వ్యవహారం బయటపడుతుండటంతో ఆ ప్రాంతంలో ఉన్న దళారులు, కమీషన్వ్యాపారుల అక్కడ నుంచి జారుకున్నారు. పంట పండించి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు మినహా మిగిలిన వారు తమతమ సరకును బయటకు తీసుకువెళ్లాలని మైకులో ప్రకటించారు. కొందరు సరుకును సీసీఐ కేంద్రం నుంచి బయటకు తరిలించారు. పోలీసుల అదుపులో 15 వాహనాలు కృష్ణా, నల్లగొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దళారులు, కమీషన్‌వ్యాపారులు సీసీఐ కేంద్రంలో అమ్మకానికి తీసుకువచ్చిన దాదాపు 15 పత్తి లారీలు, వ్యాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయా వాహనాల డ్రైవర్లను సరుకు ఎక్కడిదని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పత్తిని తీసుకువచ్చిన వ్యాపారుల వివరాలను డ్రైవర్లు పోలీసులకు ఇచ్చారు. ఆయా వ్యాపారులకు పోలీస్ అధికారులు ఫోన్లు చేయగా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారులకు వార్నింగ్ సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన పత్తి బస్తాలపై ఏఎన్ఆర్, ఎంఎన్ఆర్, కేఆర్ఆర్ వంటి రాతలు ఉండటంతో వాటి ఆధారంగా కమీషన్ వ్యాపారులను గుర్తించి వారిని మార్కెట్‌కు పిలిపించారు. సీసీఐ కేంద్రంలోకి అక్రమంగా సరుకును తీసువచ్చి రైతుల పేరిట అమ్మకాలు చేస్తున్నారని, ఆ విధానాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్డీవో, డీఎస్పీలు హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఒక కమీషన్వ్యాపారి మార్కెట్ అధికారులపై దౌర్జన్యం చేశాడనే వ్యవహారాన్ని అధికారులు చర్చించి ఆ వ్యాపారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువువెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాస రావు తదితరులను అధికారులు మార్కెట్‌కు పిలిపించి వారితో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు చట్టాన్ని ఉల్లఘంచరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ పహారా మధ్య కొనుగోళ్లు సోమవారం మధ్యాహ్నం పోలీసు పహారా మధ్య ఆర్డీవో, ఎంఆర్వో, మార్కెట్ అధికారుల సమక్షంలో సీసీఐ బయ్యర్లు పత్తిని కొనుగోళ్లు ప్రారంభించారు. బ్లాక్ లిస్టులో ఖమ్మం సీసీఐ కేంద్రం ? ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, నాణ్యత లేని పత్తి అమ్మకానికి వస్తోందని, బయ్యర్లను కొందరు ఇబ్బంది పెడుతున్నారని సీసీఐకి సమాచారం అందింది. గతంలో కూడా ఇక్కడ అక్రమాలు జరిగాయని సీసీఐ గుర్తించింది. ఈ కేంద్రాన్ని నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని బ్లాక్ లిస్టులో పెట్టాలనే యోచనలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది.