ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై రెవెన్యూ, పోలీస్‌శాఖలు పంజా విసిరాయి. ఈ కేంద్రంలో రైతులు తాము పండించిన పంటను నేరుగా అమ్ముకునే కన్నా బినామీ రైతుల పేరిట దళారులు, కమీషన్‌వ్యాపారులు, వ్యాపారుల సరుకే అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సోమవారం అధికారుల తనిఖీల్లో బయటపడింది.
ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు ఎం.ఏ అలీం, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో వెంకారెడ్డి, ఖమ్మం త్రీటౌన్ సీఐ రెహమాన్‌లు సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తి రైతులదా ? దళారులదా ? బినామీ రైతుల పేరిట కమీషన్ వ్యాపారులు తెస్తున్నారా ? అనే అంశాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో సీసీఐ కేంద్రంలో జరిగే అక్రమాలన్నీ బయటపడ్డాయి.
అసలేం జరిగింది
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో రైతులు అమ్మకానికి తీసుకువచ్చే సరుకు కన్నా దళారులు, కమీషన్‌దారులే ఎక్కువ సరుకును అమ్మకానికి తీసుకువచ్చి అమ్ముతున్నారు. దళారులు, కమీషన్‌వ్యాపారులు రైతుల వద్ద క్వింటాలుకు రూ,3,000 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేసి సీసీఐ కేంద్రంలో వారికి సంబంధించిన రైతుల పేరిట క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,050 వరకు అమ్మకాలు చేస్తున్నారు.
నిబంధనల మేరకు 8-12 తేమ శాతం ఉన్న సరుకును మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. కానీ కమీషన్‌దారులు 12 శాతానికి మించి తేమ ఉన్న సరుకును తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఖమ్మం సీసీఐ కేంద్రానికి నిత్యం 30 వేల బస్తాలకు పైగా సరుకు అమ్మకానికి వస్తుంది. నిబంధనల మేరకు సరుకు ఉండకపోవటంతో సీసీఐ కొనుగోలుదారులు సరుకును కొనుగోలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. గేటు వద్ద సరుకును మాయిశ్చర్ యంత్రంతో పరీక్షించి, నిబంధనలకు లోబడి ఉన్న రైతుల సరుకును మాత్రమే లోనకు అనుమతించాలని నిర్ణయించారు.
ఆదివారం రాత్రి ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేశారు. రైతుల ముసుగులో అక్రమార్కులు సరుకును తీసుకువచ్చి లోనకు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు అందుకు అంగీకరించకపోవటంతో గేట్ల తాళాలు పగులగొట్టి సరుకును లోనకు తీసుకువెళ్లి దిగుమతి చేశారు. ఈ వ్యవహారంలో కొందరు అక్రమార్కుల ఆగడాలను అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఈ వ్యవహారాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ సీరియస్‌గా తీసుకొని ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో వెంకారెడ్డిలను రంగంలోకి దించారు.
ఈ వ్యవహారంలో శాంతి భద్రతలను కల్పించాలని పోలీస్ శాఖను కూడా కోరారు. ఖమ్మం డిఎస్పీ బాలకిషన్ రావు నేతృత్వంలో త్రీటౌన్ సీఐ రహమాన్, సీసీఎస్ సీఐ విశ్వేశ్వర రావులు పోలీసు బలగాలతో మార్కెట్‌కు వచ్చారు. రెవెన్యూ, మార్కెట్, పోలీస్ అధికారుల బృందం సరకు వద్దకు వెళ్లి ఆ సరుకుకు సంబంధించిన రైతుల వివరాలు, వారు నిజమైన రైతులేనా అనే విషయాలను పరిశీలించారు. చింతకాని, తిరుమలాయపాలెం, బోనకల్లు తదితర మండలాలకు చెందిన రైతులమని శేషయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు చెప్పుకొచ్చారు.
వీఆర్వో నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొచ్చారా..? అని ప్రశ్నించగా తాము తీసుకురాలేదని, అంతా కమీషన్‌వ్యాపారే చూసుకుంటున్నారని తెలిపారు. ఈ వ్యవహారాన్నంతటిని అధికారులు వీడియోలో, కెమెరాల్లో (ఫోటోలు) రికార్డు చేశారు. ఒక్కొక్కటిగా అక్రమ వ్యవహారం బయటపడుతుండటంతో ఆ ప్రాంతంలో ఉన్న దళారులు, కమీషన్‌వ్యాపారుల అక్కడ నుంచి జారుకున్నారు. పంట పండించి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు మినహా మిగిలిన వారు తమతమ సరకును బయటకు తీసుకువెళ్లాలని మైకులో ప్రకటించారు. కొందరు సరుకును సీసీఐ కేంద్రం నుంచి బయటకు తరిలించారు.
పోలీసుల అదుపులో 15 వాహనాలు
కృష్ణా, నల్లగొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దళారులు, కమీషన్‌వ్యాపారులు సీసీఐ కేంద్రంలో అమ్మకానికి తీసుకువచ్చిన దాదాపు 15 పత్తి లారీలు, వ్యాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయా వాహనాల డ్రైవర్లను సరుకు ఎక్కడిదని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పత్తిని తీసుకువచ్చిన వ్యాపారుల వివరాలను డ్రైవర్లు పోలీసులకు ఇచ్చారు. ఆయా వ్యాపారులకు పోలీస్ అధికారులు ఫోన్‌లు చేయగా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.
వ్యాపారులకు వార్నింగ్
సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన పత్తి బస్తాలపై ఏఎన్‌ఆర్, ఎంఎన్‌ఆర్, కేఆర్‌ఆర్ వంటి రాతలు ఉండటంతో వాటి ఆధారంగా కమీషన్ వ్యాపారులను గుర్తించి వారిని మార్కెట్‌కు పిలిపించారు. సీసీఐ కేంద్రంలోకి అక్రమంగా సరుకును తీసువచ్చి రైతుల పేరిట అమ్మకాలు చేస్తున్నారని, ఆ విధానాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్డీవో, డీఎస్పీలు హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఒక కమీషన్‌వ్యాపారి మార్కెట్ అధికారులపై దౌర్జన్యం చేశాడనే వ్యవహారాన్ని అధికారులు చర్చించి ఆ వ్యాపారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అనంతరం ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువువెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాస రావు తదితరులను అధికారులు మార్కెట్‌కు పిలిపించి వారితో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు చట్టాన్ని ఉల్లఘంచరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీస్ పహారా మధ్య కొనుగోళ్లు
సోమవారం మధ్యాహ్నం పోలీసు పహారా మధ్య ఆర్డీవో, ఎంఆర్వో, మార్కెట్ అధికారుల సమక్షంలో సీసీఐ బయ్యర్లు పత్తిని కొనుగోళ్లు ప్రారంభించారు.
బ్లాక్ లిస్టులో ఖమ్మం సీసీఐ కేంద్రం ?
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, నాణ్యత లేని పత్తి అమ్మకానికి వస్తోందని, బయ్యర్లను కొందరు ఇబ్బంది పెడుతున్నారని సీసీఐకి సమాచారం అందింది. గతంలో కూడా ఇక్కడ అక్రమాలు జరిగాయని సీసీఐ గుర్తించింది. ఈ కేంద్రాన్ని నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని బ్లాక్ లిస్టులో పెట్టాలనే యోచనలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది.
అక్రమార్కులపై గురి
Published Tue, Nov 11 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement