మల్లవరంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న దత్తాత్రేయ
ఖమ్మంమామిళ్లగూడెం : కర్నాటక రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలిచితీరుతుందని, అదే ఊపుతో తెలంగాణలోనూ పాగా వేస్తామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. సోమవారం ఖమ్మం హర్షా హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర పథకాలు గ్రామీణ స్థాయి వరకు చేరేలా ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటూనే..తిరిగి బురదజల్లేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోటీ చేసినా గతంలో విఫలమయ్యారన్నారు. స్వామినాథన్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందించాలని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్‌ను సీఎం కేసీఆర్ రాజకీయ ఎజెండాగా చేశారని విమర్శించారు.
రైతుల బాధలు పట్టవా..?
తల్లాడ : రైతుల బాధలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యగా రైతు బంధు చెక్కులను అందిస్తోందని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత, పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ అన్నారు. తల్లాడ మండలం మల్లవరం సమీపంలో సోమవారం మార్కెట్ కమిటీ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
మొక్కజొన్న బస్తాలు వందలాదిగా నిల్వ ఉన్నాయని, వారం రోజులుగా రైతులు ఇక్కడే పడిగాపులు కాస్తున్నా కాంటాలు వేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మునుపెన్నడూ లేదని, కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. రైతులు మధ్య దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయించి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
రూ.1425 ప్రభుత్వ ధర ఉంటే దళారులు రూ.1100కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేవలం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కూర్చుంటే, హెలికాప్టర్‌లో తిరిగితే రైతు సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు తమ భాదలను దత్తాత్రేయకు విన్నవించారు.
అనంతరం తల్లాడలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నే ఉధయ్‌ప్రతాప్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయుకులు నంబూరి రామలింగేశ్వర్‌రావు, ఆపతి వెంకటరామారావు, తేజావత్ బాలాజీ నాయక్, గల్లా సత్యనారాయణ, కోటమైసమ్మ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నంబూరి కనకదుర్గ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కొలిపాక శ్రీదేవి, ఉప్పల శారద పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment