
తన కష్టాలను వివరిస్తున్న రైతు వీడియోను చూపుతున్న పొన్నాల
సాక్షి, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జనగామ పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు పెడతామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం రైతులు ఆనందంగా ఉంటున్నారని చెప్పడం దారణమన్నారు. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో పెంబర్తి రైతులను వచ్చి అడగాలన్నారు.
భూములు లేని వారిని రైతు సమన్వయ సమితుల్లో నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే రూ.14వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు.. సక్రమంగా చెల్లించిన రైతులకు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పెట్టుబడి పథకంలో కౌలు రైతులకు అవకాశం కల్పించక పోవడం సిగ్గుచేటన్నారు. జనగామ నియోజకవర్గంలోని ఆదర్శరైతులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎండీ అన్వర్, రంగరాజు ప్రవీణ్‌కుమార్, కొత్త కరుణాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, ఎండీ నాజీజ్, క్రాంతికుమార్, నాంపల్లి చందన, లింగాజీ తదితరులు పాల్గొన్నారు.