న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి నూతన వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశామని తెలిపారు. అడ్డంకులను తొలగించడంతోపాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను పెంచడానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఆ దిశగానే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని పేర్కొన్నారు. తన విధానాలు, చర్యల ద్వారా అన్నదాతల ప్రయోజనాలను కాపాడడానికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త సాగు చట్టాలపై రైతుల భయాందోళనలను దూరం చేసే ప్రయత్నం చేశారు. రైతాంగం సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఇంకా ఏమన్నారంటే..
రైతులకు డిజిటల్ వేదికలు
వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి, రైతులకు లబ్ధి చేకూరడానికి సంస్కరణలు దోహదపడతాయి. అన్నదాతలను సంపన్నులను చేయడమే ప్రభుత్వ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఈ చట్టాలతో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయి. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి నిర్దేశిత మార్కెట్లలోనే కాకుండా వెలుపల కూడా అదనపు వెసులుబాటు లభిస్తుంది. రైతులు ప్రస్తుతం మార్కెట్లలో లేదా దళారులకు పంటలను విక్రయించుకోవాల్సి వస్తోంది. కొత్త చట్టాలతో మార్కెట్లను ఆధునీకరిస్తారు. రైతులకు డిజిటల్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. విక్రయం, కొనుగోలు మరింత సులభ తరం అవుతుంది. ఇవన్నీ రైతుల ఆదాయం పెంచడం కోసమే. ఆదాయం పెరిగితే రైతులు ధనవంతులవుతారు. తద్వారా ఇండియా ధనిక దేశంగా మారుతుంది.
కొత్త మార్కెట్లు... కొత్త అవకాశాలు
నూతన సంస్కరణల అమలుతో రైతాంగానికి కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. కోల్డ్ స్టోరేజీల్లో సదుపాయాలు మెరుగవుతాయి. వీటన్నింటితో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. ఈ సంస్కరణలో చిన్న, సన్నకారు రైతులు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగం వెలుగులీనుతోంది. రైతులకు మేలు చేకూర్చే చర్యలు ప్రారంభించాం. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతున్నారు. దీంతో విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోగలుగుతున్నాం. చెరకు పండించే రైతులకు మంచి ధర లభిస్తోంది.
అడ్డుగోడలను కూల్చేస్తున్నాం...
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ వంటివి వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ విధానం సరైంది కాదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం కావాలి. వివిధ రంగాల మధ్య వారధులు ఉండాలి తప్ప అడ్డుగోడలు కాదు. ఈ అడ్డుగోడలను కూల్చడానికి కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు బ్యాంకు ఖాతా, విశిష్ట గుర్తింపు సంఖ్య, తక్కువ ధరకే మొబైల్ డేటా అందుతున్నాయి. వీటితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ మన దేశంలో అవతరించింది.
వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం
వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తల పాత్ర పరిమితంగానే ఉంది. వారు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. కోల్డ్ స్టోరేజీలు, ఎరువుల తయారీలో ప్రైవేట్ రంగం పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. పెట్టుబడిదారులకు గ్రామీణ ప్రాంతాలు మంచి ఎంపిక. ఇంటర్నెట్ వినియోగం నగరాల కంటే గ్రామాల్లో అధికంగా ఉంది. 98 శాతం గ్రామాలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో అనుసంధానం అయ్యాయి. వారు సామాజిక, ఆర్థిక చైతన్యం కోరుకుంటున్నారు.
పల్లె ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలకు వైఫై సేవలు అందించేందుకు ఇటీవల ‘ప్రధానమంత్రి వాణి’ ప్రాజెక్టును ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడానికి ఉద్దేశించిన ఈ వేదికను పారిశ్రామిక రంగం ఉపయోగించుకోవాలి. 21వ శతాబ్దపు పురోగతికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అందించే సహకారమే కీలకం. అందుకే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. ఈ అవకాశం వదులుకోవద్దు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు గ్రామాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాం.
కనిష్ట స్థాయికి సర్కారు నియంత్రణలు
కరోనా మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలను ఆర్థిక సూచికలు ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ నియంత్రణలను కనిష్ట స్థాయికి తగ్గించి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. కరోనా మహమ్మారి మొదలైన ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి గత ఆరేళ్లుగా పలు కార్యక్రమాలు చేపట్టాం.
వీటి ఫలితంగా కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. పన్నుల్లోనూ సంస్కరణలు తెచ్చాం. దీంతో ట్యాక్స్ టెర్రరిజం, ఇన్‌స్పెక్టర్‌రాజ్ అంతమయ్యాయి. 20–20 క్రికెట్ మ్యాచ్‌లో పరిణామాలు శరవేగంగా మారుతుండడం మన చూస్తుంటాం. అదే తరహాలో 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment