
సహకారం ఇదేనా?
బుచ్చిరెడ్డిపాళెం (కోవూరు) : రాష్ట్రంలో మూతపడిన ఆరు చక్కెర కర్మాగారాలను విక్రయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ పావులు కదుపుతున్నట్లు సమాచారం. సహకార రంగంలో రాష్ట్రవ్యాప్తంగా 10 చక్కెర కర్మాగారాలున్నాయి. వాటిలో విజయనగరం, చోడవరం, ఏటికొప్పాక, తాండవ ప్రాంతాల్లోని కర్మాగారాలు నడుస్తున్నాయి. అనకాపల్లి, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంటూరు కర్మాగారంతో పాటు జిల్లాలోని కోవూరు సహకార చక్కెర కర్మాగారం మూతపడింది.
ఫ్యాక్టరీ వివరాలను పంపాలని ఆదేశం
మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కర్మాగారాల అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి ఆదేశాలు అందాయి. ఫ్యాక్టరీ స్థలం, కార్మికులు, బకాయిలు, సామగ్రి తదితరాల వివరాలను పంపాలని కోరింది.
హామీలు తప్ప ఆచరణ ఏదీ..?
మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మూతపడిన కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని అధికారంలోకి రాగానే పునఃప్రారంభిస్తానన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆ విషయాన్నే మరిచారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి జన్మభూమి– మాఊరుకు తొలిసారి వచ్చిన చంద్రబాబు కమిటీలు వేసి నివేదిక తెప్పించి, కర్మాగారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. కర్మాగారానికి వచ్చిన కమిటీలు ఫ్యాక్టరీని నిలుపుకుంటే రైతులకు, ప్రభుత్వానికి మేలు అని నివేదికలు సైతం ఇచ్చాయి. అయితే ప్రభుత్వం వాటిని బయటకు రానీయకుండా , ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది.
ఫ్యాక్టరీ స్థలంపైనే కన్ను
కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి 124 ఎకరాల స్థలం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే, మంత్రులకు అంతా స్థలంపైనే కన్నుపడింది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సైతం స్థలం అమ్మి బకాయిలు తీరుస్తామని ³లుమార్లు ప్రకటించారు. ఎంతో విలువ ఉన్న భూమిని తన అనుచరులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2003లో చంద్రబాబునాయుడు హయాంలో ఫ్యాక్టరీని తన అనుయాయులకు కట్టబెట్టే యత్నం జరిగింది. దీంతో రైతులు కోర్టును ఆశ్రయించి ఫ్యాక్టరీని కాపాడుకున్నారు. మళ్లీ నేడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులను అన్యాయం చేసే దిశగా ఫ్యాక్టరీని అమ్మాలని చూస్తున్నట్లు రైతులు చర్చించుకుంటున్నారు.
రూ.20 కోట్ల గ్రాంటుతో ఫ్యాక్టరీకి పూర్వవైభవం
కోవూరు సహకార చక్కెర కర్మాగారంలోని కార్మికులు, ఉద్యోగులు 1500 మందికి పైగా ఉన్నా రు. వీరికి సంబంధించి 45 నెలలుగా రూ.12 కోట్లు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంది. దీంతో పాటుగా ఫ్యాక్టరీలోని పనిముట్లు తదితరాలకు మరో రూ.8 కోట్లు కావాల్సి ఉంది. రూ.20 కోట్ల గ్రాంటును ప్రభుత్వం మంజూరు చేస్తే కోవూరు సహకార చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం వస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానంటున్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని, అమ్మాలని చూస్తే ఆందోళనకు దిగుతామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఫ్యాక్టరీ లేకపోవటంతో నష్టాలు చవిచూస్తున్నాం
కోవూరు సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో బయట ఫ్యాక్టరీలకు పంపి గిట్టుబాటు కాక నష్టాలు చవిచూస్తున్నాం. ఫ్యాక్టరీ లేకుండా చెరకు సాగు కష్టం. ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులకు అండగా నిలవాలి.
వెంకటస్వామి, రైతు, రేబాల
కర్మాగారాన్ని అమ్మితే ఊరుకోం
సహకార చక్కెర కర్మాగారాన్ని రైతుల అనుమతి లేనిదే అమ్మడానికి లేదు. గతంలో తెచ్చిన స్టే అమల్లో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు సహకార రంగాన్ని పట్టించుకోకపోవడం దారుణం. కమిటీలు వేయడం మినహా చేసిందేమీ లేదు. కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలి. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనకు దిగుతాం.
జొన్నలగడ్డ వెంకమరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చెరకు రైతుల సంఘం
ప్రగల్భాలు పలకడం తప్ప పనులేవీ
పరిశ్రమలు నెలకొల్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు రైతులు ఉపయోగపడే కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని పట్టించుకోకపోవడం దారుణం. అబద్ధపు హామీలు చెప్పి రైతులను నిలువునా ముంచాడు. ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని నేటికీ చర్యలు తీసుకోలేదు. నేడు మళ్లీ అమ్మేదిశగా ప్రయత్నాలు చేయడం చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.
మావులూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ రైతు విభాగం