సమస్యల బజార్లు
♦ రైతులున్నా..వసతులు సున్నా ..
♦ అధ్వానంగా రైతుబజార్లు
♦ ఏడింట రెండు భేష్ ..ఐదు తుస్...
♦ హైస్పీడ్‌తో ‘కోట’ రైతుబజార్
శృంగవరపుకోట:
రైతుకు దన్ను దొరకాలి.. దళారీ వ్యవస్థ పోవాలి.. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలి.. వినియోగదారుల ఆకలి తీరాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతుబజార్ల పరిస్థితి నేడు అధ్వానంగా తయారయ్యాయి. రైతులున్న చోట వసతులు లేక.. వసతులున్న చోట రైతులు రాక.. జిల్లా అధికారులకు వాస్తవాలు çకనబడక.. నేతలకు ప్రజల పాట్లు పట్టక రైతు బజార్లు కునారిల్లుతున్నాయి. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రంలో మూడు రైతుబజార్లు ఉండగా చీపురుపల్లి, కొటారుబిల్లి, ఎస్.కోట, పార్వతీపురంలో మరో నాలుగు రైతుబజార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏడు రైతు బజార్లో రెండు భేషుగ్గా నడుస్తుండగా, మరో ఐదు రైతులు రాక, వసతులు లేక, అధికారులు పట్టించుకోక సమస్యల బజార్లుగా మారాయి. జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ వద్ద ఉన్న రైతుబజార్ రైతులు, వినియోగదారులతో కిటకిటలాడుతోంది. ఎస్.కోటలో ఇటీవల ఏర్పాటైన రైతుబజార్ అంతే వేగంతో అద్భుతంగా నడుస్తూ అందరి అభిమానం చూరగొంటోంది.
మిగిలిన రైతుబజార్లు మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల వైఫల్యానికి సాక్ష్యాలుగా మిగిలాయి టాప్ గేర్‌లో ‘ఎస్’ కోట బజార్
ప్రారంభించిన నెలకే ఎస్.కోట రైతుబజార్ దూసుకుపోతోంది. ప్రస్తుతం 22 స్టాల్స్‌లో ఇద్దరు, ముగ్గురు కూర్చుని 60 మంది రైతులు అమ్మకాలు చేస్తున్నారు. మరో 100 మంది రైతులు కార్డులు కావాలని దరఖాస్తు చేయగా, పరిశీలించి పెండింగ్‌లో ఉంచారు. ఎమ్మెల్యే లలితకుమారి ప్రత్యేక శ్రద్ధ ఈఓ సతీష్ చొరవతో నిత్యం 2000 మంది వినియోగదారులకు 100 క్వింటాళ్ల కూరగాయలను రైతులు విక్రయిస్తున్నారు. పెరుగుతున్న అవసరాల మేరకు ఎస్.కోట రైతుబజార్‌లో షెడ్లు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.
ఆర్‌అండ్‌బీ బజార్ అదుర్స్
జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ రైతుబజార్‌లో 80 స్టాల్స్ ఉండగా 107 మంది రైతులు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతి రోజూ ఈ బజార్‌లో సుమారు 400 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతుండగా, సుమారు 4000 మంది వినియోగదారులు వస్తున్నట్లు సమాచారం. రైతులు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చినా అమ్మకాలు సాగించేందుకు తగినన్ని స్టాల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మరిన్ని స్టాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
కమ్మల పాకల్లో..
మహారాజ పాత ఆస్పత్రి వద్ద ప్రభుత్వ స్థలం లేకు మాన్సాస్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ లేకపోవడంతో కమ్మల పాకల్లో విక్రయాలు చేపడుతున్నారు. ఈ బజార్ పందుల నిలయంగా మారింది. ఈఓ కార్యాలయం, బాత్‌రూమ్‌లు లేవు. ప్రహరీ ఒక పక్క పూర్తిగా పోయింది. తాగునీరు, మరుగుదొడ్లు లేక వినియోగదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 82 స్టాల్స్ ఉన్నా 30 మంది రైతులు మాత్రమే వస్తున్నారు. నిత్యం సుమారు 800 మంది కొనుగోలుదారులకు 120 క్వింటాళ్ల మేర అమ్మకాలు చేస్తున్నారు.
రింగ్‌రోడ్ బజార్ పరిస్థితీ అంతే..
దాసన్నపేట రింగ్‌రోడ్డులో రూ.79 లక్షలతో నిర్మించిన రైతుబజార్‌లో 108 స్టాల్స్ ఉండేవి. రోడ్లు విస్తరణ పుణ్యమాని 52 స్టాల్స్ కూల్చేశారు. ఉన్న 56 స్టాల్స్‌లో 48 మంది రైతులు రోజుకు 250 క్వింటాళ్ల మేర అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రహరీ, ఈఓ కార్యాలయం, స్టోర్‌రూమ్‌లు లేవు. మరుగుదొడ్లు శిథిలమై వినియోగానాకి దూరంగా ఉన్నాయి. నెల రోజుల్లో స్టాల్స్ పునర్నిర్మాణం చేస్తామన్న అధికారులు తర్వాత బజార్‌వైపే చూడలేదు.
చీపురుపల్లిపై చిన్నచూపు..
చీపురుపల్లిలో 2016లో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన రైతుబజార్‌లో 47 స్టాల్స్ ఉన్నా 19మంది రైతులకు మాత్రమే కార్డులిచ్చారు. వీరిలో కేవలం పదిమంది మాత్రమే బజార్‌కు వచ్చి రోజుకు సుమారు 150 కిలోల మేర కూరగాయల విక్రయాలు చేపడుతున్నారు. వినియోగదారులు కూడా 30 లోపే ఉంటున్నారు. రైతులను గుర్తించి అమ్మకాలు పెంచడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యింది.
అన్ని హంగులున్నా అదే తీరు..
పార్వతీపురంలో 2000 సంవత్సరంలో రూ.15 లక్షలతో అన్ని హంగులతో రైతుబజార్ ఏర్పాటు చేశారు. బజార్‌లో 40 స్టాల్స్ ఉన్నా కేవలం 9 మంది రైతులు మాత్రమే ఉన్నారు. సుమారు 400 మంది కొనుగోలుదారులతో 40 క్వింటాళ్ల మేర అమ్మకాలు సాగిస్తున్నారు. రైతుల్ని గుర్తించి వారిని రైతుబజార్‌కు రప్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
కొటారుబిల్లి తెరిచేదెప్పుడు ...?
గంట్యాడ మండలం కొటారుబిల్లిలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన రైతుబజార్‌లో సరైన సౌకర్యాలు, వసతుల్లేక ప్రారంభించకుండా వదిలేశారు. రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తికాక రైతుబజార్ నిర్మాణం జరిగి ఏడాది కావస్తున్నా దాన్ని ప్రారంభించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు గాని, అధికారురులు గాని చొరవ చూపక పోవడం విశేషం.
స్పందించాలి
రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన రైతుబజార్ల అభివృద్ధిపై పాలకులు, అధికారులు దృష్టి సారించాల్సిన అభిప్రాయం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల సంఖ్య పెంచడంతో పాటు రైతుబజార్లలో సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.